3 రోజెస్ 66

ఆ రోజు నుంచి నేను కానీ మావయ్య కానీ వాళ్ళ ఇంటి గడప ఎరుగం. ఎవ్వరు లేని ఊరిలో ఉండి ఏం చేస్తాం అన్న ఆలోచన వచ్చి ఉన్నవి అమ్మేసి ఈ ఊరు వచ్చాము. ఉన్న డబ్బుతో సొంత ఇల్లు కొనుక్కుని మిగతా డబ్బుల్లో సగం నా పేరు మీద ఫిక్సడ్ డిపాజిట్ చేసి మిగతా సగం వడ్డీలకి తిప్పడం మొదలుపెట్టాడు. షూరిటీ, సెక్యూరిటీ చూసుకుని వడ్డీలకి తిప్పడం వల్ల మాకు బాగానే గడుస్తుంది, ఉన్నదాంట్లో సంతోషంగా ఉన్నాం ఇద్దరం.

ఒకరోజు పది మంది ఇంటికి వచ్చి మావయ్యతొ కూర్చున్నారు. అప్పటికే మేమీ బస్తీకి వచ్చి మూడేళ్లు, పైగా సొంతయింటి వాళ్ళం, పైగా మావయ్య వడ్డీ వ్యాపారం చేస్తాడు కనక కొంచెం గట్టిగా ఉంటాడు. ఈ సారి జరగబోయే అతి పెద్ద ధర్నాలో పాలుపంచుకోమని అందరికి చెపుతున్నాం, బాధ్యతగా వచ్చి చేరాలని చెపితే సరేనన్నాడు మావయ్య.

రెండు రోజుల తరువాత అందరితో కలిసి వెళ్ళాడు. ఇంటికి మాత్రం రాలేదు. బస్తీ మొత్తం అందరినీ దొరికిన వాళ్ళని దొరికినట్టు అరెస్ట్ చేసారని చెపితే ఏడుపు వచ్చేసింది. ఏం చెయ్యాలో తెలీలేదు. ఇంటి లోపలికి వెళ్లి దేవుడికి దణ్ణం పెట్టుకున్నాను. అన్నం సహించలేదు, ఎప్పుడు ఒంటరిగా అనిపించిందే లేదు. అర్ధరాత్రి దాటింది, ఒక్క మావయ్య మాత్రమే కాదు, పక్కింట్లో వాళ్ళు ఎదిరింట్లో వాళ్ళు ఎవ్వరు రాలేదు. ఆంటీలు అందరూ గుంపుగా నిలుచుని మాట్లాడుకుంటుంటే ఇంటి ముందు గచ్చు మీద కూర్చుని వింటున్నాను.

నా ఫ్రెండ్ అభయ్ నేను ఒక్కడినే కూర్చోవడం చూసి నా దెగ్గరికి వచ్చి కూర్చున్నాడు.

అభయ్ : భయంగా ఉందా

వినయ్ : ఇప్పుడు ఎలా రా.. మావయ్యని వదలరా

అభయ్ : అమ్మ చెప్పింది, రెండు రోజుల్లో వదిలేస్తారట

వినయ్ : రెండు రోజులా.. ఆమ్మో ఎలారా.. నాకు భయంగా ఉంది

అభయ్ : మా నాన్న కూడా ఉన్నాడు కదరా, వాళ్లంతా కలిసే ఉంటారు

వినయ్ : ఏమో.. అని కళ్ళు తుడుచుకున్నాను.

గుంపుగా మాట్లాడుకుంటున్న ఆంటీలలో నిలుచుని వాళ్ళు మాట్లాడేది వింటున్న వీధి చివర కిరాణా కొట్టు దుర్గరావు అమ్మాయికి అభయ్, వినయ్ ఇద్దరి మాటలు వినపడి వాళ్ళ దెగ్గరికి వెళ్ళింది. వినయ్ ని చూసి నవ్వింది.

