సరే నీ ఇష్టం నక్షత్రా ,అంతలో ఒక పెద్దమనిషి గంభీరంగా నిలబడి యువరాజుల వారికి వందనాలు అని నమస్కరించాడు..
“భేతాళా” ఇదిగో ఇతను సూర్యకీర్తి.. మనకు బాగా కావాల్సిన వాడు ,ఇతడి సంరక్షణ ఇక నుండి మీ చేతుల్లోనే ఉంటుంది.జాగ్రత్తగా ఇతడిని కాపాడండి అని ఆదేశించాడు నక్షత్రుడు..
(భేతాళుడు ఎవరో కాదు ప్రస్తుత కథలోని “రాజన్న”)..
చిత్తం యువరాజా,సూర్యకీర్తి ని మేము ఇక నుండి కంటికిరెప్పలా చూసుకుంటాము అని భేతాళుడు సమాధానం ఇవ్వగా,చాలా సంతోషం భేతాళా మీ దగ్గర అయితే రక్షణగా ఉంటాడు,ఇక నేను సెలవు తీసుకుంటాను త్వరలో వస్తాను అని చెప్పి ఇద్దరూ తిరుగుప్రయాణం మొదలెట్టి ఆశ్రమాన్ని చేరుకున్నారు…
సుధాముడు ఊపిరి పీల్చుకుని ,కర్ణా నేను మీ అందరి విద్యాభ్యాసం పూర్తి అవుతున్న సందర్భంగా ఒక పోటీని నిర్వహిస్తాను రేపు..ఆ పోటీలో నీవు ప్రత్యర్థివి ఆ జ్యోతిరాదిత్యుడు కి..ఆ పోటీలో వాడి మాయలు నీ పైన పనిచేయవు కాబట్టి నువ్వు వాడి యొక్క చర్యలు ని గమనించు క్షుణ్ణంగా..నక్షత్రా నీవు కూడా వాడి ప్రతి కదలికలు పైన ఒక కన్నేసి ఉంచు…ఈ యుద్ధంలో మీరు వాడి యొక్క శక్తులుని ఎలా ఉపయోగిస్తున్నాడో అన్నది తెలుసుకోండి.
అలాగే గురువర్యా అంటూ సెలవు తీసుకొని వాళ్ళ గదుల్లోకి వెళ్లిపోయారు ఇద్దరూ..
తెల్లవారుఝామున ఇద్దరూ లేచి సుధాముడు యొక్క విద్యాభ్యాస ప్రాంగణం లోకి వెళ్లారు..యధావిధిగా సుధాముడు పోటీ గురించి చెప్పడం,ఆఖరున ప్రత్యర్థులుగా జ్యోతిరాదిత్యుడు, కర్ణుడు ని ప్రకటించడం జరిగాయి..
పోటీ మొదలయ్యే సమయం రానే వచ్చింది..బరిలో ఇద్దరూ కొదమసింహాల్లా తలపడ్డారు…జ్యోతిరాదిత్యుడు కి సమవుజ్జీ అయిన కర్ణుడు వాడి ప్రయత్నాలన్నీ విఫలం చేసాడు..రానురానూ జ్యోతిరాదిత్యుడు లో ఆవేశం అధికం అవ్వసాగింది..ఎలాగైనా కర్ణుడిని మట్టుబెట్టాలి అన్న కసితో తన శక్తి అంతా ప్రయోగించి ప్రయత్నిస్తున్నా కర్ణుడు పోటీ ఇవ్వడంతో ఇక మాయలు ప్రయోగించాలి అని నిర్ణయించుకొని కర్ణుడు పైన ఆవాహన మంత్రం ప్రయోగించాడు…
కర్ణుడికి ఈ ఆవాహన మంత్రం నుండి ఎలా రక్షించుకోవాలో ముందే తెలుసు కాబట్టి తనని వాడికి ఆవాహనం అవ్వకుండా లోలోపల జాగ్రతపడుతూ పైకి మాత్రం వాడి శక్తికి ఆవాహనం అయినట్లు ప్రవర్తించడం మొదలుపెట్టాడు…ఇదే సమయంలో నక్షత్రుడి దృష్టి జ్యోతిరాదిత్యుడు యొక్క చర్యల పైన పడింది…కర్ణుడు కూడా వాడి ప్రతి కదలిక నీ ఆకళింపు చేసుకుంటూ వాడిని సమర్ధవంతంగా ప్రతిఘటిస్తూ వచ్చాడు..
