సరే చెప్తాను,కానీ శబ్దం చేయకుండా నా వెనకే రా,ఎట్టి పరిస్థితుల్లో కూడా మన కదలిక ఎవ్వరికీ తెలియకూడదు అంటూ నక్షత్రుడిని కర్ణుడు లాక్కొని వెళ్ళాడు ఆశ్రమం వెలుపల ఉన్న పొదల్లోకి..
నక్షత్రుడు ఏమవుతుందో అని ఉత్సాహంగా ఉండగా,మెల్లగా కర్ణుడు ఒక చెట్టు దగ్గర దాక్కొని అటువైపు చూడు అని చెప్పగా,నక్షత్రుడు అటువైపు చూసి బిర్రబిగుసుకు పోయాడు..
వాళ్ళకి ముందుగా కాస్త దూరంలో జ్యోతిరాదిత్యుడు ఒక యువరాజు ని గాల్లోకి లేపి ఏవేవో మంత్రాలు జపిస్తూ వాడిని గాలిలోనే చిత్రహింసలు పెడుతున్నాడు…అలాగే నక్షత్రుడు ఆసక్తిగా గమనిస్తూ ఉండగా కర్ణుడు మాత్రం ఇక పద అంటూ మళ్లీ లాక్కొని వచ్చాడు మునుపటి ప్రదేశంకి..
బావా,వాడు ఏమి చేస్తున్నాడు ??
నక్షత్రా, నాకూ అర్థం అవ్వలేదు వాడు ఏమి చేస్తున్నాడా అని??ఇంతకుముందు నన్నూ ఇలా చేయాలని ప్రయత్నించగా వాడి మాయలో నుండి తప్పించుకొని వచ్చేసాను నేను..
మరి ఈ విషయం గురువర్యులకి చెప్పాల్సింది,ఎందుకు ఆలస్యం చేసావు?
చెప్పాను నక్షత్రా,చెప్పిన రోజు మాత్రం జ్యోతిరాదిత్యుడు తప్పు చేస్తున్నాడు సహించేది లేదు అని గంభీరంగా పలికాడు,తర్వాతి రోజు నుండి యధావిధిగా వాడికే అనుకూలంగా ఉన్నాడు అదేంటో ఆశ్చర్యం గా..
బావా ఇదేదో పెద్ద కుట్ర లా ఉంది,మనము ముందుగా నేర్చుకున్న విద్యలలో ఇటువంటి ప్రయోగాలు మనం చూడనే లేదు,అలాంటిది వాడు ఎలా చేస్తున్నాడు?కొంపదీసి వాడికి మాయలూ మంత్రాలు అబ్బాయా?ఆ మాయలతోనే ఇలా అందరినీ మభ్యపెడుతున్నాడా?
నాకూ అదే సందేహం నక్షత్రా,మనము విద్యలు కంఠోభ్యాసం చేసేటప్పుడు కూడా వాడి చూపులు గమనించాను నేను,వాడి చూపు తీక్షణంగా గురువు గారి పైన పడిన వెంటనే మన గురువు గారు వాడికి అనుకూలంగా ఉండటం గమనించాను నేను.
.
దేవుడా ఇదేమి చోద్యం కర్ణా?మన గురువునే ఏమార్చే విద్యలు ఎలా వచ్చాయి వాడికి???
నాకూ అర్థం అవ్వట్లేదు నక్షత్రా,పోనీ వాడి వస్తువులని ఒక్కసారి పరిశీలిస్తే మనకు ఏమైనా సమాచారం తెలియొచ్చు ఏమో?ప్రయత్నిద్దామా??
పద కర్ణా నువ్వు చెప్పింది సబబుగా ఉంది అంటూ జ్యోతిరాదిత్యుడు గదిలోకి వెళ్లారు..
అంతా పరిశీలించిన పిమ్మట ఒక కొత్త పుస్తకం కనిపించింది కర్ణుడికి,బావా నక్షత్రా ఈ పుస్తకం మనకు గురువర్యులు ఇచ్చిన పుస్తకాలలో లేదు కదా?
