“అక్షరా….” అనే అమ్మ పిలుపుతో పాటు తలుపు కొట్టిన శబ్దం వినబడింది…
ఉలిక్కిపడి లేచిన నేను తలుపు వైపు వెళ్లబోతు ఒంటి మీద బట్టలు లేవని గుర్తొచ్చి కప్ బోర్డులో చేతికందిన నైటీ ఒకటి తీసుకుని వేసుకున్నా.. బెడ్ మీద ఉన్న నా బట్టలన్నీ తీసి బాత్రూమ్ లో పడేసాను…
డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి కళ్ళు తుడుచుకుని జుట్టు సవరించుకున్నా…
ఈ లోపు అమ్మ మరో మూడు, నాలుగు సార్లు అక్షరా అక్షరా అని పిలిచింది…
అప్పుడప్పుడు డోర్ మీద కొడుతోంది…
ఇంకో సారి అమ్మ పిలుస్తుండగా “వస్తున్నా అమ్మా” అంటూ వెళ్లి తలుపు తీసాను…
“ఏంటే ఇంత మొద్దు నిద్రా… టైమెంతయిందో తెల్సా.. 7 దాటింది….
అవును ఆ కళ్ళెంటే అంత ఎర్రగా అయ్యాయి” అంది అమ్మ…
“ఏం లేదమ్మా రాత్రి సరిగా నిద్ర రాలేదు” అని తల దించుకున్నా…
“సరే సరే ఫ్రెష్ అయి రా టిఫిన్ చేద్దువ్ గానీ” అంటూ అమ్మ వెళ్లి పోయింది…
నేను మళ్ళీ వెనక్కి వచ్చి బెడ్ మీద కూర్చున్నాను…
మళ్లీ ఆలోచనలు మొదలయ్యాయి…..
చాలా సేపు ఆలోచించాక నేనొక నిర్ణయానికి వచ్చా…
జరిగింది ఎవరికీ చెప్పొద్దని…
ఎవరికైనా చెప్పడం వల్ల అందరూ బాధ పడడం తప్పిస్తే వచ్చే లాభం ఏమీ కనబడలేదు…
అలా అనుకున్నాక వెంటనే లేచాను..
బెడ్ షీట్ తీసి వేరేది వేసాను..
బాత్రూం లోకి వెళ్లి తలారా స్నానం చేసి వేరే బట్టలు వేసుకొని హాల్లోకి వెళ్ళాను…
బంధువులు కొందరు పలకరిస్తుంటే జవాబుగా చిన్న నవ్వు నవ్వాను కానీ ఎవరితోనూ మాట్లాడలేదు…
నా నవ్వులో సహజత్వం లేదని నాకూ తెలుస్తూనే ఉంది.. కానీ అంతకన్నా నా వల్ల కాలేదు..
ఎవరైనా ఏదైనా అడిగితే పొడి పొడిగా సమాధానo ఇచ్చా..
వాళ్ల అందరిలోనూ ఆశ్చర్యం నాకు తెలుస్తూనే ఉంది..
అమ్మ ఒకటికి రెండు సార్లు ఏమైందే అని అడిగింది కూడా..
ఏం లేదమ్మా కాస్త నలతగా ఉందని చెప్పి తప్పించుకున్నాను..
ఆరోజు సాయంత్రం అక్క వాళ్ళ రిసెప్షన్ జరిగింది…
అక్కడ నేను ఉన్నానన్న మాటే గానీ… నాలో నేను లేను..
బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్ ..
బంధువులు, ఫ్రెండ్స్ అందరూ పలకరిస్తుంటే జీవం లేని నవ్వే సమాధానం అయ్యింది…
ఎంతగా నార్మల్ గా ఉందామన్నా నా వల్ల కావట్లేదు…
గత రాత్రి కి సంబంధించిన ఆలోచనలు క్షణం కూడా నన్ను వదలట్లేదు….
రిసెప్షన్ పూర్తయింది…
నెక్స్ట్ డే అక్కా వాళ్ళు మా ఇంటికి వచ్చారు….
అక్కకి నాకు ఏడాది మాత్రమే తేడా…
ఇద్దరం అక్కచెల్లెల్లాగా కన్నా ఫ్రెండ్స్ గానే ఉండేవాళ్ళం…
ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుకునే వాళ్ళం..