“ఏరా వాడికి లేని భయం నీకెందుకు” అని అడిగితే అభయ్ “లేదక్కా.. వాళ్ళ ఇంట్లో వాడు వాళ్ళ మావయ్య, ఇద్దరే ఉండేది. అందుకే భయపడుతున్నాడు” అని చెప్పేసరికి వినయ్ వంక చూసింది.

“మీ అమ్మా నాన్నా లేరా” అని అడిగితే వినయ్ జరిగింది చెప్పాడు. జాలిపడింది

అభయ్ : ఇంతకీ నువ్వు ఎవరక్కా, నిన్నెప్పుడు చూడలేదే

“ఒరేయి, నేను తెలీదా.. రోజు కొనుక్కోవడానికి మా కొట్టుకి వస్తారు” అని వేలు పెట్టి చూపించింది.

వినయ్ : ఆ కొట్టు మీదేనా.. మరి నువ్వెందుకు మాకు ఎప్పుడు కనిపించలేదు.

“ఆడపిల్లనిరా, నన్ను కొట్టులోకి రానివ్వరు. ఇదిగో ఇప్పుడు బంద్ నడుస్తుంది, పైగా మగాళ్లందరూ జైల్లో ఉన్నారు. అందుకే బైటికి వచ్చాను”

అభయ్ : అబ్బో.. ఇంతకీ నీ పేరేంటి

“నా పేరు గీత, మరి మీవి ?”

అభయ్ : నా పేరు అభయ్

వినయ్ : నా పేరు వినయ్

గీత : తిన్నారా ఇంతకీ

అభయ్ : నేను తిన్నాను, వీడు తినలేదు.

గీతా : ఏరా.. ఏమైంది. ఇంట్లో అన్నం లేదా ?

వినయ్ : భయంగా ఉందక్కా.. మావయ్య..

గీత : మీ మావయ్య ఒక్కడే కాదు, తనకి తోడుగా ఇంకా చాలా మంది ఉన్నారు. అందరూ కలిసే ఉన్నారట, వాళ్ళని విడిపించడానికి హైదరాబాద్ నుంచి కేసిఆర్ కూడా వస్తున్నారని ఇప్పుడే న్యూస్లో చెప్పారు. ముందు పదా తిందువు

వినయ్ : ఆకలిగా లేదు అక్కా

గీత : సరే.. చెకోడీలు తింటారా, మా కొట్టుకి వెళదాం పదండి అంటే ఇద్దరు లేచి నిలబడ్డారు.

గీత ఇద్దరినీ వెంటబెట్టుకుని వెళుతుంటే తల్లి చూసినా ఏమనలేదు. ముగ్గురు వెళ్లి కొట్లో కూర్చున్నారు.

అభయ్ : నేను డబ్బులు తేలేదు

వినయ్ : నేను కూడా

గీత : అబ్బా.. అవసరం లేదులే.. తీసుకోండి

అభయ్ : నేను గొట్టాల ప్యాకెట్ తీసుకోనా

వినయ్ : అక్కా నేను రసగుల్లా తీసుకోనా

గీత నవ్వి “సరే తీసుకోండి” అంటే అన్ని మర్చిపోయి కూర్చుని తినడం మొదలుపెట్టారు ఇద్దరు. మధ్యలో చెరిసగం పంచుకోవడం చూసి నవ్వుకుంది.

గీత : మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సా

అభయ్ : అవునక్కా

గీత : ఎప్పుడు ఇలాగే ఉండండి ఇద్దరు. ఇక వెళ్ళండి, మా అమ్మ చూసిందంటే తిడుతుంది. మీకు ఫ్రీగా ఇచ్చానని ఎవ్వరికి చెప్పొద్దు, సరేనా అంటే ఇద్దరు తల ఊపారు. నవ్వి పంపించేసింది.

వినయ్ : అక్క చాలా మంచిది కదరా

అభయ్ : అవును.. మనం ఎలాగోలా ఈ అక్కతొ ఫ్రెండ్షిప్ చెయ్యాలిరా, అప్పుడు మనం ఇలానే అన్ని ఫ్రీగా తినొచ్చు. ఏమంటావ్..?

