సుమారుగా గంట ఎదురు చూశాక తలుపులు తెరుచుకున్న చప్పుడు. ఆ వెంటనే ఆడపిల్ల గుంపు నవ్వుకుంటూ వచ్చిన సవ్వడి. వారి కాళ్లకున్న గజ్జలు గల్లు గల్లు మని సవ్వడి చేస్తున్నాయి. వాటి సవ్వడికి రాజు గుండేల సవ్వడి మారింది. నమ్మలేనట్లు నోరు తెరుచుకుని చూస్తూ వుండిపోయాడు.అందమైన దేవకన్యలు వాళ్లు. ఆ అంగ సౌష్టవం, ఆ అందమైన ముఖారవిందాలు. అంత అందమైన శరీరాలకు మరింత అందం జేకూర్చేలా వుండే వారి వస్త్రాలంకరణ. వారి ఒంటిమీద నగలు బంగారంతో జేసినవి. వాటిలో కొన్ని వజ్రాలు, పగడాలు కూడా వున్నాయి. అవి వెన్నెల కాంతిలో మెరుస్తున్నాయి.
గుంపుగా వచ్చిన ఆ ఆడ పిల్లలు జంటగా చేరి ఒకరి చేతులు మరొకరు పట్టుకుని గుండ్రంగా తిరుగుతున్నారు. వారలా తిరుగుతుంటే వారి కాళ్లకున్న అందెలు చేసే సవ్వడి ఒక రాగంలాగా వినిపించింది. వారలా అలసిపోయే దాకా తిరిగి అలసటకు గుండెల మీద చేతులు వేసుకుని రొప్పుతూ ఒక చోట కూలబడ్డారు.
“ఇప్పుడేమాట ఆడుకుందాం” అనింది వారిలో పెద్దమ్మాయి.
“గుజ్జన గుళ్లు” ఒకమ్మాయి.
“వద్దు”
“నాలుగు స్థంభాలాట”
“వూ హూ”
“చెన్నే కుప్పలు”
“నిన్ననే కదా ఆడింది”
“ముక్కు గిల్లే ఆట”
“అమ్మో నా ముక్కు” అనింది ఒక పిల్ల.
“చింత పిచ్చులాట”
“వద్దు”
. . . . .
. . . . .
ఇలా వారి సంభాషణ చానా సేపు సాగింది. మరేమి చేద్దాం అని అనుకుంటుండగా “బొమ్మల పెల్లిల్లు” అనింది ఒక పాప.
“ఎప్పుడూ బొమ్మల కేనా”
“బొమ్మలకి వద్దు గనీ మనలోనే ఎవరో ఒకరికి చేద్దాం” అన్నారు. ఆ మాట అందరికి నచ్చింది.
“ఎవరు చేసుకుంటారు?” అందరూ కలిసి పెద్ద పిల్లని ఎంపిక చేశారు.
“పెండ్లి కూతురుంది. పెండ్లి కొడుకేడీ” అని నవ్వేసిందొక పిల్ల. ఆ పిల్లతో అందరి నవ్వులు కలిశాయి.
“ఈ పెండ్లి కూతురిని నేను చేసుకుంటాను” అని ముందుకొచ్చిందొక పిల్ల.
“నేను మగవాడినే చేసుకుంటాను” అనింది పెద్ద పిల్ల.
“ఒక్క మగపురుగు కూడా లేకుండా తరిమేశామే. ఇప్పుడు మగవాడెక్కడ చిక్కుతాడే” అనిందొక పిల్ల.
“నేను మగవాడిగా మారితే” అని ఒక పిల్ల మగవాడి వేషానికి మారింది. తెల్లటి చొక్కా, దోతిలోకి పెండ్లి కొడుకు వేషాన్ని దరించింది.
“నేను మగపుట్టుక పుట్టిన వాడినే చేసుంటానని” ఆ పిల్ల ఆశల మీద నీళ్లు పోసింది. ఆశ పడిన పెండ్లికొడుకు బుంగ మూతి పెట్టి మునుపటి రూపానికి మారిపోయింది.
ఈ సంభాషణ నంతటిని గమనిస్తున్న రాజు మొదట అక్కడ ఏమి జరుతుందో అర్థం కాలేదు. కానీ వారలా వేషాలు మార్చడం చూడగానే అది బ్రమ కాదు. కల అసలే కాదు. ఇది నిజమే. నిర్దారించు కోవడానికి గిల్లి చూసుకున్నాడు. నొప్పనిపించింది.
ఆ పూబోణీలు అక్కడ అడుగు పెట్టిన కాడి నుండి గాలిలో పూల పరిమలం అధికమైంది. మత్తెక్కించే మల్లెల వాసన. గాలి కూడా చల్లగా వీస్తూ శరీరానికి మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగిస్తొంది. అట్లాంటి వాతావరణంలో అందంగా అలకరించుకున్న కన్నెపిల్లలను చూస్తుంటే మనసు వుర్రూతలూగుతొంది. మగాడై పుట్టి అలాంటి శరీరాకృతులను చూసి తట్టుకోవడం మహాకష్టం. అతని ప్రమేయం లేకుండానే అతని మగతనం గట్టి పడింది.
వారి సంభాషణ పెళ్లి మీదకు రాగానే మనసు మరింత బరువెక్కింది. ‘అరేయ్. . . .వీళ్లు మనుసులై వుంటే ఎంత బాగుండేది. పెళ్లి కూతురులా ఆళ్ల మద్యలో కుచ్చున్న పిల్ల ఎంత అందంగా వుంది.’ అని అనుకున్నాడు అంతరంగంలో. ఆ పాప మీదకి రాజు మనసు మరులు పోయింది.
