మెమోరీస్ 7

టీనా

ఈశ్వరా చారి ఇచ్చిన తోలు చిత్రపటాన్ని ముందర వుంచుకుని , రంగనాథాలయం గుట్ట మీదున్న ఎత్తైన రాతి మీద కూర్చుని చంద్ర భవంతి ఎక్కడ వుండవచ్చనే వూహ చేస్తున్నాడు రాజు. గుట్టకి తూర్పువైపు రంగ మహల్. గుట్టకి పడమటి వైపు చంద్ర భవనం.
చిత్రపటంలో చంద్ర భవనానికి, గుట్టకి దూరాన్ని అంచనా వేసి చూస్తే ప్రస్తుతానికి అక్కడ ఒక చిట్ట రాతి గుట్ట మాత్రం కనబడుతొంది. ఆ గుట్ట చుట్టూ వున్న పొలాన్ని రాజు మేన మామే పంట పెడతున్నాడు. ఆ పొలంలో వర్షం మీద అధారపడి వేసే పంటలు మాత్రమే వేస్తారు. వేసవి అయిపోయిన తరవాత వచ్చే తొలి వానకే పొలాన్ని దున్నాలని అనుకుంటున్నాడు రంగడు. నాగప్ప చెల్లెలు యెంగటమ్మని పెండ్లి చేసుకున్నప్పుడు రంగనికి ఎటువంటి ఆస్తి లేదు.
రామలింగా రెడ్డి ఆ వూర్లో ఎస్టేట్ ఫార్మ్ చేశాక అతనికా భూమిని కౌలుకి ఇప్పించాడు రంగడు. దాంట్లో పండే పంటలో మూడొంతులు రంగనికి, ఒక వంతు ఎస్టేటుకి. ఆ వూర్లో చానా భూమిలు ఇదే కట్టుపై పండించబడుతున్నాయి. భూమిలేని పేద వారికి ఆ ఎస్టేట్ కింద భూమిని అలా కట్టుపై ఇస్తుంటారు.
రంగనికి నలవై గొర్రెలు కూడా వున్నాయి. అంతకు ముందు వాళ్లు నరసింహా రావు అనే బాపనయ్య దగ్గర సేద్యగాళ్లగా వుండేవాళ్లు. పెండ్లయిన మరు క్షణమే రంగడు వేరే కుంపటి పెట్టాడు. కొత్త కాపురానికి నాగప్ప ఎంతో సాయం చేశాడు. నాగప్ప రామలింగా రెడ్డి దగ్గర పని చేసేవాడు. ఆ చనువుతోనే రంగప్పకి ఆ పొలం ఇప్పించాడనేది రంగని అభిప్రాయం.
పొద్దున గొర్రెల మందని బయలుకి తోలుకు పోతుంటే “మామా, నేనూ వస్తాను” అన్నాడు రాజు.
“ఎండ రా అప్పిగా తట్టుకుంటావా” అన్నాడాయన.
“పిలసకపో మామా, ఇంట్లో ఒక్కడే ఏమ్ చేస్తాడు వాడు”అనింది యెంగటమ్మ.
“నీ స్నేహం, ఆ సూరిగాడేటికి పోయినాడు” సూరిగాని గురించి అడిగాడు రంగడు.
“వూరికి పోయినాడు గదా” అని గుర్తుకు చేసినాడు.
“సరే దా” అని చేతి కర్రని రాజుకి అందించాడు. సద్ది సంకన తగలేసుకుని గొర్రెల అదిలిస్తూ నడిచాడు.
పగలంతా గొర్రెలను ఎక్కడెక్కడో మేపి మద్యాహ్నానికి సంది బాయి కాడికి తోలారు. అడవి అంచుల్లో వుంటుందా బావి. బాయి గట్టున ఒక పెద్ద రావి చెట్టు, ఆ చెట్టు కిందనే ఆంజనేయ స్వామి గుడి వున్నాయి. గుడిలోని మూర్తికి ఈ మధ్యనే ఎవరో ఆకుపూజ చేసినట్లున్నారు.
రావి చెట్టు నీడలో సద్ది విప్పి భోజనం చేసారు. బావిలో నీళ్లు తాగారు. గొర్రెలకు కూడా నీళ్లు తాపించారు. సాయంత్రం అయ్యాక “ఇదిగో ఇదే మన చేను” అని రాళ్ల గుట్ట చుట్టూ వున్న పొలాన్ని చూపించి. “అదిగో ఆ చిన్న సిగర చెట్టు కాడి నుంచి ఈ చిన్న కటాని ఆవలున్న పెద్ద నేరేడు చెట్టుకాడి వరకూ వున్న అయిదెకరాలు మనవే.”
“మనకీ చేనుని కట్టు గుత్తకి ఇచ్చినప్పుడు ఇదంతా రాళ్లే. దీన్ని ఇంగడించడానికి ఒక ఏడు పట్టింది. ఈ రాళ్లన్నీ ఎవరో వడ్డోళ్లు తొలిచినట్టు సక్కగా వుండేవి.”అన్నాడు. “ఇంతకు ముందు ఇది వూరేనని వూర్లో ముసలోళ్లు అంటుండే వాళ్లు. ఏమైనా పాత నిధులు దొరుకుతాయేమోనని గుంతలు తవ్వి వొదిలేశారు” అని ఒక నడుము లోతున వున్న గుంతని చూపించి.
“మల్ల దొరికినాయా మామ” అన్నాడు రాజు.”వుంటే కదా చిక్కేకి, రాళ్లు బయటికి తీయలేక యిడిసి పెట్టినారు. ఎంతా లావు, బరువు వున్నాయనుకున్నావు అవి” అని ఒక పెద్ద రాతిని చూపించాడు. చేను గట్టు మీదుందా రాయి.
“కానీ రా అప్పయ్య. . . రాత్రి పూట మాత్రం ఎవరో ఆడ పిల్లో నగినట్టు శబ్దాలు యినపడతాయంటారు. ఒక సారి నేనూ మీయత్త చేను కాపలాగా పనుకున్నా మీడ. చిన్న గుడిసేసుకుని పడుకున్నాము. ఆ రాత్రి గుడెసంతా కదిలి పోయింది. ఎంత పెద్ద గాలి తోలిందో తెలుసా. గుడిసె పైనున్న కాసి అంతా గాలికి లేచిపోయింది. మీయత్త బెదిరిపోయి, మూడు రోజులు జరం తగ్గలా తెలుసా” అని నవ్వాడు. నిజానికి బెదురుకుంది రంగడే.