వినయ్ : సరే అంటాను

అర్ధరాత్రి వరకు బైటే గడిపి ఇంట్లోకి వెళుతుంటే గీత అక్క పిలిచింది.

వినయ్ : ఏంటక్కా

గీత : చిన్న పిల్లాడివి, ఒక్కడివే వద్దులే.. మా ఇంటికి వెళదాం, ఇల్లు తాళం వేసిరా అంటే సరే అని తాళం వేసి వచ్చాడు. వినయ్ చెయ్యి పట్టుకుని నడుస్తూ నీకేం భయం లేదు, అందరం ఉన్నాంగా.. మీ మావయ్య కూడా వచ్చేస్తాడు అని ధైర్యం చెపితే ఊ కొట్టాడు.

మొదటి సారి మావయ్య కాకుండా ఇంకొకరితొ పడుకోవడం, బాగా ఏడవడం వల్లో అర్ధరాత్రి దాటడం వల్లో తెలీదు కానీ వెంటనే నిద్ర పట్టేసింది.

పొద్దున్నే లేచేసరికి గీత అక్క కాలు నా మీద ఉంది, వెంటనే తీసేసి లేస్తే తనూ లేచింది. గీత అక్క వాళ్ళ అమ్మ వచ్చి “గీతా.. అందరినీ వదిలేసారట, వచ్చేస్తున్నారు” అనగానే గీత అక్క యే.. అని హైఫైక్ కోసం చెయ్యి ఎత్తింది, ఏమైందో తెలీదు, ఆనందంలో వాటేసుకున్నాను. ఏడుపు వచ్చేసింది. వెంటనే లేచి ఇంటికి పరిగెత్తాను.

త్వరగా స్నానం చేసి మిగిలిన అన్నం కూర ఉంటే అన్ని పారేసి, అంట్లు తోమి ఇల్లు ఊడ్చి శుభ్రంగా సర్దేసాను. ఈ పనులన్నీ చేసేసరికి గంట గడిచిపోయింది. స్నానం చేసి రెడీ అయ్యి ఒక్కడినే కూర్చుని ఎదురుచూస్తుంటే బైట బండి శబ్దం వినిపించింది. ఏడుపు వచ్చేసింది, బైటికి పరిగెత్తాను. నన్ను చూడగానే ఎత్తుకుని ఇంట్లోకి తీసుకొచ్చేసాడు.

చందు : ఎంత బరువు ఉన్నావో చూడు, అని మంచం మీద కూర్చోబెట్టి రేయి.. విన్ను.. ప్రామిస్, ఇంకెప్పుడు అలాంటి జోలికి వెళ్ళను. సరేనా.. ప్రామిస్ అన్నాగా అని కళ్ళు తుడిచాడు

వినయ్ : ఎంత భయం వేసిందో తెలుసా (పట్టుకున్న మావయ్య నడుముని ఇంకా వదల్లేదు)

చందు : నాకూ భయం వేసింది, ఒక్కడివే ఎలా ఉన్నావో అని. రాత్రంతా నిద్ర పోలేదు నేను తెలుసా

వినయ్ : నేను కూడా

చందు : సరే ఉండు స్నానం చేసి వస్తాను, బైటికి వెళ్లి ఏమైనా తెచ్చుకుందాం అని లేచి స్నానం చేసి బైటికి వచ్చేసరికి ఎవరో అమ్మాయి వినయ్ తొ మాట్లాడుతుంది. బట్టలు వేసుకుని బైటికి వచ్చాడు.

వినయ్ : తనే నా మావయ్య, మావయ్యా తను గీత అక్క. రాత్రి వాళ్ళ ఇంట్లోనే పడుకున్నా

“థాంక్స్” అన్నాడు నవ్వుతూ చందు.

గీత : మీరంటే బాగా ఇష్టం వాడికి, బాగా బెదిరిపోయాడు. వాడి ఆనందం చూద్దామని వచ్చాను. మిమ్మల్ని కేసిఆర్ విడిపించాడా.. ఆయన్ని చూసారా

చందు : లేదు, ఆయన వస్తే ఇంకా పెద్ద గొడవ అవుతుందని రాకముందే మమ్మల్ని వదిలేసారు.

