సుబ్బిగాడు హమ్మయ్య అనుకుంటూ లోపలికి వెళ్లి అమ్మమ్మని పలకరించాడు, తన పేరు జానకమ్మ ఇంటిని చక్కబెట్టడంలో దిట్ట, జుట్టు నెరిసినా రంగు వేసుకుని తనకింకా అంత వయసు అవ్వలేదని అద్దంలో చూసుకుని సంబర పడే టైపు.
సుబ్బిగాడు లోపలికి వెళుతూనే అమ్మమ్మా… తాతయ్య ఎక్కడా కనిపించడంలేదు అని మాట్లాడుతూ అక్కడ గ్రైండర్ లో పడుతున్న పచ్చడిని వేలితో ఒకసారి నాకి బాగుంది బాగుంది అనుకున్నాడు.
జానకమ్మ మనవడిని పాలకరిస్తూ ఏరా వచ్చావా, ఎంతసేపైంది వచ్చి ఇంద ఈ తీయ్యన్నం తిను అంటూ తన చేతిలో ఉన్న ప్లేట్ సుబ్బిగాడికి అందించింది. సుబ్బిగాడు ఒక స్పూన్ తిని అమ్మమ్మ నా ఫ్రెండు కూడా ఊరు చూస్తానంటే తీసుకొచ్చాను రూంలో ఉన్నాడే ఇద్దరికి కలిపి పంపించవూ.. ఇంతకీ తాతయ్య ఎక్కడా అని అడిగాడు దానికి జానకమ్మ సమాధానం చెపుతూ.. ఊరి పెద్ద మనుషులని సాయంత్రపు కేక్ కటింగ్ కి పిలవడానికి వెళ్ళాడు వచ్చేస్తాడులే.. ఇదిగో నీకు నీ ఫ్రెండుకి వెళ్లి తినండి ముందు అని రెండు ప్లేట్లు సుబ్బిగాడి చేతిలో పెట్టింది.
సుబ్బిగాడు ప్లేట్లు తీసుకుని రూంలోకి వెళ్లి అరవిందు చేతిలో పెట్టాడు దానికి అరవిందు ఇక్కడ రూంలో ఎందుకు లేరా పదా బైట టెంటు కింద కూర్చుని తిందాం పదా అన్నాడు.. దానికి సుబ్బిగాడు.. నేను రాను బైట ఒక పిశాచి ఉంది దాన్ని చూస్తేనే నాకు ఒళ్ళు మంట..
ఎవర్రోయి అని తింటూనే అడిగాడు ఎడమ కనుబొమ్మ ఎగరేస్తూ.. నేను సెప్పలే శరణ్య అని నా మరదలు, దాన్ని దాని అబ్బని చూస్తే నాకు ఎక్కడలేని మంట.. గటగటా వాగేసాడు సుబ్బిగాడు. ఎవరు ఆ పింకు రంగు వోణిలో ఉన్న అమ్మాయా అని అడిగాడు.. అవును కొంపదీసి నువ్వేమైనా మనసు పడ్డావా ఏంటి అంత కచ్చితంగా చెప్తున్నావ్..
ఇంతలో ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న హారిక తన బావ అయిన సుబ్బిగాడిని పలకరిద్దామని లోపలికి వచ్చింది. రా హారిక హ్యాపీ భారత్ డే అంటూ పలకరించాడు.. బావా నాతో ఎప్పుడూ ఎగతాళే నీకు అని నవ్వుతూ అరవింద్ ని చూసి నమస్కారం చేసింది ఇప్పుడే పదో తరగతి దాటి ఇంటర్లోకి అడుగుపెట్టిన హారిక.
అరవింద్ హారిక చేసిన నమస్కారానికి ప్రతినమస్కారం చేసి బర్తడే విషెస్ చెప్పాడు.. హారిక సుబ్బిగాడిని చూసి బావా నాకోసం గిఫ్ట్ ఏం తెచ్చావ్ అని అడిగింది.. అస్సలే చికాకులో ఉన్న సుబ్బిగాడికి మళ్ళీ తన మావయ్య కుటుంబం నుంచి ఇంకో నచ్చని ప్రశ్న ఎదురయ్యేసరికి కిందెక్కడో కాలి.. ఇడిచిన బట్టలు తెచ్చానే ఉతికి పెట్టు అదే నీ గిఫ్ట్ అన్నాడు కోపంగా, హారిక వెనకనుంచి వచ్చి సుబ్బిగాడు చూడకముందే గట్టిగా వీపు మీద ఒకటి చరిచి బైటికి పరిగెత్తింది.. అబ్బా అని వీపు పట్టుకున్నాడు సుబ్బిగాడు సుర్రుమన్నట్టుంది పాపం.
దానికి అరవింద్ నవ్వాడు, సుబ్బిగాడు కోపంగా వీపు రుద్దుకుంటూ శరణ్య విషయం ఎత్తాడు మళ్ళీ.. దానికి అరవింద్.. ఛీ..ఛీ.. అయినా నేను పెళ్లిచేసుకోను నా ఆస్తిని అప్పనంగా ఇంకో అమ్మాయితొ పంచుకునే ఉద్దేశాలే లేవు నాకు, అనిపించింది అడిగాను.. నిజాయతీగా జవాబిచ్చాడు అరవిందు.
ఊరికే అన్నాలే అరవిందూ.. అని దీర్గం తీసాడు సుబ్బిగాడు.. దానికి కోపంగా అది అరవిందూ, మందు లంగా బొందు కాదు.. వింద్.. అరవింద్.. అంటూ తన పేరుకు తగ్గట్టే సగం వదిలిపెట్టాడు అరవిందు.. కాదు కాదు అరవింద్.
సరే పదా అలా బైట తిరిగి వద్ధాము, ఆ తరువాత తాతయ్యని కలిసి వచ్చిన పని చూద్దాము.. అని అడుగులు బైటికి వేసాడు సుబ్బిగాడు తన వెనుకే అరవింద్.
అరవింద్ : ఎక్కడికిరా?
సుబ్బి : రావొయి, ఎందుకంత ఆత్రం.. పదా అలా బాయి దెగ్గర కూర్చుందాం అని ముందుకు వెళ్లి కూర్చున్నాడు, ఆ వెనుకే అరవింద్ కూడా వెళ్లి కూర్చున్నాడు.
అరవింద్ : అయినా నాకు అర్ధం కాక ఇప్పుడు నీకెందుకురా అన్ని డబ్బులు?
సుబ్బి : నీకేరా ఎన్నైనా చెప్తావ్ డబ్బులున్నోడివి, అయినా నిన్నని ఏం లాభం కష్టాలన్నీ ఈ ప్రేమికుల చుట్టే తిరుగుతూ ఉంటాయి ఎందుకో అర్ధంకాదు.
సుబ్బిగాడి వంకర మాటలు విని అనుమానంగా కొంపదీసి మళ్ళీ ప్రేమలో పడ్డవా ఏంటి అని అడిగేసాడు అరవింద్.. అవునురా మొన్న నాలుగు రోజుల క్రితమే జరిగిపోయింది నా KFC కామాక్షి తొ..
అరవింద్ : ఎవరా అమాయకురాలు, పాపం పొయ్యి పొయ్యి నీ కంట పడింది..
సుబ్బి : నేను రెంటు కి ఉండే రూం నుంచి ఒక కిలోమీటర్ దూరం అంతే KFC లో పనిచేస్తుంది పిల్ల.. ఏమాటకామాట చికెన్ చెయ్యడంలో ఆ పిల్ల తరువాతే ఏదైనా..
