మెమోరీస్ 7 116

“ఒరేయ్ అబ్బి, ఒగనాడు నేను మాయన్న యెన్నెల యెలుగులో గూటవ కట్టినాం చేను దున్నదామని, పాపం మీ పెద మామ నిద్రమత్తులో ఎద్దులను తిరగ గట్టినాడు. వలపట దాన్ని దాపట వైపు, దాపట దాన్ని వలపట వైపు. అంతే ఆ చిన్న గుట్ట మీది నుండి ఒక ఆడ మనిషి దిగొచ్చింది. పిచ్చి నా కొడకల్లారా ఎద్దులను సరిగ్గా కట్టడం నేర్చుకొండి అని చెప్పి యెల్లిపోయింది. అంతే ఆ పొద్దుటి నుండి రాత్రిపూట ఆ చేను జోలికే పోయేది లేదు. మా నాయనకి చెప్తే దెయ్యమన్నాడు. మా యమ్మకి చెపితే దేవత అనింది.
అంతే గాదురా నాయనా ఆ రామ్మూర్తిగాడు, గొర్రెలు కాసుకునే యెదప ఆ గుట్టకాడ బాపనోళ్ల పాపను చెరచబోతే ఆయమ్మ వచ్చి వాని తలకాయను బండకేసి కొట్టి సంపేసింది. అమాయకపు ఆడపిల్లలను ఆయమ్మకు తెలిసేలా ఏమైనా చేశారంటే చాలు వానికి చావే గతి. హ్మ్మమ్మ్. .. అంతే సంపేత్తాది.” అని రంగడు చెప్పినవన్నీ రాజుకు గుర్తుకు వచ్చాయి.
రాజు ఆ రాతి మీద కాలుమీద కాలేసుకుని కూర్చున్నాడు. పార్వతి ముందుగా రాజుని చేరుకుంది. ఆమె వెనకాల మిగిలిన ఇద్దరు ఆడవాళ్లు వచ్చారు. రాజు చుట్టూరా గుండ్రంగా తిరుగుతూ రాజుని పరిశీలిస్తున్నారు.
“ఎందుకలా తిరుగుతున్నారు?”అనడిగాడు.
“అక్కా మనం ఈనికి కనపడతాండామె” అనింది ఓ పూబంతి.
దానికి సమాదానంగా పార్వతి “నాకు తెలుసు” అనింది.
“మరీ చిన్న పిల్లాడేమోనే మీసం గూడా సరిగ్గా రాలా” అని రాజు మూతిని వేళ్లతో గట్టిగా పట్టుకుని నోటిని వెడెల్పు చేసింది. ఎద్దు పళ్లని పరిశీలించి దాని వయస్సు చెప్పినట్టు “పల్ల వరస చక్కగానే వుంది. కానీ చిన్న వాడు”అనింది ఇంకో పూ బంతి.
“కానీ మన రాణెమ్మకి చక్కని జోడి”అనింది మరో పూబంతి.
“రాణెమ్మ ఎవరు?” అనడిగాడు.
“ఇంకెవరు మా కోకిలమ్మ. గొంతెత్తి పాడిందంటే చాలు వసంత కోకిల కూడా తలవంచాల్సిందే”
“ఇంత వరకూ మాతో ఆడుకొనింది కదా నువ్వు చూడలేదా?”
“సరిగ్గా చూడలేదు”
“పరవాలేదు. మా సాంప్రదాయంలో వధువుని వరుడు పెళ్లికి ముందు చూడ్డం నిషిద్దం. సూత్ర ధారణ ముందు మాత్రమే ముఖం పరిచయం. అంత వరకు విరహమే.” అనింది పార్వతి.
నాలుగు గంటల సమయం దగ్గర పడే సమయానికి “ఇంక చాలు సమయం అవుతాంది లోపలికి పదండి” అని పూ బోణీలను అదిలించింది పార్వతి. వారులోపలికి వెళ్లిన క్షణాలకు పెద్ద మందిర ద్వారాన్ని మూసినట్టు కిర్రున శబ్దం వచ్చింది.