మెమోరీస్ 7 116

పూర్వ చరిత్ర

వేణుగోపాల స్వామి గుడి పూజారి పూర్వీకులు కూడా అదే గుడికి అర్చకులుగా వుండేవారు. వారే ఆ గుడికి ధర్మకర్తలు కూడా. మొదట వీరు పెనుకొండలో నివాసం వుండేవారు. అప్పట్లో తిమ్మప్ప నాయుడు పెనుగొండ సంస్థానానికి అధిపతి. అతని ఆధీనంలోనే కోనాపురాన్ని ప్రధానంగా చేసుకుని, కోనాపురం అడవి చుట్టూ వున్న పదహారు గ్రామాలకు వాసుదేవనాయుడు అమరనాయకునిగా పాలించేవాడు.

అటవీ సంపద మీద ఎక్కువగా ఆధార పడేవారు. అడవిలో దొరికే పల్లు, తేనే, జంతువుల చర్మాలతో పాటు, గృహ అలంకరణలకు వాడే వస్తువులకు కావలసిన కలపను ఎగుమతి చేసేవారు. కోనాపురపు లోయలలో ఎక్కువగా వెదురు, టేకు, చందనపు చెట్లు వుండేవి.

అడవిలో దొంగల బెడద ఎక్కువ అవడంతో సైన్యాన్ని పెంచే పనిలో పడ్డాడు వాసుదేవ నాయుడు. ఎన్ని సార్లు వారిని ముట్టడించి మట్టు పెట్టాలని చూసినా తప్పించుకొని పారిపోయే వారు. అడవి విశాలమైనది. అందులోని కోనలు బహు ప్రమాదకరమైనవి. వాటిలోనుండి బయట పడటానికి ఎన్నో దార్లు. గూడా చారులును నియమించి అడవిని క్షుణ్ణంగా గాలించి దొంగల వునికిని కనుక్కున్నాడు.

అడవి దొంగల నాయకుడు సిద్దప్ప. అతని పూర్వీకులు మూలికా వైద్యంలో ఆరితేరిన వైద్య్లులు. కోనాపురం అమరనాయక మండలంలోని శివుని సముద్రంలో జనాలకి మూలికా వైద్యం చేస్తూ వుండేవారు. సిద్దప్ప తండ్రి మల్లప్ప మద్యం సేవించి వైద్యం చేయడంతో కొంత మంది ప్రాణాలు పోయాయి. వూరిలోని జనాలను వారిని వూరినుండి వెళ్లగొట్టారు. మల్లప్ప, పెళ్ళాం పిల్లలతో సహా వూరొదిలి అడవిలోకి పారిపోయాడు. వూరి వారి మీదున్న కోపంతో దారి కాచి జనాల సొత్తుని, వారి ఆడవాళ్ల మానాన్ని దోచుకునే వాడు. అతని లాగే వూరి నుండి అమర నాయక మండలం నుండి వెలివేయబడిన కొంత మందిని పోగుచేసి గుంపుగా దొంగతనాలు చేసేవాడు.

సిద్దప్పకి చిన్నప్పటి నుండే నిషేదించ బడిన వైద్యం మీద ఆసక్తి. సిద్ద యోగుల్లా క్షుద్ర విద్యలను నేర్చుకోవాలని కలలు కంటుండే వాడు. దొంగల గుంపు పెద్దదయ్యే కొద్ది వారు వూర్లకు దూరంగా పోయి కొండల్లో దాక్కోవడం అవసరమైంది. అటువంటి సమయాల్లోనే సిద్దప్ప ఒక కొండ లోయలోని మంత్ర మందిరాన్ని కనుకున్నాడు. ఎంతో మంది మంత్రగాళ్లకి అది నిలయం. వివిద రకాలయిన మంత్రగాళ్లు అక్కడ విద్య నబ్యసించే వాళ్లు. వారిలో చానా మంది తపస్సు చేసుకుంటూ రాళ్లలో రాళ్లలా, మట్టిలో మట్టిలా, పకృతిలో పకృతిలా కలిసి పోయి వుంటారు. ఎంతో మంది తపస్సు చేస్తూనే ప్రాణాలు వదిలేశారు. వారికి ఆత్మలను, వాటి జ్ఞాపకాలను బందించ గలిగే శక్తి వుండేది. అక్కడ విద్య నేర్చుకుని ప్రాణాలు వదిలిన ప్రతి మంత్రగాడికి గుర్తుగా ఒక మందిరం వుంచేవారు. అందులో అతని జ్ఞాపకాలను నిక్షిప్తం చేసేవారు. అన్ని మందిరాలు కొండను తొలిచి కట్టినవే. కానీ బయటికి మాత్రం
కనిపించవు. అది మామూలు కొండ రాళ్లలా కనిపించేవి.

