నిజమే గురువర్యా ఆ రాక్షసుడు గుహుడు వల్ల జ్యోతిరాదిత్యుడు కి “రాక్షస విద్యలు ” కూడా సిద్దించాయి..ఆ విద్యలని కొంచెం మన రాజసింహుడికి నేర్పించాను..మీరు ఆందోళన పడకండి..
అలాగే భేతాళా,కానీ ఆందోళన మాత్రం తప్పడం లేదు ఎలా ఈ గండం గట్టెక్కుతారో ఈ యువకులు అని..
అంతా మంచే జరుగుతుంది అని ఆశిద్దాం గురువర్యా.
సరిగ్గా ఒక రోజు తర్వాత ధనుంజయుడు అతని ధర్మపత్ని అయిన శ్రీదేవి ఇద్దరూ వారి సైన్యాల్ని సన్నద్ధం చేసి వచ్చారు..
(ధనుంజయ మహారాజు రూపం నాలో ఆశ్చర్యం అవధులు దాటేలా చేసింది…తను అచ్చు ఏ మాత్రం తేడా లేకుండా నాలాగే ఉన్నాడు నా రూపు తో…)
ధనుంజయుడు కి ఆత్మీయ స్వాగతం పలికిన రాజ్యవర్ధనుడు యుద్ధానికి సంబంధించిన సన్నాహాలు,రాజసింహుడు సూర్యకీర్తి ల విషయాలు చెప్పాడు..
ధనుంజయ మహారాజు ఒక్కసారి ఆ సైన్యాధ్యక్షుడు ని పిలిపించు బావా, నాకూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి ,అతడికి చెప్పడం మనకు ఉపయుక్తంగా ఉంటుంది అనేసరికి రాజ్యవర్ధనుడు ,బావా ఒక్కటి అడుగుతాను చెప్తావా నిజంగా నా పైన ఒట్టు వేసి అని అనగా ఏంటో చెప్పు బావా అని ధనుంజయ మహారాజు అడిగాడు.
బావా మా అక్క శ్రీదేవి కాకుండా నీకు ఎవరైనా ప్రియ సఖులు ఉన్నారా??
ఏంటి రాజ్యవర్ధనా ఏమంటున్నావ్ నువ్వు?
బావా నీ పైన అనుమానం కాదు,కానీ మన రాజసింహుడు ని చూస్తుంటే నిన్ను చూసినట్లే ఉంది అందుకే అడిగాను తప్పుగా మాత్రం అనుకోకు..
ఏంటి నువ్వనేది రాజ్యవర్ధనా??నా లాగా ఉన్నాడా??
అవును బావా,ఒక్క తేడా కూడా లేదు..అచ్చు గుద్దినట్లు నీవే..
ధనుంజయ మహారాజు ఒక్కసారిగా కూలబడిపోయాడు ఆనందం,బాధ రెండింటితో..
బావా ఏమైంది అని రాజ్యవర్ధనుడు లేపి అడిగేసరికి,కాసేపటికి సంభాళించుకొని రాజ్యవర్ధనా ఇన్నాళ్ళకి మా అక్క “మహాదేవి” ఆచూకీ లభించింది, వెంటనే నా అల్లుడు ని ప్రవేశపెట్టు అని ఆనందభాష్పాలు తో మాట్లాడాడు..
రాజసింహుడు ని రమ్మని కబురు పంపి,బావా ఏంటి నువ్వు అనేది??నీకు అక్క ఉన్న విషయం మాకెందుకు చెప్పలేదు??
ఏమని చెప్పాలి రాజ్యవర్ధనా??మహాదేవి ఆచూకీ నాకు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు కనిపించకుండా పోయింది.. తిరగని ఊరు లేదు వెతకని రాజ్యం లేదు…ఇక మహాదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది అని బాధని దిగమింగుకొని బ్రతుకుతున్న నాకు ఒక చక్కటి శుభ వార్త చెప్పావ్ అంటూ హత్తుకున్నాడు ధనుంజయ మహారాజు..
బావా నాకూ చాలా సంతోషంగా ఉంది,నిజానికి రాజసింహుడు మీ రాజ్యంలోనే మన భేతాళుడు కి దొరికాడు..తన చిన్న వయసులో నుండి మన భేతాళుడే అతని బాగోగులు చూసుకుంటున్నాడు అని ఆనందంగా చెప్పాడు..
ఏంటి నా రాజ్యం లోనే ఉన్నాడా?మరి మా అక్క మహాదేవి ఆచూకీ ఏమైనా చెప్పాడా భేతాళుడు?
లేదు బావా, రాజసింహుడు అనాధగా ఉంటే మన భేతాళుడు తీసుకొచ్చాడు అని చెప్పాడు..