హఠాత్తుగా గురువు సుధాముడు నుండి సంజ్ఞ రావడంతో, జ్యోతిరాదిత్యుడు చేతిలో ఓడిపోయినట్లుగా తన ఓటమిని కావాలనే ఒప్పుకున్నాడు కర్ణుడు…
విజయగర్వంతో జ్యోతిరాదిత్యుడు తన సంతోషాన్ని ప్రకటించుకున్నాడు..
సుధాముడు ఉత్తమ విద్యార్థి అన్న బిరుదుని జ్యోతిరాదిత్యుడు కి ఇచ్చి సత్కరించాడు మనసులో ఇష్టం లేకపోయినా..
ఇక యోధ వంశపు సంరక్షణలో ఉన్న సూర్యకీర్తి కి కొత్త ప్రదేశం కాబట్టి పొద్దుపోక కొద్దిగా అడవిలోకి నడుచుకుంటూ వెళ్లి ఒక అందమైన జలపాతం దగ్గరకు చేరుకున్నాడు..
ప్రకృతి అందానికి పరవశించిపోయి ఆనందంగా ఉన్న సూర్యకీర్తి కి జలపాతం కి దగ్గర్లో బండరాయి పైన ఒక వ్యక్తి కనిపించడంతో అటువైపు వెళ్ళాడు..
అతడిని సమీపించి,ఎవరు నువ్వు?ఇక్కడ ఎందుకు ఒంటరిగా ఉన్నావ్ మిత్రమా??
(ఇటుతిరిగిన ఆ వ్యక్తి ని చూసిన నాకు షాక్ కలిగింది…అతడు ఎవరో కాదు అది నేనే)..
నా నామధేయం “రాజసింహుడు” మిత్రమా, నేనొక అనాధని, ఎవరూ లేకపోవడంతో ఈ యోధ వంశం వాళ్ళు నన్ను సంరక్షిస్తున్నారు అని ప్రేమగా సూర్యకీర్తి మొహంలోకి చూస్తూ చెప్పాడు…
రాజసింహా నీ నామధేయం చాలా బాగుంది,నేనూ ఒక అనాధనే ,నన్నూ ఒక ఉత్తమ బ్రాహ్మణుడు పెంచి పెద్ద చేసాడు..ఇక నుండి మనం మిత్రులం అని చేయి చాచగా రాజసింహుడు(నేను) సూర్యకీర్తి(నాని) చేయిని అందుకొని ప్రేమగా హత్తుకున్నాను..
(నాని గాడు నాకు జన్మజన్మల నుండి ఫ్రెండ్ అన్న విషయం తెలిసేసరికి కన్నీళ్లు ఆగలేదు సంతోషంతో)
కాసేపు పుస్తకాన్ని పక్కన పెట్టి ఆ ఆనందంని,నాని గాడి సాన్నిహిత్యం ని నెమరువేసుకున్నాను..
కొద్దిసేపటికి తేరుకొని మళ్లీ పుస్తకంలో లీనమయ్యాను..ఇంతలో ఒక వన్య మృగం మా వైపు రావడం దాన్ని సూర్యకీర్తి తన విద్యలతో ఏమార్చడం జరిగాయి..
రాజసింహుడు : మిత్రమా ఆ వన్య మృగం అంత భయంకరమైనది, దానిని అంత అవలీలగా ఎలా ఏమార్చావ్?
సూర్యకీర్తి : మిత్రమా ఇది బహు సులభమైన పని,మా నాన్న గారు నేర్పించిన విద్యల తాలూకు మహిమ వల్లే ఇలా చేసాను
..
రాజసింహుడు : బహు ఆశ్చర్యం గా ఉన్నది,దానితో పోరాడటం మాత్రం మాకు తెలిసిన విద్యలు,కానీ దానితో పోరాడకుండానే నువ్వు ఏమార్చడం ఆశ్చర్యం, ఇంతకీ ఆ విద్యలు ఎవరైనా నేర్చుకోవచ్చా?మరి మా సంరక్షకుడు భేతాళుడు మాకు ఇవి నేర్పించలేదేంటి?
