ఊరి రైల్వేస్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో చిన్న స్థలం. చుట్టూ కాంపౌండు, గోడ కట్టి గేట్ పెట్టారు. సాయంత్రం ఐదు అవుతుండగా స్కూటీ ఒకటి వచ్చి ఆగింది, అమ్మాయి ఫోన్లో మాట్లాడుతూనే స్కూటీ దిగింది.
“అమ్మా.. ఎందుకు మాటిమాటికీ ఫోన్ చేస్తావ్, పనిలో ఉంటానని తెలుసు కదా.. పద్దాక ఫోన్ చెయ్యకు” అని పెట్టేసి, ఇంకో ఫోన్ చేసింది. “సర్, నేను మీరిచ్చిన అడ్రెస్కి వచ్చాను, బైటే ఉన్నాను” అనగానే కాల్ కట్ అయ్యింది.
తరువాతి నిమిషంలో ఒకతను బైటికి వచ్చి గేటు తీసి నవ్వి లోపలికి రమ్మంటే పలకరింపుగా తిరిగి నవ్వి స్కూటీ కీస్ అందుకుని లోపలికి వెళ్ళింది.
మీ పేరు..?
“మాధవిలత” అంది ఆ అమ్మాయి
“మీలాంటి వారు ఒకరు ఉంటారని నేను అస్సలు ఊహించలేదు” అని మాట్లాడుతూనే లోపలికి నడిచాడు. వెంటే వెళ్ళింది మాధవిలత.
“నేనున్నాగా” అంది నవ్వుతూ, “చచ్చిపోవాలి అనుకున్న వాళ్లకి కూడా తోడు అవసరం, చచ్చిపోయాక వాళ్ళు ఏమైనా చెయ్యలేని పనులు ఉంటే అవి నేను చేసి పెడతాను”
ఇద్దరు కూర్చున్నారు. కాఫీ కలిపి చేతికిస్తే అందుకుంది. చేతికి ఉన్న వాచిలో ఒకసారి టైం చూసుకుని చుట్టూ చూసింది.
“మిమ్మల్ని ఏమని పిలవాలి ?”
“పెద్ద పేరు కదా, లత అని పిలవండి” అంది కాఫీ సిప్ చేస్తూ
“ఓకే లత గారు, ఇంతకీ మీరు ఎంత తీసుకుంటారో చెప్పలేదు”
లత : అది నేను చెప్పాలి అంటే, ముందు నాకు మీ గురించి తెలియాలి. ఆ తరువాత మీరు చెయ్యాలి అనుకునే పని తెలియాలి. మీరేంటో మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలీకుండా నేనేది చెయ్యలేను, చేసి రిస్క్ తీసుకోలేను. ఇప్పటి వరకు మీ పేరు చెప్పలేదు.
“ఓహ్.. అలాగే లత గారు, అంత క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఏమి లేదులేండి” అంటే ఇద్దరు నవ్వారు.
లత : ఇంకా మీ పేరు చెప్పలేదు
“మై బాడ్.. సారీ.. ఐయామ్ వినయ్” అన్నాడు నవ్వుతూ
లత : ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారా.. చనిపోబోయే ముందు కూడా మీ మొహంలో నవ్వు స్పష్టంగా, స్వచ్ఛంగా ఉంది.
వినయ్ మళ్ళీ నవ్వాడు.
లత : ఓకే నాకు మీ కధ చెప్పండి.
నా పేరు వినయ్, పేరుకు తగ్గట్టే అందరిపట్లా వినయంగానే ఉంటాను. ముద్దుగా విన్ను అని పిలుస్తారు ముగ్గురు.
ఒకడు నా స్నేహితుడు అభయ్
ఇంకొకరు నన్ను పెంచిన నా మావయ్య చందు
మరొకరు.. మరొకరు నేను ప్రేమించిన నా అత్తయ్య (గుండె వేగం పెరిగింది) గీత.. గీతానిత్యమయి
లత : వాట్..! మీ అత్తయ్యని ప్రేమించారా
వినయ్ : నేను ప్రేమించాకే నాకు అత్తయ్య అయ్యింది
లత : సొ సాడ్
తను చనిపోయే ముందు.. అంటే నిన్న. నన్ను ఒక కోరిక కోరింది. అది తీర్చుదామనే ఇక్కడికి వచ్చాను. ఇవ్వాళ నేను చనిపోబోతున్నాను, వాళ్ళ కోరిక తీర్చడానికి నేనున్నాను కానీ నా కోరిక తీర్చడానికి ఎవ్వరు లేరు, అందుకే మిమ్మల్ని ఎంచుకున్నాను.
లత : అయితే వినయ్ గారు లవ్ ఫెయిల్ అయ్యి చనిపోతున్నారన్నమాట
వినయ్ : కాదనుకుంటా, నా కధ చెపుతాను. అంతా విన్నాక మీరే చెప్పండి ఎందుకు చావాలని అనుకుంటున్నానో
“మొదలెట్టండి మరి” అంది లత ఉత్సాహంగా
★★★
తెలంగాణ ఇంకో ఆరు నెలల్లో వస్తుందనగా మొదలయింది నా కధ. రోజుకో రాస్తారోకో, రెండు రోజులకి ఒక బంద్. అప్పటికి నేను కాలేజీ పిల్లాడినే..
తెలంగాణ ఉద్యమం గురించి ఏమి తెలీదు, రోజు కాలేజీకి రావడం, అన్న వాళ్ళు బంద్ పిలుపుని ఇవ్వగానే అదే బస్సులో సంతోషంగా ఇంటికి తిరిగి రావడం. ఇదే మా పిల్లలందరికి తెలిసింది.
అప్పుడప్పుడు భయపడేవాళ్ళం కూడా, ఒక వేళ తెలంగాణ ఇచ్చేస్తే ఇక బందులు ఉండవు, రోజూ కాలేజీకి వెళ్లాల్సి వస్తుందని. పిల్లలం అందరం ఇంటి దెగ్గరే ఆడుకునే వాళ్ళం, పెద్దవాళ్లు గుంపుగా బండ్ల మీద వెళుతుంటే వాళ్ళని చూసి గర్వంగా చెప్పుకునే వాళ్ళం మా అన్నయ్య ఉన్నాడంటే, మా నాన్న ఉన్నాడని. నేనూ చెప్పేవాడిని, మా మావయ్య ఉన్నాడని..
మా మావయ్య.. పేరు చందు.
పుట్టింటికి వచ్చిన అమ్మ అందరితో కలిసి తిరుపతి వెళుతుంటే బస్సు బోల్తా పడి అందరూ చనిపోయారు. నాన్న నన్ను అమ్మమ్మ ఇంటికి పంపివ్వలేదు, అదే రోజు పరీక్ష ఉండటం వల్ల మావయ్య కూడా వాళ్ళతో వెళ్ళలేదు.
అమ్మ చనిపోయిన నాలుగు రోజులకే నాన్న నన్ను మావయ్య దెగ్గర విడిచిపెట్టేసాడు, తరువాత ఆయన వేరే పెళ్లి చేసుకున్నాడు అది వేరే విషయం.