గీత : ఓహ్.. సరే నేను వెళతాను

చందు : మీ పేరు

గీత : గీత.. ముల్లయ్య కాలేజీ ఇన్స్టిట్యూట్లో డిగ్రీ చేస్తున్నాను

చందు : అరె.. నేనూ అదే కాలేజీ, కాకపోతే నాది ఇంజనీరింగ్ బ్లాక్.

ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటుంటే ఇద్దరి మొహాలు చూస్తున్నాడు వినయ్.

గీత : సరే చందు, నేను వెళతాను.

చందు : నెంబర్ ఇవ్వచ్చుగా, ఎప్పుడైనా అవసరం ఉంటే మీరు నాకు ఫోన్ చెయ్యొచ్చు

గీత నవ్వింది. “వినయ్.. మీ మావయ్య నువ్వనుకున్నంత మంచి వాడు కాదు” అని నవ్వుతుంటే చందు గట్టిగా నవ్వాడు. గీత వెళ్ళిపోయాక మామా అల్లుడు ఇద్దరు బైటికి వెళ్లిపోయారు.

తరువాతి నాలుగు నెలలు అస్సలు కాలేజీ మొహం చూసిందే లేదు. గీత అక్క ఎంత దెగ్గరయ్యిందంటే అభయ్ కంటే గీత అక్కతోనే ఎక్కువగా ఆడుకునేవాడిని.

నాలుగు నెలల తరువాత తెలంగాణ వచ్చిందని సంబరాలు చేసుకున్నారు, బళ్ళు తెరుచుకున్నాయి, అంతా మాములుకి వచ్చేసింది. ఈ గొడవల్లో మా ఏడో తరగతి బోర్డు ఎగ్జామ్స్ లేకుండానే మాములు అనువల్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయిపోయాము.

చందు : విన్ను.. ఊరికే అలా గీత అక్క దెగ్గరికి వెళ్లి కూర్చోకూడదు

వినయ్ : ఏమైంది మావయ్య

చందు : నువ్వు ఊరికే గీతా అక్క దెగ్గర కుర్చుంటుంటే, నేనే నిన్ను కావాలని పంపిస్తున్నానని అనుకుంటున్నారు కొంతమంది. మన వల్ల అక్క గురించి తప్పుగా మాట్లాడుకోగూడదు కదా

వినయ్ : సరే.. ఇక నుంచి వెళ్ళనులే

చందు : అస్సలు వెళ్లొద్దని కాదు, ఊరికే వెళ్ళకు. రోజుకి ఒకసారి రెండు సార్లు అంతే. కూర్చుంటే కొంచెంసేపు అక్కడే కూర్చో అటు ఇటు తిరగకు, సరేనా

వినయ్ : సరే..

ఇదే విషయం గీత అక్కకి చెప్పా, అలాగా అంది. తరువాత దాని గురించి పెద్దగా మాట్లాడలేదు కానీ ఒకరోజు నన్ను పిలిస్తే ఇంటికి వెళ్లాను.

వినయ్ : ఏంటక్కా..

గీత : ట్యూషన్ చెప్తా వస్తావా

వినయ్ : నాకెందుకు ట్యూషన్ అనగానే అక్క మొహం మాడిపోవడం చూసి సరే మావయ్యని అడుగుతాలే అన్నా

గీత : ట్యూషన్ ఫీజు ఏం అవసరం లేదు

వినయ్ : అలా అయితే ఇక్కడికే వచ్చి చదువుకుంటాను అనగానే అక్క సంబరపడితే నేనంటే ఇష్టం ఏమో అనిపించింది.

ఇంటికి వచ్చేసరికి మావయ్య ఎవరితోనో ఫోన్ మాట్లాడుతు నన్ను చూసి వచ్చాడు అని ఫోన్ పెట్టేసాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *