అలాగా..
శరణ్య : వీడికి అక్కడ సిటీలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు.. పేరు అరవింద్ బాగా బలిసినోడు.. వీడిని వాడు ఎందుకు భరిస్తున్నాడో వాడికి ఆ దేవుడికే తెలియాలి.. అంతే వాడి గురించి…
ఎక్కడ అమ్మాయి కనపడితే అక్కడ వాలిపోవడం, ట్రై చెయ్యడం వారంలో ఫెయిల్ అవ్వడం తరువాత ఇంకో అమ్మాయిని వెతుక్కోవడం ఇదే వాడి రొటీన్.. ఇంకేమైనా కావాలా వాడి గురించి..?
నీకు తనకీ ఎందుకు పడదు..?
శరణ్య : పడదు అంటే పడదు అంతే.. ఎప్పుడూ ఏదో ఒక తింగరి పని చేసి నవ్వుల పాలు అవ్వడం వాడి హాబీ.. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా అక్కడ ఏదో ఒక పెంట అవుద్ది.. వచ్చాడుగా చూద్దురు లేండి..
ఇంతలో ఇంకొకడు అడుగు పెట్టాడు అక్కడ.. శరణ్య వాడిని చూపిస్తూ..
శరణ్య : అదిగో వాడే అరవింద్.. సుబ్బిగాడి ఫ్రెండు..
భలే ఉన్నాడే..
శరణ్య : డబ్బులుంటే అందరూ బానే ఉంటారు.. ఇంతకీ మన సుబ్బిగాడేడి పదండి లోపల ఏం వెలగబెడుతున్నాడో చూద్దాం.
టెంటు ముందు శరణ్య వాళ్ళని చూస్తూనే చిన్నగా నవ్వుతూ ఫోన్ తీసుకుని ఫోన్ చేసాడు అరవింద్…రేయి నేను బైటే ఉన్నా దానికి సుబ్బిగాడు విసుగ్గా ఒక అరగంట ఆగి రమ్మన్నానా అప్పుడే ఎందుకు ఊడిపడ్డావ్ అన్నాడు.. అంతే ఉక్రోశంగా ఎంతసేపని ఎండలో నిల్చొనూ, ఇక నా వల్ల కాదు.. ససేమిరా అంటూ మొండికేసాడు అరవిందు. సుబ్బిగాడు తప్పక వస్తున్నా ఉండు అని బైటికి వచ్చి ఓరకన్నుతో శరణ్యని గమనిస్తూనే అరవిందుని లోపలికి పిలుచుకుని తన గదిలోకి తీసుకుపోయి రెడీ అవ్వమని చెప్పి ఇంట్లో వాళ్ళని పలకరిద్దామని బైటికి వచ్చాడు.
ముందుగా తాతయ్యని కలుద్దామని వెళుతుండగా మావయ్య ఎదురు పడ్డాడు. ఈయన పేరు జగన్, రైస్ మిల్లు నడుపుతాడు. ఊర్లో డబ్బులు వడ్డీకి కూడా తిప్పుతుంటాడు.. ఈయనకి మన సుబ్బిగాడికి కొంచెం మాటలు తక్కువేలేండి.
ఏరా ఎక్కడికి అంత హడావిడిగా ఏదో పని మొత్తం నువ్వే చేస్తున్నట్టు, అంతా నువ్వే చక్కబెడుతున్నట్టు అంత బిల్డప్ ఎందుకురా? అని కొంచెం వెటకారంగా కొంచెం కోపంగా అడిగాడు. దానికి మన సుబ్బిగాడు కోపాన్ని అణుచుకుంటూ నిన్ను దెబ్బ కొట్టే సమయం రాకపోదు అప్పుడు చెప్తా నీ సంగతి అని మనుసులో అనుకుంటూనే బైటికి మాత్రం ఇవేవి పట్టనట్టు తాతయ్య ఎక్కడ మావయ్య అని అడిగాడు.
తనని పట్టించుకోకుండా సుబ్బిగాడు అలా మాట్లాడేసరికి ఆయనకి ఒళ్ళు మండి ఆ ఉన్నాడులే.. ఇంకెన్ని రోజులురా ఇలాగా తాతయ్య తకతయ్య అంటూ, ఎన్ని రోజులు ఆ ముసలోడి మీద పడి తింటావ్.. కొంచెం మేలుకోరా నాయనా.. ఆ డిగ్రీ ఏదో అయిపోయిందిగా ఏదైనా పని ఇప్పించామంటావా చెప్పు అంతేకానీ ఇలా సోంబేరిలా తిరక్క.. ఎవడైనా నీ అల్లుడు ఏం చేస్తున్నాడంటే ఏం చెప్పలేక తల తిప్పుకుంటున్నా.. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉంది అంటే అది ఇదే.. అని గ్రైండర్ లో పట్టడానికి అల్లం చాటతొ వెళుతున్న తన భార్య సుధారాణిని చూస్తూ అన్నాడు.
సుధారాణి వెళుతు వెళుతూ సుబ్బిగాడిని చూసి బాగున్నావా అల్లుడు అని పలకరిస్తూనే మొగుణ్ణి చూసి కోపంగా ఇక్కడ ఈ వెధవ సోది పెట్టే బదులు వచ్చి సాయం చేయొచ్చుగా అని విసుగు నటిస్తూ వెళ్ళిపోయింది. పైకి అలా అల్లుడిని వెనకేసుకొచ్చింది కానీ సుధారాణికి మన సుబ్బిగాడి మీద అంత ప్రేమేమి లేదు అలాగని ద్వేషం కూడా లేదు అలా పలకరింపుల వరకు బానే ఉంటుంది.
జగన్ తెరుకుని అల్లుడి ముందు తక్కువ కాకూడదని వెంటనే మాట అందుకున్నాడు.. పోరా నీకు మళ్ళీ ఇంట్లో సపోర్టు, పొ ఆ పనేదో అందుకోపొ.. అని మన సుబ్బిగాడిని ఈరోజుకి వదిలేసాడు.