అవును బావా నిజమే,బహుశా ఇందులో వాడి విద్యలకి సంబంధించిన విషయాలు ఉన్నాయేమో చూద్దామా??
వద్దు నక్షత్రా,ముందు మనం ఈ పుస్తకాన్ని మన గురువర్యులు కి ఇచ్చి తర్వాత ఏమి చెప్తాడో చూద్దాం పద…
అలాగే కర్ణా అంటూ గురువు సుధాముడు దగ్గరికి వెళ్లారు ఇద్దరూ…
యువరాజులారా రండి,మీరు ఇటు రావడానికి గల కారణం అని ప్రశ్నించాడు..
కర్ణుడు తనకి దొరికిన పుస్తకంను సుధాముడు కి ఇవ్వగా సుధాముడు కోపోద్రిక్తుడు అయ్యి ,యువరాజా మీరు పెద్ద పొరపాటు చేసారు ఇందులకి మీకు తగిన శిక్ష పడాల్సిందే అంటూ ఘీంకరించాడు కర్ణుడి పైకి.
నక్షత్రుడు తేరుకొని,గురువర్యా ఇది మేము జ్యోతిరాదిత్యుడు దగ్గర తస్కరించాము అంటూ జరిగిన విషయాలన్నీ చెప్పాడు.
నక్షత్రుడి మాటలు విన్న సుధాముడు ఒక్కసారిగా నేల పైకి జారిపోయాడు మొహంలో విపరీతమైన ఆందోళన పెట్టుకొని..తులసి ఏమండీ అంటూ ఓదార్చి ఆయనని మామూలు మనిషిగా చేసింది కాసేపటికి…
యువరాజా కర్ణా,నేను మీకు పెద్ద ద్రోహమే చేసాను అంటూ కళ్లనీళ్లు పెట్టుకోగా,గురువర్యా మీరు నాకు ద్రోహం చేయడం ఏంటి అని కర్ణుడు ప్రశ్నించాడు.
నిజమే కర్ణా,నేను ఆ కర్ణపిశాచిని విద్య ని మీకు నేర్పించి ఉంటే చాలా బాగుండేది…మీరు తెచ్చిన ఈ పుస్తకం నా నుండి సంవత్సరం క్రితం ఎవరో దొంగిలించారు,బహుశా ఆ పని మన అడవిలో ఉన్న ఆ రాక్షసుడు “గుహుడు” చేసాడు అని అనుకున్నాను..ఈ పని జ్యోతిరాదిత్యుడు చేసాడు అని తెలిసాక చాలా ఆందోళనగా ఉంది ఏమి జరుగుతుందో అని..
ఏముంది గురువర్యా ఆ పుస్తకంలో?కర్ణుడు కుతూహలం తో అడిగాడు.
కర్ణా,అందులో ఒక మనిషి ని అవలీలగా ఆవాహనం చేసుకునే విద్యలతో పాటు సృష్టి రహస్యాలన్నీ నిక్షిప్తమై ఉన్నాయి..ఈ సంవత్సరం లోపు ఆ జ్యోతిరాదిత్యుడు ఇవన్నీ నేర్చుకునే ఉన్నట్లున్నాడు.అందుకే తన విద్యలన్నీ ప్రయోగిస్తూ ఆఖరికి నన్ను కూడా వశపరుచుకున్నట్లు అనిపిస్తోంది..
అవును గురువర్యా,మీరు అతడికి ఆవాహనం అయ్యిన సందర్భాలు నేను చాలానే చూసాను,బహుశా అది మీకు వాడి పైన ఆసక్తి ఏమో అని మౌనం వహించాను, ఇంతకీ ఆ విద్యలు తెలిస్తే ఏమిటి సమస్య ఇప్పుడు?
సమస్య కాదు కర్ణా,ఆ విద్యలు తెలిసినవాడు మంచి కోసం పాటుపడితే విశ్వకల్యాణం లేకుంటే విశ్వవినాశనం…నాకు ఆందోళనగా ఉంది ఈ జ్యోతిరాదిత్యుడు ఇప్పుడే ఇలాంటి మాయలు తన తోటి విద్యార్థులు పైన ప్రయోగిస్తున్నాడంటే దేవుడా ఇక భవిష్యత్తు లో ఎలాంటి ఉపద్రవాలు సృష్టిస్తాడో అని..
