ఆగస్టు నెల. ఉదయమంతా మేము మా అబ్బాయి సామానులని కారులో ప్యాక్ చేస్తూనే వున్నాము. మా అబ్బాయి మదన్ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తున్నాడు. ఆరోజు కొంచెం వేడిగానే వుంది. దాంతో మదన్, నా భర్త, నేను కారులో సామాను సర్దేసరికి చెమటలతో తడిచాము. అప్పటికే డిక్కీ పూర్తిగా నిండిపోయింది. వెనుక సీట్ లో కూడా ఎక్కువ స్థలం మిగల్లేదు. మదన్ తన చివరి వస్తువులని తీసుకోవడానికి ఇంట్లోకి వెళ్ళాడు.
వాడు ఇంట్లోంచి బయటకు రావడం విన్నాను. నేను వెనక్కి తిరిగి చూసేసరికి వాడు తన 42 అంగుళాల ఫ్లాట్ స్క్రీన్ టీవీని మోసుకురావడం చూశాను.
“టీవీని ఎక్కడ పెడతావు?” అని వాళ్ళ నాన్న వాడిని అడగడం వినిపించింది.
“ఏమో, నాకు తెలియదు, కానీ నేను దాన్ని వదిలి వెళ్లాలనుకోవడం లేదు. బహుశా వెనుకున్న సీట్ లో కొన్ని సామాన్లని సర్ది అడ్జస్ట్ చేసుకోవచ్చేమో చూడాలి” అని అన్నాడు.
“అలా కుదిరే అవకాశం లేదురా” నేను వాడికి చెప్పాను.
మదన్ కారులోకి చూశాడు. “మనం దానిని ముందు సీటు మధ్యలో పెట్టవచ్చు.”
“సరే కాలేజీ కుర్రోడా” అని అన్నాను.
“అయితే మీ అమ్మ ఎక్కడ కూర్చుంటుంది ?” నా భర్త వాడిని అడిగాడు.
వాడి ముఖంలో ఒక పరిష్కారం కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నట్లు నేను గమనించాను.
“నాకు ఒక ఆలోచన వచ్చింది,” వాడు చెప్పాడు. వాడు డ్రైవర్ పక్క సీటు వైపు తలుపుని తెరిచాడు. టీవీని మధ్యలో పెట్టాడు. ఆపై వాడు లోపలికి వెళ్లి కూర్చున్నాడు.
“చూడమ్మా, ఇక్కడ చాలా స్థలం వుంది. నా పక్కన కూర్చో” అని చెప్పాడు.
నేను నా కొడుకు పక్కన కూర్చోవడానికి ప్రయత్నించాను. నేను సీటులో కూర్చోగలిగాను, అయితే తలుపు వేయడానికి వీలుపడలేదు. నాదేం భారీ శరీరం కాదు. నేను నేను ఐదు అడుగుల పొడవు ఉంటాను, యాభై కిలోల బరువు మాత్రమే వుంటాను. నా కొడుకు మొత్తం స్థలాన్ని ఆక్రమించాడు. వాడు అప్పటికే ఆరు అడుగుల పొడవుకు పైగా ఉన్నాడు, సుమారు తొంభై కిలోల బరువు ఉన్నాడు.
“మొత్తం స్థలాన్ని ఆక్రమిస్తున్నది నేను కాదు, నువ్వు. ఇది కుదరదు. నీకు ఒకటి చెబుతాను, టీవీని వదిలిపెట్టు, మేము నిన్ను కలవడానికి వచ్చినప్పుడు దానిని మా వెంట తెస్తాము” అని చెప్పాను.
“నేను అందుకు ఒప్పుకోను” అని వాడు మొండిపట్టు పట్టాడు. దాంతో నేను కారులోంచి దిగి తలుపు పక్కన నిలబడ్డాను.
“మదన్ ! ఇక్కడ చాలా వేడిగా ఉంది. నువ్వే డిసైడ్ చేసుకో” అన్నాను.
“ఓకే ! నువ్వు నా వొడిలో కూర్చోవచ్చు” వాడు నా వైపు చూస్తూ చెప్పాడు.
