“ఆ నేనే. నాకు లేట్ అవుతుంది. తను షాపింగ్ అంది, నేనేం చెయ్యను. మొన్నెప్పుడో షాపింగ్ అన్నానుట, నాకు గుర్తు కూడా లేదు. పొద్దున గుర్తు చేసింది, ఎవడికి గుర్తు, అప్పుడేదో అన్నాను. ఇప్పుడు షాపింగ్ అంది, వెళ్ళాలి. ఫ్రీ అయ్యాక మెసేజ్ ఇస్తాను. ఏ టైం అవుతుంది అంటే ఏమో, 1 లేదా 2, అవ్వచ్చు, తొందరగా అయ్యేలా చూస్తా. సరే తను కింద వెయిటింగ్. ఎక్కడికో నువ్వే ప్లాన్ చెయ్యి, ఆఫీస్ పని అని చెప్పానులే. రాత్రికి వచ్చినా ఏమీ కాదు. ఈసారికి లోకల్, సిటీలోనే ఏదన్నా చేద్దాం. నువ్వే ప్లాన్ చెయ్యి. సరే ఫ్రీ అయ్యాక మెసేజ్ ఇస్తాను, బై”
ఫోన్ అయ్యాక కిందకెళ్ళాడు.
“ఎంతసేపు వెయిటింగ్”
“ఆఫీస్ వర్క్. మెట్లు దిగుతుంటే మళ్ళీ ఫోన్, మాట్లాడి నన్ను కాసేపు డిస్టర్బ్ చెయ్యద్దని చెప్పి వస్తున్నా. సో ఎక్కడికి ఇప్పుడు”
“మీరే కదా అంది, మీ మేనేజర్ వాళ్ళమ్మాయి హారిక పెళ్ళని, ఆ పెళ్ళి కోసం షాపింగ్”
“ఔను కదా, మర్చిపోయాను అసలు. ఏం కొనుక్కుంటావు”
“ఇయర్ రింగ్స్”
“ష్యూర్. ఎప్పుడూ వెళ్ళే షోరూంకే కదా”
“లేదు. ఇంకేదయినా కొత్త షాప్. నాకు తెలీదు”
“ఏదో ఒకటి చెప్పు. డ్రైవర్ తీసుకెళ్ళాలి కదా”
“వెళ్తూ ఉందాం. బాగుంది అనే దగ్గర ఆగుదాం”
“ఓకే”
కార్ బయలుదేరింది. నెమ్మదిగా పెద్ద పెద్ద జ్యువెల్లరి షాప్స్ ముందుగా వెళ్తోంది.
“అదిగో ఆ షాప్ చూడు, త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి”
“ఔను బాగుంది. శివయ్యా ఆ షోరూం దగ్గర ఆపేయ్”
డ్రైవర్ శివయ్య కార్ ఆపాడు. ఇద్దరూ దిగి లోపలికెళ్లారు.
“ఏం కావాలి మేడం”
“ఇయర్ రింగ్స్”
“ష్యూర్ మేడం. ఇయర్ రింగ్స్ ఈ సెక్షన్ మేడం. ప్యూర్ గోల్డ్ నించి, స్టోన్స్, డైమండ్స్ అన్నీ ఉన్నాయి. ఏవి కావాలి మీకు”
“పింక్ లేదా గ్రీన్ స్టోన్స్ ఉన్నవి ఉన్నాయా”
“ఉన్నాయి మేడం. కూర్చోండి”
ఉన్నవి అన్ని టేబుల్ మీద పెట్టారు.
“సరే నువ్వు చూస్తూ ఉండు, నేను ఫోన్ చేసొస్తాను”
“ఎంటి ఈరోజు ఇన్ని ఫోన్స్”
“ఫైనలైజ్ చెయ్యాల్సిన ఎకౌంట్ ఉంది, అందుకే బిజీ. నువ్వు చూస్తూ ఉండు”
– – – – – – – – – – – – –
“ఇంకెంతసేపు”
“ఇప్పుడే షోరూంకొచ్చాం”
“ఇక ఈరోజు అయినట్టే మనం కలవడం. మీ మేడంగారిని హైద్రాబాద్ మొత్తం తిప్పి, అన్ని కొనిచ్చి, లంచ్, డిన్నర్ బయటచేసి, అర్థరాత్రి ఇంటికెళ్తారు, అంతేగా”
“ఒక్క ఇయర్ రింగ్స్ అంతే. అవ్వగానే తనని ఇంటికి పంపించేసి నేను నీ దగ్గరకొస్తా కదా”
“ఏం వస్తారో ఏమో. ఎన్ని చేద్దాం అనుకున్నానో తెలుసా”
“సారీ సమీరా, నాకు గుర్తులేదు మా మేనేజర్ కూతురి పెళ్ళి అని, తనకి గుర్తుంది”
“అంతే నా బర్త్ డే కన్నా, మీ మేడంగారి షాపింగ్ ఎక్కువ మీకు”
“సారీ సమీరా. ఈరోజు వద్దంటే, తను కూడా ఆఫీసుకి వస్తాను అంటే, మొత్తంగా దెబ్బ మనకి. అందుకే షాపింగ్. అవ్వగానే తనకి సెండాఫ్, అరగంట్లో మీ ఫ్లాట్ ముందు ప్రత్యక్షం. తరువాత నువ్వు ఎటు అంటే అటు. ఏం చేద్దాం అంటే అది. లేదు, ఫ్లాట్లోనే రోజంతా మంచం మీద గడిపేద్దాం అన్నా నాకు ఓకే”
“ఈ మాటలకేం తక్కువలేదు. నా గిఫ్ట్ సంగతేంటి”
“కొన్నాను సమీ, నిన్నే తెప్పించా”
“నాకు నచ్చుతుందా”
“నచ్చుతుంది, నీలానే అందంగా, రంగురంగుల్లో ఉంటుంది”
“మాటల్తో ఐస్ చెయ్యడం మీకు బాగా వచ్చు”
“నిజం సమీ. సరే నేను ఆఫీస్ ఫోన్ అని బయటకొచ్చా. లోపలికెళ్ళి తని సెలక్ట్ చేసుకున్నది యస్ అని, తనని వెంటనే పంపించేసి వచ్చేస్తా. బై”
– – – – – – – – – – – – –
