ప్రేమికుడు 477

శరణ్య లెటర్ తీసుకుని అది చదివి గొల్లుమని నవ్వుతూ తన ఫ్రెండ్స్ దెగ్గరికి వెళ్ళింది, కడుపు పట్టుకుని నవ్వుతుంటే విషయం చెప్పింది.. అందరూ చదవమని గోల చేస్తే, అలాగే అని అందరినీ పిలిచింది.. ఏంటో అని ఇంట్లో వాళ్లంతా వెళ్లారు.. ఆ గోలెంటో చూద్దామని సుబ్బిగాడు కూడా వెళ్ళాడు..

శరణ్య : ఇదిగో వినండి అందరూ.. మన సుబ్బిగాడు నా ఫ్రెండ్ కవితకి ఉత్తరం రాసాడు.. అని నవ్వింది.

శరణ్య వాళ్ల నాన్న, తాతయ్య సుబ్బిగాడిని కోపంగా చూసారు, ఇక సుబ్బిగాడి గుండె గువ్వలోకి వచ్చినట్టు అయ్యింది పరిస్థితి ఈ శరణ్య ఇంత పని చేస్తుందని అనుకోలేదు.. వద్దని శరణ్య వైపు దీనంగా చూసాడు కానీ తను పట్టించుకునే స్థితిలో లేదు.

శరణ్య : ఇదిగో వినండి..

కవితా ఓ కవితా (ఎహె వహ్వా అనండి)
అందరూ “వహ్వా వహ్వా”

కవితా ఓ కవితా
అందుకో నా కవిత
నీకోసం ఈ కవిత రాసే వరకు తెలీదు నాకు బిట్కో పెన్ను మూడు రూపాయలని
నిన్ను తలుచుకుంటే పిచ్చెక్కిపోతుంది, గుండె బరువెక్కుతుంది, టైర్ పంచరవుతుంది..

చూసావా కవితా… నీ కోసం కవిత రాస్తుంటే నా కలం కూడా నా మాట వినట్లేదు. నువ్వైనా విను కవితా..

నీ తుట్టేలో తేనెనవుతా
నీ పుట్టలో పామునవుతా
బొగ్గు గనిలో.. ప్రేమ
అగ్గి పెట్టలా
తాటి చెట్టు, చెయ్యి పట్టు, చిన్నదాని చెయ్యే పట్టు.. ఓ బుల్లోడా
ఏమో ఏం రాస్తున్నానో నాకే అర్ధం కావటంలేదు.. నా బాధ గాధ నీకైనా అర్ధం అవుతుందేమో..

చివరిగా..
నా పొలంలో కూడా మొలకలు వచ్చేలా చూడు కవితా..

ఇట్లు నీ సుబ్బడు..
సుభాష్.

ఇంట్లో ఉన్న అందరూ ఒక్క సారి సుబ్బిగాడి మొహం వంక చూసి పిచ్చి పిచ్చిగా కడుపు పట్టుకుని నవ్వారు, సుబ్బిగాడికి కోపం వచ్చేసి బైటికి పరిగెత్తాడు.. వెనకనుంచి KFC కామాక్షి అన్న అరుపు వినిపించింది.. అంతా ఈ అరవింద్ గాడి వల్లే మొత్తం చెప్పేసాడు.. అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోయాడు.. అరవింద్ వెనకాలే వేగంగా నడిచాడు..

అరవింద్ : రే… ఆగరా

సుబ్బి : ఏంట్రా.. అయినా నీకు నాతో ఏం పని, పొయ్యి ఆ ఆడంగులతొ తిరుగుపొ..

అరవింద్ : రేయి.. ఆగరా బాబు.. నేను నీకు హెల్ప్ చేద్దామని చూస్తే ఏదేదో అయిపోయింది..

సుబ్బి : ఏం గెలికావ్?

అరవింద్ : ఏదో గెలికాలే.. ఇంతకీ ఎక్కడికి వెళుతున్నావ్..

సుబ్బి : జాతరకి

అరవింద్ : పదా..

సుబ్బి : ఎందుకూ, నన్ను ఎదవని జేయ్యడానికా?

అరవింద్ : ఇక నీ విషయంలో వేలు పెట్టను సరేనా… అయినా ఆ కవిత్వం ఏంటిరా అంత చెండాలంగా..?

సుబ్బి : అది కవిత కోసం రాసాను, తను చదువుకొని నవ్వుకుంటుందని.. ఎలా అయినా నాతొ మాట్లాడాలని అలా రాసాను.. కానీ ఆ శరణ్య.. దాన్ని వదలను..

అరవింద్ : రేయ్ మీ వాళ్లు కూడా జాతరకి వస్తున్నారు..

సుబ్బి : ఎక్కడా?

అరవింద్ : అక్కడా

సుబ్బి : ఇప్పుడేగా మెక్కింది అందరూ, అప్పుడే రోడ్డున పడ్డారు.. ఛీ ఎక్కడా ప్రశాంతంగా ఉండనివ్వరు…

ఇంతలో సుబ్బిగాడికి పక్కనే స్టేజి, నాటకాలు వేసే వారు కనిపించారు.. అరవింద్ వాళ్ళని పలకరించబోయే అంతలో మాయం అయ్యాడు..

శరణ్య : హే.. అరవింద్.. మీరు ఇక్కడికే వచ్చారా?

అరవింద్ : ఎందుకలా చేసావ్?

శరణ్య : జస్ట్ ఫర్ ఫన్.. వాడేం ఫీల్ అవ్వడులే.. నా మీద ఇంకొంచెం కోపం పెరిగి ఉంటది అంతే..

అరవింద్ : కానీ..

శరణ్య : ఇంతకీ ఎక్కడ వాడు..

అరవింద్ : ఇక్కడే ఉండాలి, ఎక్కడికి పోయాడో..

మన సుబ్బిగాడు నాటకాలు వేసే వాళ్ల దెగ్గరికి వెళ్లి, అన్నా మీది ఎలాగో టైం పట్టేలా ఉంది కొంచెం సేపు నేను అలా మైక్ లో మాట్లాడనా, అందరికీ తెలుస్తుంది.. కొద్ది సేపటిలో నాటకం మొదలవుతుందని.. అని అడిగాడు.. దానికి వాళ్లు సరే కానీ అన్నారు.. అక్కడున్న స్వామీజీ గెటప్ ఒకటి వేసుకుని గడ్డం పెట్టుకుని మైక్ అందుకుని స్టేజి ఎక్కాడు..