అలాంటప్పుడు వాడు మేలు చేయకుండా ఈ విద్యలని దుర్వినియోగపరిస్తే వినాశనం తప్పదా గురువర్యా?
అవును కర్ణా,వినాశనమే అందులో ఎలాంటి సందేహము లేదు..ఆ విద్యలన్నీ క్షుణ్ణంగా తెలిసిన వాడు విశ్వవిజేత అవుతాడు..ఆ శక్తులతో వాడు వినాశనం వైపు మొగ్గు చూపుతాడేమో అన్న సందేహం నన్ను తొలిచివేస్తోంది…
మీరు బాధపడకండి గురువర్యా,ఇందులకి వేరే ఉపాయం లేదా??వాడిని అదుపులో ఉంచడానికి..
లేదు కర్ణా,ఈ విద్యలు ని బోధించే ఒకేఒక గురువు ని నేనే,బోధించడం తప్ప ఇంతవరకూ నేనూ ప్రయోగించింది లేదు..నేను నా శక్తులతో ఆ జ్యోతిరాదిత్యుడు ని అదుపుచేసే ప్రయత్నం కూడా ఇక సఫలం కాదు,ఈ జ్యోతిరాదిత్యుడు మంచిపని కోసం ఉపయోగిస్తే ఏ సమస్యా రాదు లేకుంటే నేనేమీ చేయలేను అని చేతులెత్తేసాడు సుధాముడు..
మరి అలాంటప్పుడు మీరు ఒక్కసారి వాడికి సర్ది చెప్తే సరిపోతుంది గా గురువర్యా?
లేదు కర్ణా,వాడు నా దగ్గర తస్కరించిన మాటే ఇంతవరకు నాకు చెప్పలేదు అంటే వాడి ఉద్దేశ్యం వేరేలా ఉంది అన్నది నాకు అవగతం అవుతోంది,ఇప్పుడు నేను చెప్పినా వాడు మాట వినడు అన్నది అక్షర సత్యం..మీరు ఈ పుస్తకంని యధావిధిగా అక్కడే పెట్టేయండి అంటూ ఏవో మాయలు ఆ పుస్తకం పైన ప్రయోగించి కర్ణుడి చేతికి ఇచ్చాడు..
కర్ణా,నక్షత్రా మీరు ఆ పుస్తకం ని అక్కడ చేర్చి వేగిరంగా నా దగ్గరకు రండి మీ ఇద్దరికీ ఒక ముఖ్యమైన విద్యని నేర్పిస్తాను అని ఆదేశించాడు..
సరే అని ఆ పుస్తకం ని అక్కడే పెట్టేసి సుధాముడు దగ్గరికి వచ్చారు ఇద్దరూ…
జాగ్రత్తగా మననం చేసుకోండి మీ ఇద్దరూ,ఈ విద్య మీ ఇద్దరినీ కాపాడుకునేందుకు ఉపయోగపడుతుంది ఆ జ్యోతిరాదిత్యుడు మాయలు మీ పైన పడకుండా..ఇదెందుకు చెప్తున్నాను అంటే మీ ఇద్దరి రాజ్యాలకి,వాడి రాజ్యంకి తరతరాల శత్రుత్వం ఉంది ఈ విద్య మీరు నేర్చుకోవడం సబబు అంటూ ఇద్దరికీ మంతాన్ని ఉపదేశించాడు సుధాముడు..
ఇద్దరూ ఒకటికి రెండుసార్లు ఆ మంత్రాన్ని గురువు ముందే ప్రయోగించి సఫలమయ్యారు..
సుధాముడు ఇద్దరినీ మెచ్చుకొని కళ్లనీళ్లతో,యువరాజులారా వాడి బారి నుండి మిమ్మల్ని రక్షించుకోవడానికి ఇదొక్క ఉపకారం మాత్రం చేయగలిగాను నేను నన్ను క్షమించండి పెద్ద పొరపాటు జరిగింది…ఇక ఈ గురువర్యులకి అంతం తప్పదు వాడి చేతిలో అని వెక్కివెక్కి ఏడవడం మొదలెట్టాడు..
