గతం – ఓ చిన్న అవలోకనం
మేము జమిందారులుగా ఉన్నప్పుడు మా కుటుంబం పరిస్థితులు ఎలా ఉండేవో నాకు తెలియదు. నేనెప్పుడూ పెద్ద ఇల్లు, ఇంటినిండా నౌకర్లూ ఉన్నచోట పెరగలేదు.
నా చిన్నప్పుడు, నాకు వూహ తెలిసి పరిసరాలను అర్థం చేసుకునేటప్పుడు, మేమొక చిన్న ఇంట్లో ఉండే వాళ్ళం.
మా నాన్న రోజంతా సమీపంలోని ఇంకో రైతు వరి మడిలో పనిచేసేవారు. పొలంలో పనిలేనప్పుడు రకరకాల పనులు చమటోడ్చి చేసేవారు. ఆయన చేయని, చేయలేని పనులంటూ లేవు, ఆయన అన్ని పనులును చేయగలిగేవారు.
మా నాన్న వేరే వాళ్ళ పొలంలో కూలికి పనిచేస్తున్నా, అందరూ ఆయన గురించి చాలా మర్యాదగా మాట్లాడేవారు. తనకంటూ ఒక చిన్న పొలంకూడా లేని ఒక పేద రైతుకి అంతటి మర్యాద దొరకడం ఆశ్చర్యంగా ఉండేది. ఆ వూరిలో దరిదాపు అందరూ మా నాన్న వల్ల సహాయం పొందిన వాళ్ళే.
మేము పక్కూరి జమీందారు బందువులమై కూడా, మేమెందుకు అటువంటి వూరిలో, ఒక చిన్న పూరిపాకలో ఉన్నామో అర్థమైయ్యేదికాదు. మా నాన్న తన బందువులతో, తోడపుట్టినవారితో ఎందుకు కలిసుండడం లేదో తెలిసేది కాదు. నా వయసు పిల్లలందరూ ఒక అమ్మతో ఉంటే, మరి నాకెందుకు ఇద్దరమ్మలు ఉన్నారో అర్థమైయ్యేది కాదు.
జమీందార్ జతింద్ర లాల్ దాస్ కొడుకు మహేంద్ర లాల్ దాస్ ఆయనే నా తండ్రి. ఆ “లాల్” అనే మద్య పేరు నాకెందుకో ఇబ్బందిగా అనిపించి, నేను నా ఎస్.ఎస్.సి కి దరఖాస్తు చేసేటప్పుడు తీసేసాను.
నా తల్లి శ్రీమతి సుప్రియా రాణి దాస్ పెళ్ళైన ఆరేళ్ళకు కూడా గర్భం దాల్చలేకపోయింది. ఆరేళ్ళ తరువాత మొత్తం కుటుంబం, మా అమ్మ అంతా కలిసి మా నాన్నకు బలవంతంగా రెండో పెళ్ళి చేసారు నా సవతి తల్లి శ్రీమతి మిష్టీ రాణి దాస్ తో.
పెళ్ళై ఇన్నేళ్ళైనా వంశాంకురాన్ని ఇవ్వలేకపోయిందని, మా పితామహులు, చిన్నాన్నలు మా
అమ్మను చాలా అవమానించి, హీనంగా, హేయంగా చూసేవాళ్ళు.
అదేం విచిత్రమో మా నాన్నకు రెండో పెళ్ళైన మూడు నెలలకు మా అమ్మ గర్భం దాల్చింది.
మా నాన్న విషతుల్యమైన ఆ ఇంట్లోనుంచి బయటకొచ్చి ఒక కొత్త జీవితం మొదలెట్టాలని, తన ఇద్దరు భార్యలతో, ఇంకా పుట్టని (నేను) బిడ్డతోబాటు ఆ జమీందారి ఇంట్లోనుంచి పక్కనున్న ఇంకో గ్రామానికి వచ్చేసారు.
మా నాన్న తన తండ్రి ఆస్తిని, భూములను ఏమాత్రం ఆశించలేదు, పైపెచ్చు ఆయన తన స్వశక్తితోనే తన కుటుంబాన్ని పోషించాలని శపధం చేసుకున్నారు.
మా నాన్నకు మతపరమైన నమ్మకాలు, మతం పైన విశ్వాసము చాలా ఎక్కువ. ఆయన ఎప్పుడూ భగవాన్ శ్రీ కృష్ణుడ్ని పూజించేవారు, మహా భారతాన్ని చదివేవారు. అందువల్లనే ఆయన నాకు పాండవ మద్యముడు, కుంతీ పుత్రుడు, సాటిలేని విలువిద్యా నిపుణుడు ఐన అర్జునుని పేరు పెట్టారు.
