ఒకామె చీరకట్టుకొని స్లీవ్ లెస్ జాకెట్ వేసుకొని నిషాని చూస్తూ “హేయ్…. సోలో బర్డ్… సిగిరెట్ కావాలా” అంది.
ఆమె చూడడానికి మందు తాగినట్టు అనిపిస్తుంది. ఆమె దగ్గర సిగిరెట్ తీసుకొని నోట్లో పెట్టుకొని వెలిగించింది.
ఆ పొగ గొంతులోకి వెళ్ళగానే దగ్గు వచ్చి సిగిరెట్ ఒక చేత్తో పట్టుకొని అలానే ఉంది.
ఆమె నిషాని చూసి “ఫస్ట్ టైం” అంది.
నిషా నిలువుగా తల ఊపింది.
ఆమె “ఓకే..” అని పక్కకు వెళ్ళింది.
నిషా ఆ నీళ్ళలోని అలలను చూస్తూ ఉంటే, తన జ్ఞాపకాలు కూడా అలా అలలు లాగా గతంలోకి ప్రయాణం చేశాయి.
గతం:
తన భర్త సాత్విక్ బాల్కనీలో సిగిరెట్ కాలుస్తూ ఉన్నాడు. దొరికిపోతానేమో అన్నట్టుగా హడావిడిగా దమ్ము పీలుస్తూ పొగ బయటకు వదులుతున్నాడు.
పక్కకు తిరిగి చూడగా…. నిషా నడుము మీద చేయి పెట్టుకొని తననే కోపంగా చూస్తూ ఉంది.
సాత్విక్ కోపంగా ఉన్న భార్యని చూసి “సారీ” అంటూ నవ్వేశాడు.
నిషా కోపంగా ముందుకు వచ్చి చేతులు కట్టుకొని “డాక్టర్ వి…. ఒకళ్ళని మానెయ్యమని చెప్పాల్సింది పోయి నువ్వు సిగిరెట్ కాలుస్తున్నావా” అంది.
సాత్విక్ “నేనేం తాగమని చెప్పడం లేదు కదా… నాకు నేను ఒంటరిగా ఉన్నప్పుడు కాల్చుకుంటున్నాను” అన్నాడు.
నిషా “తెలివి తేటలకు మాత్రం తక్కువేం లేవు…” అంది.
అణుబాంబ్ లా పేలుతుంది అనుకుంటే… ఇలా విసుక్కుంటూ ఉండే సరికి సాత్విక్ కి ముద్దుగా అనిపించింది.
నిషా, తన భర్త మొహం పై నవ్వు చూసి కోపమొచ్చి “ఇటివ్వు నేను కూడా కాలుస్తా…” అని చేతికి తీసుకుంది.
సాత్విక్ నవ్వుతూ తన నోట్లో పెట్టాడు. నిషా ఒక దమ్ము పీల్చి పెద్దగా దగ్గి “ఎలా కాలుస్తావ్.. దీన్ని… ఇంత చండాలంగా ఉంది” అంది.
సాత్విక్ “టాలెంట్” అన్నాడు.
నిషా “అబ్బో… బోడి టాలెంట్…” అని పెదవి విరుచుకుంది.
సాత్విక్ సిగిరెట్ పక్కన పడేసి….. నిషాకి ముద్దు పెట్టబోయాడు.
నిషా “వద్దు… వద్దు… సిగిరెట్ వాసన వస్తుంది….” అని అంటున్నా సరే… అలాగే ముద్దు పెట్టేశాడు.
సాత్విక్ “హుమ్మ్…. ఇప్పుడు నీకూ కూడా అలవాటు అయింది కాబట్టి… నాకు ముద్దు పెట్టడానికి ప్రాబ్లం లేదు” అని చిలిపిగా నవ్బాడు.
నిషా అతన్ని కోపంగా తోసేసి “ఇంకో సారి సిగిరెట్ కాల్చావో… మనిద్దరి రిలేషన్ మీద ఒట్టు” అంటూ వెళ్లి పోయింది.