కాసేపు మళ్లీ ధనుంజయ మహారాజు బాధలో మునిగిపోయాడు..శ్రీదేవి రాజ్యవర్ధనుడు ధైర్యం చెప్పి కనీసం రాజసింహుడు అయినా మనకు లభించాడు అదే సంతోషం అని ధైర్యం చెప్పారు..
రాజసింహుడు,భేతాళుడు, సూర్యకీర్తి లు కాసేపటికి వచ్చారు..
రాజసింహుడు ఆశ్చర్యం తో ధనుంజయ మహారాజు ని చూస్తుంటే,ధనుంజయుడు మాత్రం వడివడిగా వెళ్లి రాజసింహుడు ని కౌగిలించుకున్నాడు ఆనందంతో..
కాసేపు రాజసింహుడు ఒడిలో బాధ తీరేలా రోదించి సంభాళించుకొని, ఒరేయ్ అల్లుడూ అమ్మ గురించి ఏమైనా తెలుసా నీకు అని అడిగాడు..
అప్పుడు అర్థం అయింది రాజసింహుడికి చూచాయగా, లేదు మామా అమ్మ రూపు మాత్రం గుర్తుంది,నాకు నాలుగేళ్ళ ప్రాయం అనుకుంటా ఎవరో దుండగులు వచ్చి దాడి చేసారు, అప్పుడు మేము అడవిలో తల దాచుకునేవాళ్ళము..తెలివిగా అమ్మ నన్ను దాచేసి ఉంచింది..నా కళ్ళ ముందరే అమ్మను చంపేసి వెళ్లిపోయారు ఆ దుండగులు,అలాగే ఒక వారం రోజులు ఏమీతెలియని స్థితిలో ఉన్న నన్ను ఆ అడవి మనుషులు మట్లి రాజ్యం లోకి తీసుకెళ్లారు.అక్కడే అనాధగా ఉన్న నన్ను ఇదిగో నా గురువు భేతాళుడు తీసుకొచ్చి సంరక్షించాడు అని కళ్లనీళ్లతో చెప్పాడు రాజసింహుడు.
భేతాళా ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు నువ్వు మా రాజసింహుడు గురించి?
క్షమించాలి మహారాజా,తను యవ్వన ప్రాయంలోకి అడుగుపెట్టినప్పుడు నుండి నేను మీ రూపురేఖలు గమనించడం మొదలు పెట్టాను,కానీ మనిషిని పోలిన మనుషులు ఉంటారు అన్న నెపంతోనే మీకు తెలియజేయలేదు,అందులోనూ మీకు ఎవరూ తోబుట్టువులు లేరు కదా అని నేనే సంరక్షించాను..
ఎలాగైతే ఏముంది భేతాళా,నువ్వు మహోపకారం చేసావు నీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అంటూ చేతులెత్తి దండం పెట్టాడు ధనుంజయ మహారాజు..
మహారాజా తెలిసో తెలియక నేను రాజసింహుడు ని సంరక్షించడం పెద్ద మేలే అయ్యింది,ఇది నా కర్తవ్యం అంతే అంటూ వినయంగా ధనుంజయ మహారాజు కి ప్రతి నమస్కారం చేసాడు..
(భేతాళుడు మనసులో ఏదో చిన్న ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది)..
రాజసింహా,అమ్మ ని చంపిన దుండగులు నల్లటి దుస్తులతో మొహం నిండా విభూతి తో వచ్చారా??
అవును మామా వాళ్ళే ఖచ్చితంగా…
ఇంతలో భేతాళుడు మహారాజా, అయితే వాళ్ళు “అభీరకులు”అన్నమాట,వాళ్ళకి ఏమి శత్రుత్వం రాజసింహుడు యొక్క మాతతో??
అదొక పెద్ద కథ భేతాళా,ఈసారి చెప్తాను అంటూ దాటవేసాడు ధనుంజయ మహారాజు..
మళ్లీ తనే మాట్లాడుతూ, రాజసింహా మన శత్రువులు అయిన “అభీరకులు” పైన ప్రతీకారం తీర్చుకోవా??
చెప్పు మామా,వాళ్ళ తలలు తెగ నరుకుతాను అంటూ కోపంగా రాజసింహుడు అనేసరికి,ఇదిగో ముందున్న యుద్ధంలో అభీరక మహారాజు “శిశుపాలుడు” పాల్గొంటున్నాడు, మొదటగా వాడి తల తెగ నరికిన తర్వాతే మిగిలిన వారి సంగతి చూడు అంటూ కర్తవ్య నిర్దేశనం చేసాడు ధనుంజయ మహారాజు.
అందరూ యుద్ధసన్నాహల్లో మునిగిపోయారు ఒక్క భేతాళుడు మాత్రం ఏదో ఆలోచనలో మునిగిపోయాడు..భేతాళుడు పరిస్థితి ని గమనించిన రాజసింహుడు ఏమైంది అని ఆరాతీయగా, ఏమీలేదు అని దాటవేసాడు.