సూర్యకీర్తి : మిత్రమా,ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీలేదు,ఎవరైనా నేర్చుకోవచ్చు..కానీ ఇవి సంపూర్ణంగా తెలిసిన గురువు మా నాన్న ఒక్కరే,అది కూడా ఇంతవరకు ఆయన ప్రయోగించలేదు..మీ భేతాళుడు కి ఈ విద్యలు బహుశా తెలియకపోవచ్చును..
రాజసింహుడు : ఓహో అటులనా?మరి మీ పితామహులు దగ్గరకు వెళ్లి ఆ విద్యలన్నీ నేను నేర్చుకోవచ్చా?
సూర్యకీర్తి : అది సాధ్యం కాదు మిత్రమా,ఈ విద్యల తాలూకు విషయాలన్నీ మా ఆశ్రమంలోని ఒక విద్యార్థి ఔపోసన పట్టేసాడు మా నాన్నకు తెలియకుండా,అందులోనూ అతడు ఈ విద్యలని దుర్వినియోగం చేస్తూ ఉండటంతో మా నాన్న భయపడి నన్ను ఇక్కడికి పంపించాడు..
రాజసింహుడు : అయ్యో అలాగా, గురువునే ఏమార్చే విద్యలు అతడు ఎలా నేర్చుకున్నాడు??
సూర్యకీర్తి : అది వాడు సృష్టి రహస్యాలకి సంబంధించిన పుస్తకం ని మా నాన్న దగ్గర తస్కరించి అందులోని విషయాలని కంఠస్తం చేసుకున్నాడు..
రాజసింహుడు : సృష్టి రహస్యాలా?అవి వాడికి తెలిస్తే పెద్ద ప్రమాదం కదా మిత్రమా?అసలే చెడ్డవాడు అంటున్నారు..
సూర్యకీర్తి : నిజమే మిత్రమా,వాడు ఎలా ఉపద్రవాలు సృష్టిస్తాడో అని అంత విద్యలు తెలిసిన మా నాన్నే భయపడుతున్నాడు,అందుకే నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది..
రాజసింహుడు : అయ్యో,అటులైన వాడిని నియంత్రించేందుకు ఏదో ఒక మార్గం ఉంటుంది కదా మిత్రమా??నీకు మీ నాన్న గారు చెప్పలేదా??
సూర్యకీర్తి : వాడిని నియంత్రించడం చాలా కష్టం అని చెప్పారు,ఇంకనూ అక్కడ ఈ రాజ్యపు యువరాజు నక్షత్రుడు, ఇంకనూ పక్క రాజ్యపు యువరాజు కర్ణుడు ఇద్దరూ వాడి విద్యలకి సంబంధించి ఏవో రహస్యాలు తెలుసుకొనడానికి ప్రయత్నం చేస్తున్నారు..ఇదిగో ఈ పుస్తకం తప్ప ఇంకేమీ నాకు ఇవ్వలేదు మా నాన్న..
రాజసింహుడు : అవునా? మిత్రమా నేను ఆ పుస్తకం ని చూడొచ్చా??
సూర్యకీర్తి : ఇదిగో మిత్రమా,నువ్వు అడగాలా మళ్లీ అంటూ పుస్తకాన్ని ఇచ్చాడు.
(ఈ జన్మలో చూపించే ప్రేమ,ఆ జన్మలోనూ చూపిస్తున్న నాని గాడి ప్రేమకి వాడి పైన ఇంకాస్తా అభిమానం పెరిగింది.. బహుశా నాని గాడికి గత జన్మ తాలూకు విషయాలు తెలిసే ఉంటాయి,అందుకే మంజులా దేవి ని రక్షించడానికి వెళ్ళాడు అని గుర్తొచ్చిన నాకు ఆశ్చర్యం వేసింది).
అంతలోపు అక్కడికి భేతాళుడు రావడం,ఆ పుస్తకాన్ని చూడటం,తెరవడం ఒక్కసారిగా ఆశ్చర్యం కి లోనై ఇద్దరినీ నివాసాల దగ్గరకు లాక్కొని వెళ్లడం జరిగాయి..