జమీందారి ఇంట్లోంచి వచ్చేసిన ఎనిమిది నెలలకు నేను పుట్టాను.
నేను పుట్టిన తరువాత మా చిన్న కుటుంబం చాలా సంతోషంతో హాయిగా ఉండేది. కాని మా నాన్నకుఇంకా ఎక్కువ సంతోషం ఇవ్వాలి అని, తను రెట్టింపు కష్టపడి పనిచేసి కొద్దిగా డబ్బు కూడబెట్టారు ఏదైనా ఓ చిన్న వ్యాపారం మొదలెడదామని.
మా నాన్న తన చిన్ననాటి స్నేహితుడు, బందువు సహాయంతో చట్టగ్రాం సిటీ (బంగ్లాదేస్ లోని ఓ రేవుపట్టణం) వెళ్ళి ఒక చిన్న టీ కొట్టు మొదలెట్టరు. బాగా శ్రమకోర్చి కష్టపడడంతో టీ కొట్టు లాభాలు నెమ్మదిగా పెరగడం మొదలెట్టాయి. ఈ సమయంలో మా నాన్న వారానికొకసారి క్రమం తప్పకుండా ఇంటికి వచ్చేవారు. రెండేళ్ళ తరువాత మమ్మల్నందర్నీ తనతోపాటే సిటీలో ఉండడానికి తీసుకెళ్ళారు. నాకప్పుడు ఆరేళ్ళు. రేకులతో కప్పబడిన రెండుగదుల ఇల్లు మాకు రజియా వాళ్ళ నాన్న
అద్దెకు ఇచ్చారు.
దగ్గర్లోని కాలేజ్లో నన్ను చేర్పించారు. అక్కడే నేను రజియాను కలిసింది, తరువాత తెలిసింది తను మా ఇంటి యజమాని కూతురని. మేమిద్దరం వెంటనే స్నేహితులైపోయాము, ఒకరింటికి ఒకరు తరచుగా వెళ్తుండేవాళ్ళం. నేను చిన్నగా ఉన్నఫ్ఫుడే ఆటల్లో, క్రీడల్లో చాలా నైపుణ్యం కనపరిచేవాన్ని. ఇంకొంచెం పెద్దగైన తరువాత నేను బాక్సింగ్, బరువులెత్తడంలో ఆసక్తి పెంచుకున్నాను.
కొద్ది సంవత్సరాలు అలా మా కుటుంబంలో సంతోషం వెల్లి విరిసింది. వెలుతురు తరువాత చీకటి కమ్ముకోవడం సహజంగా జరిగే ప్రక్రియ. నాకు ఎనిమిదేళ్ళ వయసుండేటప్పుడు నా సవతి తల్లి, కవల పిల్లలైన నొకుల్, సహదేవ్ లను కని పురిటిలో చనిపోయింది. నా చిన్న తమ్ముడు తన పేరు (సహదేవ) చాలా పాతకాలం నాటి పేరులా ఉందని, తనని దేవ్ అని పిలవమని గొడవ చేసేవాడు, దానికి మేమందరం వొప్పుకోవాల్సి వచ్చింది.
వాళ్ళ అమ్మ నాకు సవతి తల్లైనా తనదగ్గరే నేనెక్కువ గారాబం చేసేవాడ్ని. మా అమ్మ నన్ను చాలా క్రమశిక్షణలో పెట్టేది, అందుకని నాకేమైనా ప్రత్యేకంగా కావాలంటే నేను మా మిష్టీ అమ్మ (తీయని అమ్మ) దగ్గరకే వెళ్ళేవాన్ని.
తన చావు నాకు, మా నాన్నకు చాలా బాధ కలిగించింది. కాని మా అందరికంటే ఆమె చనిపోవడం మా అమ్మ పైన చాలా తీవ్ర ప్రభావాన్ని చూపింది. కాలం గడిచేకోద్దీ మా అమ్మ, మిష్టీ అమ్మ ఇద్దరూ సొంత అక్కా చెల్లెల్లా కలిసిపోయారు, మా అమ్మ, తన చనిపోయినప్పుడు తన సొంత చెల్లెలే చనిపోయినంతగా ఏడ్చింది. ఇంత చిన్న 27 ఏళ్ళు వయసులోనే తన చెల్లెలు, స్నేహితురాలు చనిపోవడం మా అమ్మ జీర్ణించుకోలేకపోయింది.