లవ్ పార్ట్ 1

పొద్దున్నే లేచాను అమ్మ నాకు తల స్నానం చేయించి రెడీ చేసింది, కొత్త బట్టలు వేసుకున్నాను అమ్మ నాన్న ఇద్దరు విష్ చేసారు వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని ఆనందం గా స్కూల్ కి బైలుదేరాను ఇవ్వాళ కేక్ కటింగ్ ఉంటుందని…

కానీ స్కూల్ కి వెళ్లే సరికి క్లాస్ మాములుగానే ఉంది డెకొరేషన్ ఏమి లేదు…. వెళ్లి బెంచ్ లో కూర్చున్నాను..

అందరు హ్యాపీ బర్త్ డే అని విషెస్ చెప్పారు… నిరాశగానే కూర్చున్నాను లంచ్ బెల్ లో అందరు నా ముందుకి వచ్చి…. అలిగావా? అన్నారు

విక్రమ్ : లేదు…

భరత్ : నువ్వే కదా ఏం చెయ్యొద్దు అన్నావ్…

విక్రమ్ : నేనేం అలగలేదు సంతోషంగానే ఉన్నాను… ఇవ్వాళ అమ్మ మనలనందరిని ఇంటికి రమ్మంది సాయంత్రం బిర్యానీ చేస్తుంది…

అందరు ఆనందంగా ఎగిరారు…. అందరం కింద కూర్చున్నాం తినడానికి…అందరు వాళ్ళ టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి…

ముందుగా రమ్య నా ముందుకి వచ్చి స్పూన్ తో తన బాక్స్ లో ఉన్న సేమ్యా ని నాకు తినిపించి హ్యాపీ బర్తడే అని చెప్పింది….

“వావ్ థాంక్స్ రమ్య” అని అన్నాను

రమ్య : నీకోసం నేనే చేశాను…

విక్రమ్ : నిజంగా చాలా బాగుంది రమ్య..

ఆ వెంటనే సలీమా వచ్చి తన బాక్స్ లో డబల్ కా మీఠా పెట్టింది….

పూజ అందరిని తోసుకుంటూ ముందుకి వచ్చి “జరగండి జరగండి” అంటూ తన బాక్స్ లో ఉన్న చికెన్ పెట్టింది…. ఉన్న అందరిలో పూజ నే అల్లరిది తనంటే మా అందరికి ఇష్టం…

అందరు అయిపోయాక అందరు కలిసి నా ముందుకి వచ్చి నా చేతిలో పార్కర్ పెన్ పెట్టి హ్యాపీ బర్తడే అని సప్రైస్ ఇచ్చారు…. ఆ పెన్ చూస్తూనే తెలుస్తుంది చాలా కాస్ట్లీ అని.

విక్రమ్ : ఇంత ఖరీదైన పెన్ నాకొద్దు….

పూజ, రమ్య ముందుకు వచ్చి తీసుకో విక్రమ్ నీకోసం మేము వంట మాత్రమే చేసాము కానీ చందు భరత్ వాళ్ళు పొలానికి వెళ్లి ఒక పూట అంతా పని చేసి నీకోసం ఆ పెన్ కొన్నారు.. కావాలంటే వాళ్ళ చేతులు చూడు….

చందు వాళ్ళ చేతులు చూసాను అర చేతిలో పొక్కులు ఉన్నాయ్….

రాజు : విక్రమ్ గిఫ్ట్ నచ్చిందా…. మా అందరికంటే నువ్వే బాగా చదువుతావ్ అందుకే ఆ పెన్ ఇచ్చాము…

నా కళ్లెమ్మట నీళ్లు వచ్చాయి గట్టిగా అందరిని హత్తుకుపోయాను…. సాయంత్రం ఇంటికి వెళ్ళాక అమ్మకి నాన్నకి చెప్పాను వాళ్ళు చాలా సంతోషించారు… నాన్న గర్వంగా చూస్తే అమ్మ నన్ను హత్తుకుని ముద్దు పెట్టుకుంది.