“ఏం మాట్లాడుతున్నవే..” ఇంక ఆపమన్నట్టుగా ఏంటి ఈ గోల అన్నట్టుగా అరచేయి తిప్పుతూ..
అలా రాశి అన్నప్పుడు అర్జున్ తననే చూస్తున్నాడు. అలా అన్నప్పుడు తన కదిలే కనుబొమ్మలు, పెదవులు, అటూ ఇటూ తిరిగిన తల, అన్ని దిక్కులూ కదిలిన చెవి దుద్దులూ అన్నీ భలే నచ్చేస్తున్నాయి. ఇంకాసేపు అలా చూస్తే బాగోదని బలవంతంగా తల తిప్పుకుని రాశి ఇబ్బందిని చూసి నవ్వుతున్న సనాని చూస్తున్నాడు.
“బాబూ.. అలా చూడకు. ఐ హావ్ ఏ బాయ్ ఫ్రెండ్” టీజింగ్ గా అంది సనా
“అవును ఇప్పటిదాకా బాయ్ ఫ్రెండ్ తోనే షికార్లు కొట్టి సాయంత్రానికి వచ్చింది కాలేజీకి” పక్కనున్న పాప అనింది.
“వాడు అడిగాడా?” పాపతో అనింది సనా
“వాడు ఆడిగాడని చెప్పవా ఇవన్నీ” సనా కి కౌంటర్ ఏసింది పాప.
వాళ్లిద్దరూ వాడు అనేసరికి అర్జున్ కి ఇబ్బందిగా అనిపించింది. అది రాశికి అర్థం అయింది.
“వాళ్ళు ఓవర్ ఫ్రెండ్లీలే.. నాట్ ఇంటెన్షనల్” అంది అర్జున్ తో
“ఇట్స్ ఓకే” అని గొంతు సరిచేసుకుని “మీరు చూసారో లేదో.. నేను మొత్తం వీడియో పెట్టలేదు. చివరన మీరు అతన్ని వదిలేసి వెళ్లే అంత వరకూ తీయలేదు..”
“పెట్టాల్సింది ఏముంది” అంది సనా
“అంటే అతను చివర్లో తనను తిట్టాడు వాడు అందుకే..” అంటూ చేతిలో ఫోన్ తీసి రాశికి ఇచ్చాడు చూడమని.
రాశి ప్లే చేసి చూసింది. సనా, పక్కనున్న పాప కూడా చేరారు. వీడియోలో సనా వదిలేయడం వరకే తీశాడు. రాశిని ప్రపంచానికి చాలా పాజిటివ్ గా చూపిస్తున్నాడు. రాశికి అతను చూపించిన ఈ శ్రద్ధ నచ్చింది. చిన్నగా కామెంట్స్ వైపు వెళ్ళింది. ఒక కామెంట్ చూసి ఆగింది. ‘పిట్ట వెనుక బస్తాల సైజ్ ఎంత మాస్టారు’ అని ఉంది. రాశికి కోపం వచ్చింది. అసహనం పెరిగిపోయింది. దానికి ఛానల్ ఓనర్ ఏదో రిప్లై ఉంది. ‘మీ అమ్మని అడుగు మాస్టారు బాగా గెస్ చేస్తుంది’ అని. అది చూసాక రాశికి కుదుటపడింది. సంతృప్తిగా ఉంది. రాశి ఆ కామెంట్ చదివింది అని అర్థం చేసుకున్న సనా రాసి భుజాల మీదుగా చేయి వేసి దగ్గరకి తీసుకుని “డోంట్ కేర్ ఇవన్నీ” అంది.
ఇప్పుడు రాశికి అర్జున్ నచ్చాడు. అతను చేసిన పని నచ్చింది. అతను తన దగ్గరకు రావడం నచ్చింది. అమాయకంగా పర్మిషన్ అడగడం నచ్చింది. సనా దగ్గర ఇబ్బంది పడడం నచ్చింది. సనా దగ్గరనుండి అతన్ని కాపాడడం నచ్చింది.
కానీ “వాట్ ఈజ్ థిస్ రిప్లై” అంది అతను ఇచ్చిన రిప్లై చూపిస్తూ..
“హా..మిమ్మల్ని అన్నాడు అని నేను అన్నా..”
“నో. నన్ను అన్నాడని నువ్వు వాళ్ళమ్మని అన్నావ్”
“అదే.. బట్ వాడినే అన్నా..”
“మరి వాళ్ళమ్మ ఎందుకు వచ్చింది”
“నేను వాడిని బ్లాక్ చేసేసాను ఇంక అలాంటి కామెంట్స్ రావు”
“అలా అనే వాళ్ళు ఏ మూల చూసినా ఉంటారు. కానీ నువ్వు కూడా అలా అంటే నీకు వాడికి తేడా ఏముంది”
అర్జున్ ఒక్క నిమిషం ఆలోచించాడు. ఏమనుకున్నాడో మరి “ఇంకెప్పుడూ అలా అనను” అన్నాడు.
“ఐ కెన్ అండర్స్టాండ్. నీ ఇంటెన్షన్ తిట్టడం కాదు. బట్ మనం కూడా వాడి భాషే మాట్లాడితే యూజ్ ఏముంది? వాట్ ఈజ్ ద డిఫరెన్స్ వి కన్ మేక్ విత్ దట్ లాంగ్యుఏజ్”
“హ్మ్మ్..” అంటూ..”మీరు ఫెమినిష్టా”అన్నాడు
రాశికి ఏమనాలో అర్థంకాలేదు. సనా, పక్కనున్న పాప మొహంలోకి చూసింది రాశి. ముగ్గురూ ఒకేసారి నవ్వేశారు.
“ఏంటి” అయోమయంగా అన్నాడు అర్జున్
కాస్త నువ్వు ఆపి “ఫ్రీడమ్, ఈక్వాలిటీ గురించి పోరాడే అందరూ ఫెమిస్టులే”.
“మరి..”అని అర్జున్ ఏదో అనబోతుండగా “ఫెమినిస్టు పేరు వాడే వాళ్ళందరూ ఫ్రీడమ్, ఈక్వాలిటీ గురించే మాట్లాడాలని లేదు. కొందరు పెర్సొనల్ బెనిఫిట్స్, ఇంకొందరు సరిగా అర్థంచేసుకోలేక ఫెమినిస్ట్ మంటూ ఉంటారు”
“అయితే మీరు ఫెమినిస్టు అంటారు”
“హ్మ్.. యా.. బట్ ఫెమినిజం పేరు చెప్పకుండా కూడా మనం ఫెమినిస్టులమవ్వొచ్చు”
“ఓకే..” అన్నాడు ఏదో అర్థంచేసుకున్నట్టు.
రాశికి ఇప్పుడు అతనికి నేర్పడం నచ్చింది. అతన్ని మార్చడం నచ్చింది. అతను తనని ప్రశ్నలు అడగడం నచ్చింది.
“పెర్మిషన్ ఇస్తున్నారా అయితే” ఈసారి ఫ్రీగా అడిగాడు
“నో” అంది నవ్వుతూ అతని ఫోన్ అతనికిచ్చేస్తూ..