కానీ ఆ రోజు నేను ఏమీ మాట్లాడలేదు…
ఇంకా కొందరు బంధువులు ఉండడం… అక్క బావతో ఎక్కువ సేపు ఉండాల్సి రావడంతో అక్కకి నాతో మాట్లాడే సమయం దొరకలేదనుకుంటా…
మరుసటి రోజు వాళ్ళు బావ వాళ్ళింటికి వెళ్లే ముందు నన్ను వేరే రూమ్ కి తీసుకెళ్లి అడిగింది…
“ఏమైందే ఎందుకలా డల్ గా ఉన్నావ్” అని…
ఒక్కసారిగా అక్కను పట్టుకొని ఏడ్చేశాను నేను…
అక్క కాసేపు ఏడ్వనిచ్చి ఊరుకోమంటూ నన్ను మెల్లిగా విడిపించుకొంది…
నేను ఇక ఆగలేక చెప్పేద్దామనుకుంటుండగా…
అక్క..”పిచ్చిదానా నేను వెళ్లిపోతున్నానని ఇంతలా దిగులు పడాలా… అయినా నేనేమైనా దూరంగా వెళ్తున్నానా… పట్టుమని పది కిలోమీటర్లు ఉండదు…
కావాల్సినపుడల్లా మనం కలుసుకోవచ్చు..
బావ వాళ్ళు కూడా కొత్త వాళ్ళేం కాదు కదే ..
అయినా నేను ఏడవ వలసింది నువ్ ఏడుస్తున్నావ్.. విచిత్రంగా లేదూ”
అంటూ కంటిన్యుయస్ గా మాట్లాడుతూ నన్ను ఊరడిస్తుంటే…
గొంతువరకు వచ్చిన నా మాటలు అక్కడే ఆగిపోయాయి..
తొందరపడి అక్కకి చెప్పేద్దామనుకున్న నేను తమాయించుకున్నాను…
ఎవరికీ చెప్పొద్దని నాకు నేను గట్టిగా చెప్పుకున్నాను..
అక్క వెళ్ళిపోయింది..
ఎవరికీ ఏమి చెప్పలేదు కానీ నేను మునపట్లా ఉండలేకపోయాను…
మనసులో ఏదో తెలియని అశాంతి నెలకొంది..
ఎప్పుడూ ఏదో ఆలోచన..
ఎక్కువ సేపు నా గదిలోనే ఒంటరిగా గడపడం…
ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకపోవడం …
అమ్మ చాలా సార్లు అడిగింది…. బతిమాలింది.. ఏమీ చెప్పకపోయేసరికి తిట్టింది..
విసుగొచ్చి వదిలేసింది…
నాన్న కూడా ప్రయత్నం చేశాడు…
కానీ నాలో మార్పు రాలేదు..
నిజానికి నాకు నేనే చాలా చెప్పుకున్నాను..
అలా ఉండకూడదని…
కానీ నా వల్ల కావట్లేదు..
ఎంత ప్రయత్నించినా మామూలుగా ఉండలేక పోతున్నా…
ఏ పనీ చేయబుద్ది కావట్లేదు..
దేని మీదా ఉత్సాహం ఉండట్లేదు..
సుమారు నెల రోజుల పైనే గడిచింది…
ఒక రోజు అమ్మా నాన్న అక్క వాళ్ళింటికి వెళ్తున్నారు..
ఏదో వ్రతం ఉందని అక్క వాళ్ళ అత్తయ్య పిలిచిందట..
నన్ను రమ్మంటే నేను రానని చెప్పి వెళ్ళలేదు..
అక్క నిన్ను తప్పక రమ్మంది అని వాళ్ళు బతిమాలినా నేను వెళ్ళలేదు..
సరే జాగర్త చెప్పి అని వాళ్లే వెళ్లిపోయారు..
ఒక రోజని చెప్పి వెళ్లిన వాళ్ళు మూడు రోజుల తర్వాత వచ్చారు…
అమ్మానాన్నలతో పాటు అక్క కూడా వచ్చింది…
ఆ రోజు రాత్రి డిన్నర్ చేసాక అక్క నా రూమ్ కి వచ్చింది…
నేను ఆలోచనలనుండి తప్పించుకోడానికి ఏదో పుస్తకం చదువుకుంటున్నాను..
“అక్షరా నీతో ఒక ముఖ్యమైన విషయం డిస్కస్ చేయాలి.. ఇక్కడికి ఈరోజు అందుకే వచ్చాను నేను ” అంది మంచం మీద నా పక్కన కూర్చుంటూ…
నేను డల్ గా ఉంటున్న విషయమే అయ్యుంటుందని… తొందరపడకూడదని… ఏమీ చెప్పకూడదనీ… నేను మనసులో గట్టిగా అనుకున్నాను..
ఏంటో చెప్పమన్నట్టు పుస్తకం మూసి అక్క వైపు చూసాను…
అక్క నా చేయి మీద చేయి వేసి…
“మీ బావ నీకో మంచి సంబంధం చూశాడే… అబ్బాయి చాలా బాగున్నాడు” అంది..
షాక్ కొట్టినట్టు అక్క వైపు చూసాను..