ఇంతలో ఆ ఆడగుంపులో వయస్సులో పెద్దదయిన ఆడది “అయితే వరుణ్ని మేమే ఎంపిక చేస్తాం . . . నీకు ఇష్టమేనా” అనింది. దానికా పెళ్లి కూతురు సిగ్గు పడుతూ తనకిష్టమే అన్నట్టు తలూపింది. ఆమె సిగ్గుని చూసి ఆట పట్టించారు.
ఆ సందర్బానికి తగ్గట్టు ఒక పాట అందుకున్నారు.దానికి మిగిలిన వారు గొంతు గలిపారు.
వచ్చావటయ్యా పూల ఱేడా,
తెచ్చావటయ్యా పూల రాజా,
నీవు తెచ్చిన పూవులే కా
నికల కిస్తామూ
కోరి కోరినీ అందానికీ మా
కోకిలమ్మా గొంతుకునకూ,
సొగసుచేతా పాటచేతా
తగీపోయిందీ
రావయ్య ఓ పూల రాజా
రావయ్య ఓ అందగాడా
కోకిలమ్మకు నీవు, నీకూ
కోకిలా తగునూ
అని పాటలు పాడుతూ ఆమెను అల్లరి పట్టిస్తుంటే ఆమె సిగ్గుతో తుర్రుమనింది. ఆమె వెంటే మిగిలిన ఆడపిల్లలు పరిగెత్తారు ఒకరిద్దరు తప్ప. ఆమె వెళ్లిన వెంటనే అంతవరకూ ఆ ప్రదేశాన్ని ఆవరించుకుని వున్న పూల పరిమళం ఆమె వెంటే వెళ్లిపోయింది. రాజు మనస్సు వుసూరు మంది. అప్పటికే తెల్లారిపోయే సూచనలు కనిపిస్తుండటంతో వెనక్కి తిరిగి ఇంటికి వెళ్లిపోదామనుకున్నాడు.
ఆ పెళ్లి కూతురు చంద్రభవన నాశనానికి కారణమైన రామాచార్యుల కూతురు పుష్పవళ్లే. ఆమెకు పువ్వులంటే ప్రాణం. అందుకనే ఆమెను ఆ భంగళాలో నివసిస్తున్న తోటి ఆడపిల్లల ఆత్మలు “నీకు పూల రాజుతోనే మనువు, ఆ వసంతుడి అందాన్ని చూసి నీవు కోకిల గొంతుతో పాటలు పాడి వాడిని సంతోష పెడితే, వాడు నీకు ప్రాణ ప్రదమైన పూవ్వుల లాగా చూసుకోవాల” అని ఆట పట్ట్టించేవారు.
ఆ భవనానికి ఆమె రాణిలా, మిగిలిన వారు చెలికత్తెల్లా వుండేవారు. వారిదే ఆ కోట. వారందరికి పెద్ద పార్వతి. నడివయస్సు ఆడది. కాలుని పైశాచికత్వానికి బలైన ఆడది.పదేళ్ల కింద వారి ఆత్మలను భవనం నుండి విడిపించిన తరవాత అంతకు ముందు నుండి అక్కడ నివశిస్తున్న పిశాచాలను తరిమేసి ఆ ఆడ గుంపు మాత్రం మిగిలిపోయింది.
రాజు వెనక్కి తిరిగి వెళ్లే సమయంలో పార్వతి మిగిలిన వారికి ఎదో చెబుతొంది. అది వినాలని చెవిని నిక్క బెట్టాడు.
“ఈ పెళ్ళితో మనం ఇక్కడ ఈ లోకంలో మిగిలిపోయిన కారణం పూర్తవుతుంది. అన్ని పనులు సక్రమంగా జరగాలి. మనం ఆయన చెప్పిన పనిని పూర్తీచేస్తే, మనకు విముక్తి లభించినట్టే. ఈ కార్యంతో లోక కళ్యాణమొకటి ముడిపడి వుందని ఆయన అనే వారు” అంటొంది.
“అది సరే మరి పెండ్లి కొడుకెవరు” అనిందో పూబంతి.
“ఇంకెవరు పూల రాజే”
“ఎవరా పూల రాజు?”
“రాజంటే రాజే!”
“ఎవరా రాజు?”
“అడిగో ఆ రాజు” అని రాతి వెనకనుండి తొండలా నిక్కి చూస్తున్న రాజు వైపు చేయి చూపించి. వెంటనే రాజు గుండెలు జారిపోయాయి. దెయ్యాలు తన వునికిని కనిపెట్టాయన్న విషయం రాజుకి అర్తం కాగానే పరిగెత్తి వెళ్లిపోవాలనుకున్నాడు. కానీ పరిగెత్త కుండా అక్కడే వుండిపోయాడు. ప్రాణం లేని దెయ్యం తననేమి చేస్తుందనే ధైర్యం కావచ్చు. కానీ ఆ ధైర్యం ఎక్కువసేపు నిలబడలేదు. దారిలో తనకు ఎదురైన శంకర్రావు కోడలు గుర్తుకు రాగానే, అయినా ధైర్యంగా నిలబడ్డాడు. ధైర్యంగా వుంటే చాలు భయానికి ధైర్యమే విరుగుడు. “దెయ్యాలు కూడా ధైర్య వంతులని ఏమి జెయ్యలేవురా అబ్బిగా” అనేటోడు రంగప్ప మామ.