సిద్దప్ప అక్కడే విద్య నేర్చుకున్నాడు. చాలా వరకు క్షుద్ర శక్తులను తన అదుపులో వుంచుకున్నాడు. ముప్పై యేళ్ల ప్రాయానికి పూర్తీస్థాయి మంత్రగాడిగా మారాడు. వాడి మంత్ర శక్తులతో అడవి దొంగల గుంపుని నిర్జించబోయిన వాసుదేవ నాయుడి సైన్యాన్ని వెనక్కి తరిమాడు. ఆ విజయం తరవాత దొంగల గుంపుకి నాయకుడిగా మారాడు. ఎంత పెద్ద మంత్రగాడైనా తన తండ్రి వారసత్వంగా వచ్చిన మూలికా వైద్యాన్ని మాత్రం వదలలేదు. అలాగే దొంగతనాన్ని కూడా. దోచుకోవాలనుకున్న వూరిని ముందుగా మంత్ర శక్తులతో అదరగొట్టి బెదరగొట్టి వారిని ఇల్లకే పరిమితం చేసేవాడు. అసహాయులైన వారి కొంపల్లో దూరి దోచుకునే వారు. అడవి దారిలో పెనుకొండకు పంపే పన్నుల తాలూకు ధనాన్ని, ధాన్యాన్ని కొల్లగొట్టేవాడు.

ఒకనాడు కోనాపురం దగ్గరున్న కోనల్లో మూలికల కోసమని వెతుకుతుంటే అతనికి విచిత్రమైన భావన కలిగింది. తన మంత్ర శక్తితో ఆప్రదేశాన్నంతటిని పరికించాడు. ఎన్నో యేళ్ల కిందట భూస్థాపిత మైన గుప్త నిధుల ఆనవాలు కనిపించాయి. ఆనందంతో ఎగిరి గంతేశాడు. ధనం మీద ఆశ పెరిగింది. కానీ దానిని దక్కించుకోవటం అంతసులువైన పనికాదు. అది ఎన్నో మట్ల లోపల వుంది. కొండకి మధ్యభాగాన ఉండటం మూలాన తవ్వడం అంతసులువు కాదు. అందుకోసమని తవ్వడానికి జనం కావలసి వచ్చింది. అప్పటి నుండి ఇల్లని దోచుకోవడమే కాకుండా అందులోని మనుషులని అపహరించడం మొదలెట్టారు.

తన మండలంలోని దోపిడీకి గురి కావడమే కాకుండా కనిపించకుండా మాయమవుతున్నారని కొత్తగా అమరనాయత్వాన్ని స్వీకరించిన వాసుదేవ నాయుడి కుమారుడు గోపాల నాయుడు కలత చెందాడు. పెనుకొండ నుండి గొవిందాచర్య్లులు అనే శారదా దేవి అరాదకున్ని పిలిపించాడు. ఈయన పెనుకొండా దీశుడైన కనక నాయుడి ఆస్థానంలోని దేవాలయాలకి అధిపతిగా పనిచేసే నరసింహా చార్యుల యొక్క పుత్రుడు.