గురువర్యా,మీ అంతం ఏంటి విచిత్రంగా?
అవును కర్ణా,ఈ విద్యలు తెలిసిన ఏకైక మనిషిని నేను..ఒకవేళ వాడు వినాశనం వైపు మొగ్గుచూపితే మొట్టమొదటగా చేసే పని నా అంతం చూడటమే..
మీ అంతమా?గురువర్యా ఈ మాట వినడానికే జుగుప్సగా ఉంది.పోనీ మాకు మీరు నేర్పిన విద్యతో వాడిని ఎదిరించి అంతం చేస్తాము గురువర్యా మీరు ఆదేశించండి..
పొరపాటు కర్ణా,ఈ విద్య మిమ్మల్ని కాపాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అంతేగానీ వాడిని అంతం చేసే శక్తి మాత్రం మీకు ఉండదు,ఈ విషయంలో మీరు తర్జనభర్జనలు పడి ఇబ్బంది పడకండి,మీరు నాకు ఒక సహాయం చేయగలరా
?
చెప్పండి గురువర్యా మా శాయశక్తులా ప్రయత్నిస్తాము…
తులసీ మన పుత్రుడు “సూర్యకీర్తి” ఎక్కడ ఉన్నాడో పిలువు ఒక్కసారి …తులసి లోపలికి వెళ్ళి సూర్యకీర్తి ని పిలుచుకొచ్చింది..
మా సూర్యకీర్తి మీకు తెలుసుగా యువరాజుల్లారా, వీడికీ మీకు నేర్పిన విద్యనే నేర్పాను..ఇంకనూ కొన్ని అదనపు విద్యలు వచ్చు..ఒక బ్రాహ్మణుడు అయిన నేను నా బిడ్డని ఒక క్షత్రియుడులా పెంచాను..వీడి బాగోగులు మీరే చూసుకోవాలి ఇది ఒక్కటి నాకు సహాయం చేయండి చాలు అని వినమ్రంగా వేడుకున్నాడు..
(సూర్యకీర్తి నే మన ప్రస్తుత కథలోని నాని)..
గురువర్యా ,ఇది మా కర్తవ్యం ఖచ్చితంగా చేస్తాము…ఎందుకైనా మంచిది మీరు ఒక్కసారి ఆదేశిస్తే ఆలస్యం చేయకుండా మన సూర్యకీర్తి ని మా రాజ్యపు సరిహద్దుల్లో దింపేసి వస్తాము అని అన్నాడు నక్షత్రుడు.
అలాగే యువరాజా,మీ పనిని వేగిరంగా చేయండి…సూర్యకీర్తి ఒక్కడే నా సంపద…సూర్యకీర్తి కి ఒక పుస్తకం ని ఇచ్చి సెలవు తీసుకున్నాడు సుధాముడు..
ముగ్గురూ గుర్రాలలో బయలుదేరి నక్షత్రుడి రాజ్యమైన రేనాటిచోళ సరిహద్దుల్లో కి ప్రవేశించారు..దట్టమైన అటవీ ప్రాంతంలోకి ప్రవేశించి కాసేపటి ప్రయాణం తర్వాత ఒక గూడెం ని చేరుకున్నారు..
ఏంటి నక్షత్రా,ఈ గూడెం కి తీసుకొచ్చావ్?మన రాజమందిరంలో అయితే ఇంకా రక్షణ ఎక్కువగా ఉంటుంది కదా?
నిజమే కర్ణా,కానీ తరతరాల నుండి మా రాజ్యాన్ని సంరక్షిస్తున్న వీరులు ఈ “యోధ” వంశం వాళ్ళు..ఇక్కడ అయితే మన సూర్యకీర్తి కి రక్షణతో పాటు యుద్ధవిద్యలూ అబ్బుతాయి ఇది గమనించు..