లవ్ పార్ట్ 1 511

తెల్లారే కాలేజీకి వెళ్ళాను చుట్టు చూసా మానస కనిపించలేదు అడుగుదామనుకున్నా కానీ ఆ టెక్కుమొహందానితో మనకెందుకులే అని సైలెంట్ గా కూర్చున్నా.

పూజ : అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది ఆ మానస వాళ్ళు లేకపోతే..

రమ్య : అవును రెండు రోజుల నుంచి వాళ్ళు క్లాసులకి రావట్లేదు ఏమైందో..

పూజ : రాకపోతేనే మంచిది లే..

అలా వారం గడిచింది మానస వాళ్ళ జాడ కనిపించలేదు, ఎందుకో రాగానే తనకోసం ఒక్క లుక్ వెయ్యడం అలవాటు అయ్యింది అందులో అమ్మ కంఫర్మ్ చేసి సర్టిఫై చేసింది కదా తను మంచిదని అందుకేనేమో అనుకున్నాను.

ఇవ్వాళ పొద్దు పొద్దున్నే లేచాను ఎందుకంటే ఈరోజు సలీమా బర్తడే, ప్రతి పుట్టిన రోజుకి పొద్దున్నే వచ్చి నాతొ విషెస్ చెప్పించుకుని, అమ్మ ఆశీర్వాదం తీసుకుంటుంది. తన కోసం రాత్రి అంతా కూర్చుని గిఫ్ట్ కూడా తయారు చేశాను.

ఇంకా రాలేదు ఈపాటికి రావాలే ఇంకా లేవలేదా ఏంటి అని చూస్తూ ఉన్నాను ఇంతలో పూజ రోప్పుతూ పరిగెత్తికుంటూ వచ్చింది.

పేపర్ చదువుతున్న నాన్న, వంటింట్లో నుంచి అమ్మ, నేను పూజ ఏం చెప్తుందా అని చూస్తున్నాం.

పూజ రోప్పుతూ “ఫాతిమా అమ్మ” అని ఏడ్చింది….

వెంటనే మేం ముగ్గురం లేచి సలీమా ఇంటికి బైలుదేరాం…….

ముగ్గురం హడావిడిగా సలీమా ఇంటికి వెళ్ళాం, అప్పటికే ఊరి జనం అంతా పొగయ్యారు ఇంటి లోపలికి వెళ్ళాం, ఫాతిమా అమ్మ ప్రశాంతంగా పడుకున్నట్టే ఉంది, పక్కనే కళ్లెమ్మటి నీళ్లతో కూర్చుని ఏదో ఆలోచిస్తున్న సలీమా నేను కనిపించగానే ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుంది.

అమ్మ కూడా కళ్లెమ్మటి నీళ్లతో సలీమా తల నిమిరింది, సలీమా తెరుకొని..

సలీమా : నిన్న కూడా బానే ఉంది అమ్మా చాలా సంతోషంగా ఉంది నిన్నంతా అమ్మ నాతోనే గడిపింది పడుకునేటప్పుడు కూడా తన దెగ్గరే పడుకోమంది బహుశా తనకీ తెలిసిందేమో… అని ఏడ్చింది.

సలీమా అలా ఏడుస్తుంటే చూడలేకపోయాను, ఫాతిమా అమ్మ దెగ్గరికి వెళ్ళాను నవ్వు మొహం తోనే చనిపోయింది కానీ కళ్ళు సగం తెరిచే ఉన్నాయి పాపం సలీమాకి ఇవన్నీ ఏం తెలుస్తాయి కళ్ళు ముయాలని.

ఫాతిమా అమ్మ కళ్ళు మూసి అలానే ఒక ఐదు నిముషాలు పట్టుకున్నాను ఆఖరికి అమ్మ కళ్ళు మూసుకున్నాయ్…

చందు గాడు వెళ్లి కార్యక్రమం నడిపించడానికి మా ఊరి రజాక్ ని ఇంకో ఇద్దరు పెద్ద వాళ్ళని తీసుకొచ్చాడు, ఫాతిమ అమ్మ పక్కన కూర్చుని సలీమా తలని నా గుండెలకి ఆనించుకుని కూర్చున్నాను, సలీమా నా షర్ట్ ని తడుపుతూనే ఉంది.

పక్కనే ఉన్న ఆడవాళ్లు అమ్మ సహాయంతొ ఫాతిమా అమ్మకి సుబ్బరంగా స్నానం చేపించి గంధం పూసి తెల్లటి వస్త్రంతొ చుట్టు కప్పేశారు, అమ్మ తలని కూడా బురఖా లాగ కట్టారు.

సలీమాని పక్కన కూర్చోబెట్టి ఫాతిమా అమ్మని ఎత్తుకుని ఇంటి ముందుకు వచ్చాను, అమ్మ కొత్త సాప పరిచింది దాని మీద పడుకోబెట్టాను ఒక ముసలాయన సాయిబు అత్తరు అడిగాడు, చందు పరిగెత్తుకుంటూ వచ్చి అత్తరు అందించాడు ఆ సాయిబు అత్తరు మొత్తం ఫాతిమా అమ్మ మీద చల్లి ఇంకొక తెల్ల వస్త్రం కప్పి బైటికి వెళ్ళాడు.

ఊర్లో అందరూ ఒక్కొక్కరుగా వచ్చి అమ్మని ఆఖరి చూపు చూసి వెళ్లిపోతున్నారు, లోపలికి వెళ్ళాను రమ్య, పూజ, భరత్ సలీమా పక్కన కూర్చున్నారు.