సాత్విక్ నవ్వుతూ మరో సిగిరెట్ వెలిగించాడు.
ఇంతలో తన చేతిలో ఉన్న సిగిరెట్ అంచుకు రావడంతో నిషా తేరుకొని నీళ్ళలోకి విసిరేసింది.
ఆ సిగిరెట్ పీక కొద్ది సేపు ఆ నీళ్ళలో అలానే ఉండి… కొద్ది సేపటికి ఆ నీళ్ళలో మునిగిపోయి అడుగుకు చేరుకుని అక్కడున్న మట్టిపై పడింది. కొన్నాళ్ళకు అది ఆ మట్టిలో కలిసిపోతుంది.
కాని ఇష్టమైన వ్యక్తితో అయ్యే జ్ఞాపకాలు మాత్రం మనిషి చచ్చే వరకు వస్తూనే ఉంటాయి.
నిషా ఫోన్ బయటకు తీసి ఆన్ లైన్ లోకి వెళ్లి ఒక ప్రొఫైల్ ని చూసింది. రిలేషన్ షిప్ స్టేటస్ డైవర్స్ డ్… సింగిల్ అని రాసి ఉండేది. ఇప్పుడు ఇన్ రిలేషన్ విత్ జాక్వలెన్ అని ఉంది.
ఫోటోస్ లోకి వెళ్ళింది.
ఒక ఫోటో లో జాక్వలెన్ బికినీ వేసుకుని ఉంటే, సాత్విక్ ఆమె నడుము చుట్టూ చేయి వేసి ఉన్నాడు.
ఆ ఫోటోకి హెడింగ్ “బ్యూటిఫుల్ బీచ్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ విత్ బ్యూటిఫుల్ వుమెన్” అని ఉంది.
నిషా ఆ ఫోటోని చూస్తూ ఉంటే…. కన్నీరు కళ్ళ తడిపేస్తూ ఉంటే… రెప్పలు మాత్రం బయటకు రావద్దు అంటూ అడ్డు కట్ట వేసేసాయి. ఆ రెంటి మధ్య జరిగిన యుద్ధంలో ఒక బొట్టు మాత్రం పక్కలుగా జారి కింద పడింది.
నిషా వేగంగా గాలి పీల్చుకుంటూ ఆ మూడ్ లోనుండి త్వరగా బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది. కాని గతం మరో జ్ఞాపకాన్ని కళ్ళ ముందుకు తెచ్చింది.
గతం :
నిషా “బీచ్ కి వెళ్దాం…. ప్లీజ్…. ” అని అడిగింది.
సాత్విక్ “సారీ బేబి…. కుదరదు…”
నిషా “ప్లీజ్… సాత్విక్…. ఒకే ఒక్క రోజు…. పొద్దున్నే వెళ్లి… సాయంత్రానికి వచ్చేద్దాం… ప్లీజ్” అని బ్రతిమలాడుతుంది.
సాత్విక్ “నిషా… అలా చిన్న పిల్లలా అడగకు…. నీకూ పెళ్లి అయింది…. నీ హస్బెండ్ అంటే నేను బిజీగా ఉన్నాను….. అర్ధం చేసుకో” అన్నాడు.
నిషా డిజప్పాయింట్ అయి “పో… నీతో మాట్లాడను” అంటూ మంచం పై దుప్పటి కప్పుకొని పడుకుంది.
సాత్విక్ చిన్నగా నవ్వుకుని “ఎక్కడుంది… నా బేబి” అంటూ దుప్పటిలో దూరి ఆమెను చుట్టేసుకున్నాడు.
—
—
—
నిషా నవ్వుకుంటుంది.
ఇంతలో బోటు పెద్ద శబ్దం “కూ…” అని చేసింది.
నిషా “క్రిష్ చెప్పింది నిజమే…. ఈ ఊరు పాపపు ఊరు… ఎప్పుడు శబ్దాలు చేస్తూనే ఉంటుంది” అనుకుంటూ వెనక్కి క్రిష్ మరియు కాజల్ లు కూర్చున్న టేబుల్ దగ్గరకు వచ్చింది.