శేషుగాణ్ని పడగొట్టి కేశిరెడ్డికి అప్పగించి వచ్చాక బసవయ్యకి చెప్పారు. ఆయన తన కుచ్చిత బుద్దిని ప్రదర్శించి రత్న గాడిని యింటికి పిలిపించాడు.
“ఒరేయ్ డౌలు చెన్నప్ప కొడకా ఆ శేషుగాడు వూరొదిలి యెళ్లి పోయినాడంట కదా” అని అన్నాడు.
“అవునప్పా” అన్నాడు రత్నగాడు.
“వాడు మొన్న నీకు బెంగుళూరికి పోతాండానని చెప్పినాడంట కదా”
“ఆ అన్నాడు”
“పాపం ఆ యిషయం వాళ్ల నాయనికి చెప్పొచ్చు కదరా ఆళ్లు యెతుక్కోడానికి యీలుగా వుంటాది” అన్నాడు.
అవును అదీ నిజమే కదా! వాళ్లకి సాయం చేసినట్టు వుంటాది స్నేహితుని రహస్యం కాపాడినట్టు వుంటాదని శేషు గాడి నాయనతో “మామా నీ కొడుకు నిన్న రాతిరి నన్ను యెంట బెట్టుకుని కదిరికి పిలసక పోయినాడు. మొదట్లో యెంటికో చెప్పలా ఆడికి పోయినంకా బెంగుళూరు బస్సెక్కి ‘నేను బెంగుళూరు పోతాండా మాయప్పకి చెప్పు నన్ను ఎతకద్దని’ అన్నాడు మామా” అని అలవాటు ప్రకారం అతిశయం కలిపి చెప్పేడు. వాళ్ల కోపాన్ని చూసిన తరవాత గానీ వాడు చేసిన తప్పు తెలిసిరాలా. వొళ్లంతా హూనం చేసుకొని సుమారు వారం రోజులు కదలలేని పరిస్తితిలో యింటికాడ పడుకుని వుండిపోయాడు.
వారం రోజుల తరవాత లేచి నడిచే వోపిక వచ్చింది. ఆసుపత్రికి పోయివస్తావుంటే దారిలో రాజు యెదురుపడి “ఏమన్నా వాళ్లిచ్చిన పది రోజుల గడువులో యేడు రోజు బెడ్డు మీదే పాయే, మిగిలిన మూడు రోజుల్లో వాడు చిక్కక పోతే నిన్ను చంపేయరూ” అని యెగతాలి చేశాడు.
“వుండ్లే, వా నాకొడుకులు కొట్టిన దెబ్బలకి పాణం పోయి సత్తాంటే నొవ్వొకనివి ” అని కసురుకున్నాడు.
“వాడు దొరక్కపోతే నిజంగానే పాణాలు తీసేత్తారోళ్లు, బెంగుళూరు బస్సెక్కతా బెంగుళూరులో యాడ వుంటాడో చెప్పలేదా” అని అన్నాడు.
“ఎవునికి తెలుసు వై, వాడు బెంగుళూరికి పాయనో, చెన్నైకి పాయనో. వా నాకొడుకు పారిపోయి నాపాణం మిందికి తెచ్చినాడు” అని బాదపడ్డాడు.
“సరేప్పా వాడు యాడుండాడో నేను చెబుతా నాకేమిత్తావు”
రత్నగాడు యెగతాలిగా ఫీలయ్యాడు. “ఎంది యెగతాలా! వాడాడుండాడో నీకెట్ల తెలుసురా ”
“యెట్లో తెలుసుకుని చెబుతా, నాకేమిత్తావు ”
“ఎట్ల తెలుసుకుంటావు రా”
“అన్నో మా నాయన అంజనం యేత్తాడు తెలుసు గదా!”
“మీనాయన వూర్లో లేడుకదరా”
“అయితే నేనేత్తా, ఎట్ల అంజినం యేయల్లో నాకూ నేర్పించినాడు”
రత్నగాడు ఆలోచనలో పడ్డాడు. వెంటనే”ఆ . . . వాళ్లేసుండరా అంజినం” అన్నాడు.
“వాళ్లకత నాకు తెలీదు రాత్రి అంజినం యేసి చూసినా వాడేడుండాడో నాకు తెలుసు. తరవాత నీ యిట్టం” అన్నాడు.
రత్నగాడు నమ్మలేదా విషయాన్ని రాజుని చూసి నవ్వుకున్నాడు. వాడికి నమ్మకం కుదరలేదని అర్థమయ్యాక రాజు అక్కడ నుండి లేవబోయాడు.
రత్నగాడు చేయి పట్టుకుని ఆపేశాడు. “వాడు యాడుండేది నీకు తెలిస్తే వాళ్ల నాయనకి చెప్పచ్చు కదా” అన్నాడు.
“చెపితే పొయి వాళ్ల పిల్లగాన్ని యెంట తెచ్చుకుంటారు నాకేమొస్తాది. నాకు నీతో చిన్న పనుండాది. అది నువ్వు చేత్తానంటే నీకు చెబుతా”
“ఎం పనిరా”
“నువ్వు చేత్తానంటే చెబుతా”
“ముందు వాడు యాడుండాడో చెపితే చెత్తా”
“నిజంగా చేత్తావా . . . ఒట్టు”
“అమ్మతోడు”
“అయితే రేపు పొద్దన్నే చెరువు కట్ట మిందికి రా” అని వెళ్లిపోయాడు.
Bossu, ikkada amavasya ani cheppavu. Kaaani bavilo moon reflection paduthondi ani cheppav. Elaa possible idhi.. Bro