ఇక్కడ జ్యోతిరాదిత్యుడు విజయం తర్వాత కాసేపటికి సుధాముడు ఇద్దరి యువరాజులని తన రహస్య మందిరంలోకి పిలిచాడు..
కర్ణా,నువ్వేమి సంగ్రహించావ్ వాడితో యుద్ధం చేసేటప్పుడు??
గురువర్యా,నేను సంగ్రహించిన అతి ముఖ్య విషయం ఏంటంటే వాడు ఆవాహనా మంత్రం వేసేటప్పుడు వాడి కళ్ళు తీక్షణంగా అవ్వడం,ఇంకనూ మంత్రం వేసిన తర్వాత వాడు మొత్తం తన చేతి వేళ్ళతోనే నన్ను నియంత్రించడం గమనించాను..
ఖచ్చితంగా నేనూ అదే గమనించాను గురువర్యా,ఇంకనూ వాడి కాళ్ళు రూపు కొద్దిగా మార్చుకోవడం కూడా గమనించాను అన్నాడు నక్షత్రుడు..
భేషుగ్గా చెప్పారు వీరులారా,ఇప్పుడు మీకు అవగతం అయ్యుంటుంది వాడిని కొంచెం అయినా నిలువరించే ప్రయత్నం ఏంటా అన్నది..
అవును గురువర్యా,నాకొక సందేహం ఉన్నది చెప్పండి అన్నాడు కర్ణుడు..
చెప్పు కర్ణా,ఏంటా సందేహం??
గురువర్యా,మిమ్మల్ని అంతం చేస్తాడు అన్నది ఎంతవరకు నిజం?మీకు వాడి మహిమలని తట్టుకునే శక్తి ఉన్నప్పుడు ఎలా అంతం చేయగలడు వాడు?
మంచి ప్రశ్నే వేసావు కర్ణా,ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వాడికి అబ్బిన శక్తులలో ఒక్క భాగం కూడా వాడు ప్రయోగించలేదు నీ పైన,వాడికున్న శక్తికి దేవతలనే ఎదిరించి గెలవగల సత్తా ఉంది..అలాంటప్పుడు నేనెంత వాడి ముందు??
గురువర్యా ,ఏంటి మీరనేది?దేవతలనే ఎదిరించే సత్తా వాడిలో ఉందా?
అవును కర్ణా,సృష్టి రహస్యాలే వాడికి తెలిసిపోయాయి అందులో సందేహమే లేదు…పంచభూతాలు వాడు ఎలా చెప్తే అలా నడుచుకోవాలి…వాడి శక్తి అపారం,అంతేలేనిది…కానీ ఈ శక్తులు అన్నీ వాడు ఇప్పుడే ప్రదర్శించడం అసాధ్యం.. అందుకు ఒక ముఖ్యమైన సమయం కావాలి..
అదేంటి గురువర్యా?సమయం దేనికి వాడికి?
నిజమే కర్ణా,ఇందులోని మంచి విద్యలు ఇప్పటికే వాడికి అబ్బి ఉంటాయి…దాని ఫలితమే ఈ ఆవాహన మంత్రం..ఈ మంత్రంలో దుష్టనీతి కూడా ఉంటుంది..అదేవిధంగా వాడికి దుష్ట విద్యలు అన్నీ అబ్బాలంటే కాళికా మాతని ప్రసన్నం చేసుకోవాలి,అందులకు సరైన సమయం అనేది చాలా ముఖ్యం..ఒక్కసారి వాడు ఆ శక్తుల కొలవు అయిన కాళికా మాతని సంతృప్తి పరిస్తే అప్పుడు వాడికి ఈ విద్యలన్నీ అబ్బి మహా శక్తిమంతుడు అవుతాడు..
ఇప్పుడు అర్థం అయ్యింది గురువర్యా,అయితే అందులకు అనువైన ముహూర్తం ఎప్పుడు ఉందో తెలియజేయండి..