* * * * * * * * * * * * * * * *

చంద్రుడు మరణించాక అతని శిష్యగణానికి నాయకత్వం కొరవడింది. చాలా మంది వారికి నచ్చిన దారిలో
పయనించారు. దయాగుణం కలిగిన జాలి హృదయులు చెడు విద్యను మంచికోసం వుపయోగిస్తే, మరికొందరు మాత్రం మంచివాళ్లను హింసించే చెడ్డ వారికి సాయం చేసేవాళ్లు.
చంద్రుని శిష్యుడొకడు కొడికొండ అనే వూరికి పోయాడు. అక్కడ నివాసముంటున్న ఒక ముసలాడితో స్నేహం చేశాడు. వారం రోజుల పాటు ఆ ముసలాడిచ్చిన ఆతిథ్యానికి పొంగిపోయిన అతడు. “నీకేమన్నా సాయం కావాలంటే చెప్పు తాత చేస్తాను” అని మాటిచ్చాడు.
“ఈ ముసలి వయస్సులో నాకేమి సాయం వద్దులే నాయనా”అన్నాడా ముసలాయన.
“కనీసం నీకు సంతోషకరమైన పనేమైనా చేయాలనిపిస్తొంది తాతా” అన్నాడు చంద్రుని శిష్యుడు.
“ఈ వూరు వల్లకాడైపోతే గానీ నేను సంతోషంగా వుండేనయ్యా” అని పడుకున్నాడు ముసలోడు. తెల్లవారు ఆ ముసలోడు లేచే పాటికి చంద్రుని శిష్యుడు కనపడలేదు. వారం తిరిగే లోపు వూరిలో ఒక్కో ప్రాణం రాలిపోవడం మొదలైంది. నెలతిరిగే లోపు వూరు మొత్తం ఖాలీ అయిపోవడం కూడా జరిగిపోయింది. ముసలాడి చివరి రోజుల్లో నొట్లో నీళ్లు పోయడానికి కూడా ఎవరూ మిగల్లేదు. చానా మంది చనిపోతే, మిగిలిన వారు వూరి ఒదిలి వెళ్లిపోయారు.
ఇంకో వూరిలో ఒక శిష్యునికి ఒక దుర్మార్గుడు స్నేహితుడయ్యాడు. ఆ దుర్మార్గునికి దాయాదులతో గొడవ. భూమిని దాయాదులతో పంచుకోవడం వానికి ఇష్టం లేదు అందుకనే ఆ శిష్యుని సాయం అడిగాడు. “చూడప్పా ఈ నాకొడుకులు ఒగడూ మిగల రాదు. ఈళ్లు సత్తే ఆ భూమంతా నాదే అయితాది. ఈ పని చేసి పెడితే నీకు నా బిడ్డనిచ్చి పెండ్లి చేత్తాను. కానీ అప్పా ఈ పని మన చేతుల మీదుగా జరిగిందని ఎవళ్లకూ తెలియరాదు. కనీసం అనుమానం కూడా రారాదు.” అన్నాడు. ఆ శిష్యునికి కూడా ఆ దుర్మార్గుని కన్య కూతురి మీద కన్ను వుండేది.
“అయితే వెంటనే నాకు నిశ్చితార్థం ఏర్పాటు చేయి” అన్నాడు. ఆ శుభకార్యానికి వచ్చిన అందరి బందువుల తినే అన్నంలో పెట్టుడు మందు కలిపేశాడు. కొద్ది రోజులకి క్రోదం ఎక్కువై ఒకరిని ధూషించుకునే వాళ్ల్లు. ఎవడైనా కోపం వచ్చి రేయ్ రేపు నిన్ను లేపేస్తా అన్నాడంటే చాలు వాడలాగే లేచిపోయేవాడు వల్లకాటికి. చచ్చిన వాని బందువులు అవతలి వాన్ని లేపేసేవాళ్లు.
పెండ్లి చేసుకున్న కన్య పిల్లని చంద్ర భవనానికి తోలుకొచ్చి “ఇదిగో నా వాటా కన్య పిల్ల ఈ వారం దీన్ని బలిచ్చి గురువు గారి ఋణం తీర్చుకుంటానన్నాడు.