నేనేమీ మాట్లాడకుండా తల దించుకుని కూర్చున్నా…
మళ్ళీ తనే అంది…
“అసలు ఇది పెళ్లిలా ఉందానే…
ఒక్కరి ముఖంలో అన్నా సంతోషం ఉందా…
మొన్నటికి మొన్న నా పెళ్లి ఎలా జరిగింది..
ఇప్పుడు నీ పెళ్లి ఎలా జరుగుతుంది..
పెళ్లిచూపులు, ఎంగేజ్మెంట్ ఎలాగూ వద్దంటివి…
పెళ్ళైనా సరిగా అయిందా…
పెళ్లిపీటలమీద బొమ్మలా కూర్చుంటివి…
తాళి కట్టగానే పడిపోతివి…
అందరూ ఒకటే నసుగుతున్నారు… నీకిష్టం లేకున్నా బాగా ఉన్నవాళ్ళని చెప్పి బలవంతంగా పెళ్లిచేస్తున్నారని…
అమ్మా నాన్నలు సిగ్గుతో చచ్చిపోతున్నారు తెల్సా…”
నాకు అమ్మా నాన్నల్ని తల్చుకోగానే కళ్ళ వెంబడి నీళ్లు కారుతున్నాయి..
అక్కకి కనబడకుండా ఇంకో వైపు తిరిగి కూర్చున్నా..
“రవి వాళ్ళని కూడా అంటున్నారే జనం…
లోకుల నోటికి అద్దు అదుపు ఉంటుందా చెప్పు…
చిన్న సందు దొరికితే చాలు వాళ్ళకి.. ఇతరులని ఆడి పోసుకోడానికి…
ఇంకా వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి
అవేమీ పట్టించుకోలేదు…
ఇంకొకళ్ళు అయితే ఎంత గొడవ చేసే వాళ్ళో…
నువ్ అలా పడి పోగానే రవి ఎంత కంగారు పడిపోయాడో తెల్సా…
వాళ్ళమ్మ అయితే ఇంకా ఎక్కువ కంగారుపడింది…
మేము కూడా అంత కంగారు పల్లేదనుకుంటా…
రాజుని పురామయించి వెంటనే డాక్టర్ని పిలిపించింది…
నిన్ను ఈ రూమ్ కి మార్పించి డాక్టర్ వచ్చేంత వరకు నీ పక్కనే కూర్చుంది…
ఆవిడ చేసిన హడావిడి చూస్తే ఆమెనే మన అమ్మ అనుకుంటారు తెలియని వాళ్ళు…
అటువంటి వాళ్ళను బాధ పెట్టడం ఏమన్నా బాగుంటుందా చెప్పు.
నా మాట విను అక్షరా… నీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పు…”
“ప్రాబ్లమ్ ఏమీ లేదక్కా ” అన్నాను కళ్ళు తుడుచుకుంటూ…
.
అక్క ఇంకా ఏదో అనబోయేంతలో అమ్మ వచ్చింది “లేచావా …. ఎలా ఉంది ఇప్పుడు” అంటూ…
“బాగానే ఉందమ్మా ” అన్నాన్నేను…
” సరే అయితే పదండి డిన్నర్ చేద్దాం… అక్కడ అత్తయ్య వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ” అంటూ వెళ్ళింది…
నేను లేచి మొహం కడుక్కుని అక్కతో పాటు వెళ్ళేసరికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు….
రవికి బావకి మధ్య రెండు కుర్చీలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి…
అక్క వెళ్లి బావ పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది…
నేను అక్కకి రవికి మధ్యలో మిగిలిన కుర్చీలో కూర్చున్నా…
రవి నా వైపే చూస్తున్నాడు… నేను ఎటూ చూడకుండా తల దించుకొని కూర్చున్నా..
“ఇప్పుడెలా ఉందమ్మా ” అని అడిగింది అత్తయ్య…
“బాగానే ఉందండి” అన్నాన్నేను…
తర్వాత మిగతా వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ తిన్నారు… నేను, రవి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు…
నేను కాస్త తొందరగానే తిని అందరికన్నా ముందే అక్కడ్నుంచి వచ్చేసాను…
పడుకుందామనుకున్నా కానీ నిద్ర రాలేదు…
ఒక అరగంట తర్వాత అక్క మళ్లీ నా గదికి వచ్చింది “పడుకున్నవా” అంటూ…
“లేదక్కా.. నిద్ర రావట్లేదు” అంటూ లేచి కూర్చున్నా…
“మధ్యాహ్నమంతా పడుకున్నావు ఇంకేం నిద్రొస్తుంది.. అదీ మంచిదేలే” అంది…
“ఎందుకు ” అని అడిగా నేను…
“చెప్తా గానీ లేచి వెళ్లి స్నానం చేసిరా పో..” అంది..
“ఇప్పుడు స్నానం ఎందుకక్కా” అన్నాను ఆశ్చర్యంగా..
అప్పుడు టైం చూస్తే 11 దాటింది…
” రాత్రి ఒంటిగంటకు ముహూర్తం ఉందట… తర్వాత ఆర్నెళ్ల వరకు మంచి రోజులు లేవట” అంది..
“ఇప్పుడు దేనికి ముహూర్తం ” అని అడిగా…
“అబ్బా నీకు అన్నీ విప్పి చెప్పాలే.. పెళ్లయ్యాక ఇంక దేనికి చూస్తారు ముహూర్తం… మీ ఫస్ట్ నైట్ కి” అంది…
నాకు మళ్లీ షాక్..నేను ఇది ఊహించలేదు…
సాధారణంగా ఉంటుందని తెలిసినా… ఇప్పుడు expect చేయలేదు…
నాకు నోటి వెంబడి మాటలు రావట్లేదు…. “ఇప్పుడు అదేమీ వద్దక్కా” అన్నాను ఎలాగోలా…
అక్క నా వైపు చురుగ్గా చూసింది…
“చూడు అక్షరా… ఇప్పటివరకు నువు చెప్పిందంతా విన్నాము… ఈ ఒక్క సారి మా మాట నువ్ విను…
ముహూర్తం కుదరట్లేదనే ఈ రోజు పెట్టడం…
ముహూర్తం లేకుండా ఇలాంటివి చేస్తారా ఎవరైనా.. పెళ్లయిన ఆర్నెల్ల వరకు మిమ్మల్ని దూరం ఉంచడం కూడా కరెక్ట్ కాదు…
అందుకే ఈ రోజే అని ఫిక్స్ చేశారు…
నీ ఆరోగ్యం సరిగా లేదని మాక్కూడా తెలుసు.. రవి కూడా వద్దన్నాడు.. కానీ మీ అత్తయ్య గారు చెప్తే సరే అన్నాడు…
నువ్ కూడా మా మాట విను..
నీకు ఇందాక కూడా చెప్పాను… మొండిగా ఉండకు… అమ్మా నాన్నల్ని బాధ పెట్టకు” అంది…
నేను మాట్లాడబోయేంతలో అక్కే మళ్లీ అంది…
“నువ్వింకేం చెప్పకే… మేము ఇంతసేపు అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం…
నువ్వా ఈ మధ్య రోజు మూడీగా ఉంటున్నావ్…
రేపు వాళ్ళింటికి వెళ్ళాక కూడా అలాగే ఉంటే బాగుండదు…
రవితో నువ్ దగ్గరవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని మా ఆలోచన …
నువ్వింకేం మాట్లాడకుండా వెళ్లి స్నానం చేసి రా..
నేను మళ్ళీ వస్తా” అంటూ బయటకు వెళ్ళిపోయింది…