ఆ ముహూర్తం సరిగ్గా ఒక ఏడాదికి వస్తుంది,అది అతి పవిత్రమైన పౌర్ణమి రోజు…ఆ రోజు వాడు పంచభూతాలు ని వశం చేసుకొని,కాళికా మాత అనుగ్రహం పొందితే ఎదురేలేకుండా అవుతాడు..ఆ పౌర్ణమి ప్రతి వెయ్యి సంవత్సరాల కి ఒక్కసారి వస్తుంది.. ఆ పౌర్ణమి నాడే ముక్కోటి దేవతలు వాళ్ళ అస్త్ర సన్యాసం చేసే సమయం..అది అనువుగా మలుచుకుంటే వాడికి విశ్వరాజు అయ్యే అవకాశం ఉంది.. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆ దినమున ఒక తేజోవంతమైన వజ్రం ఉత్పత్తి అవుతుంది.. అలా ఉత్పత్తి అయిన ఆ వజ్రం ఒక మహా శక్తివంతమైన సృష్టి రక్షక కవచం..దాన్ని కూడా వాడు సాధించాలి.లేకుంటే వాడికి అన్ని విద్యలూ అబ్బవు..
గురువర్యా,ఇప్పుడు పూర్తిగా అర్థం అయ్యింది..ఆ పౌర్ణమి రోజు కన్నా ముందు వాడిని అంతం చేస్తే ఈ ఉపద్రవం నుండి మనకు ఉపశమనం లభిస్తుంది కదా?
అవును,కానీ ప్రస్తుతానికి వాడిని అంతం చేసే శక్తి ఎవ్వరికీ లేదు..దేవతల దృష్టిలో కూడా వాడు ఇప్పుడు ఉత్తముడు..ఎందుకంటే వాడింకా పంచభూతాలు ని వశం చేసుకోలేదు..వాడి దుష్ట బుద్ధి అనేది ఆ పౌర్ణమి నాడే తెలుస్తుంది.. అప్పటివరకూ వాడికి అంతం లేదు..ఎందుకంటే వాడు దుష్టుడే అవుతాడు అన్న ఆలోచన మనము ఖచ్చితంగా మాత్రం చెప్పలేము…ప్రస్తుత వాడి నడవడిక చూస్తుంటే దుష్టమార్గం వైపు వెళ్తున్నాడు అన్నది మాత్రం తెలుస్తోంది.. ఆ పౌర్ణమి వరకూ మనము వేచి చూడాల్సిందే..
శభాష్ గురువర్యా, భలే చెప్పారు నీ ప్రియ శిష్యులకు కర్తవ్య నిర్దేశనం హ హ్హా మీకా సందేహం అక్కర్లేదు నేను సంపూర్ణంగా ఈ విశ్వాన్ని జయించి సకల లోకాలకు అధిపతి ని అయ్యే అవకాశం కోసమే చూస్తున్నా, నువ్వన్నట్లు నేనూ ఆ పౌర్ణమి కోసమే ఎదురుస్తున్నాను..నాకు యుద్ధభూమిలోనే ఈ తుశ్చ కర్ణుడు పైన అనుమానం వచ్చింది నా ఆవాహనా మంత్రం పనిచేయలేదని,ఇప్పుడు మీ మాటలతో ఒక అవగాహన ఏర్పడింది అంటూ జ్యోతిరాదిత్యుడు గర్వంతో గురువుని దెప్పిపొడుస్తూ మాట్లాడాడు..
జ్యోతిరాదిత్యా, నువ్వు వెళ్లే మార్గం దుర్మార్గం బహు శోచనీయం..నువ్వు ఎంచుకున్న మార్గాన్ని విడనాడి ఈ విశ్వ కల్యాణం కోసం పాటుపడితే ఒక గురువుగా చాలా సంతోషిస్తాను..
హ హ్హా మీరు నాకు గురువా?ఎంతటి ఘోరమైన మాట?నా స్వశక్తితో నేను ఈ విద్యలన్నీ ఔపోసన పట్టాను..ఇందులో మీ ఘనత ఏంటి??
ఆపు రా దుర్మార్గుడా,గురువర్యుల నుండి పుస్తకం దొంగిలించి నేర్చుకున్న నీవు ఇలా గురువర్యులకి అవమానం కలిగిస్తే ఊరుకునేది లేదు అంటూ కర్ణుడు కోపోద్రిక్తుడు అయ్యాడు..