నా కథ 2 361

“నువు షాక్ అవుతావని తెల్సు .. కానీ ఇది నిజం…
నేను చెప్పేది పూర్తిగా విను.. తర్వాత ఆలోచించి నీ నిర్ణయం చెప్పు ” అంది..
నేను ఆశ్చర్యంగా అక్కనే చూస్తున్నా..
ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు..
అక్క తిరిగి చెప్పసాగింది..
“ఆ అబ్బాయి మీ బావకి క్లోస్ ఫ్రెండ్ అట…
అంతే కాదు అతని ఆఫిసులోనే మీ బావ జాబ్ చేసేది… కలిసి చదువుకున్నారట.. అందుకే తన ఆఫిసులోనే బావకు మంచి జాబ్ ఇచ్చాడట… మొన్నొక రోజు బావ పిలిస్తే అతను, వాళ్ళ అమ్మ డిన్నర్ కి మా ఇంటికి వచ్చారు… కాసేపు అవి ఇవి మాట్లాడుకున్నాక అత్తయ్య మా పెళ్లి ఆల్బమ్ వాళ్ళకి చూపించింది…
అందులో నీ ఫోటో చూసిన అబ్బాయికి నువు బాగా నచ్చావట… వాళ్ళమ్మకి చూపించాడు..
ఆమెకీ నువ్ నచ్చావట..
పెళ్లి వీడియోలో కూడా నిన్ను చూసారు…
అతనికి, వాళ్ళమ్మకి నువ్వు బాగా నచ్చేసావ్..
చాలా రోజుల్నించి వాళ్ళమ్మ బతిమాలుతున్నా ఆ అబ్బాయి ఇప్పుడే పెళ్లి చేసుకోను అనేవాడట…
ఇప్పుడు నిన్ను ఇష్టపడే సరికి ఆమె ఇంకో ఆలోచన చేయకుండా నన్ను బావని అడిగింది…
ఎలాగూ ఇంకో రెండు రోజుల్లో అమ్మా వాళ్ళు వ్రతం కోసం వస్తారు కనుక అప్పుడు మాట్లాడి చెప్తామని చెప్పాము వాళ్ళకి..
వ్రతానికి నువ్వు కూడా వస్తావనుకుంటే నువ్వేమో రాలేదు…
వ్రతం అయ్యాక మీ బావ నాన్నతో విషయం చెప్పాడు..
అబ్బాయి చాలా మంచోడట..
ఎటువంటి చెడు అలవాట్లు లేవట… బాగా ఆస్తిపరులట..
వాళ్ళ నాన్నగారు లేరు..
ఇతను వాళ్ళ నాన్న గారి బిజినెస్ చూస్తున్నాడట…
ఒక్కడే కొడుకు…
ఇలా అతని గురించి చాలా చెప్పాడు మీ బావ…
అమ్మా నాన్న బాగా ఇంప్రెస్ అయ్యారు…
కానీ నాన్న “పెద్దమ్మాయి పెళ్ళైన నెలకే చిన్నమ్మాయి పెళ్లి చేయడం నా వల్ల అవుతుందా బాబు..” అనేసరికి..
బావ “అవన్నీ తర్వాత ఆలోచిద్దాం లెండి.. ” అన్నాడు…
ఈ రోజు మార్నింగ్ నన్ను, అమ్మను, నాన్నను ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు మీ బావ…
ఆ ఇల్లు ఎంత బాగుందో తెల్సా…
ఇంద్ర భవనం అంటే నమ్ము..
వాళ్ళకి మనం అసలు సరితూగం తెల్సా…
నువ్వా ఇంటికి కోడలివి అయితే నిజంగా అది నీ అదృష్టమే అక్షరా..
వాళ్ళ మర్యాద అదీ చూస్తే నువ్ వాళ్ళకి ఎంత నచ్చావో అర్థం అయింది..
ఏ ముఖ్యమంత్రి కుటుంబమో ఇంటికి వచ్చిందన్నట్టు చూసారు…
ఆ అబ్బాయి కూడా చాలా బాగా మాట్లాడాడు…
చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడే…
మీరిద్దరూ సూపర్ జోడి అవుతారు..
వాళ్ళమ్మ కూడా చాలా మంచిగా మాట్లాడింది..
నాన్నకున్న సందేహాన్ని బావ చెప్తే ఆమె..
“చూడండి అన్నయ్య గారు.. మాకు మీ అమ్మాయి నచ్చింది…
కట్నాలు కానుకలు మాకేమీ వద్దు…
మీకు మా సంబంధం నచ్చితే చెప్పండి..
ఒక మంచి రోజు చూసుకుని పెళ్లి చూపులకి వస్తాం..
అమ్మాయిని చూడడానికి కాదు…
మా అబ్బాయిని కూడా మీ అమ్మాయి చూడాలి కదా..
మీ అమ్మాయి కూడా మా వాన్ని చూసి ఓకే అంటే పెళ్ళిఖర్చులతో సహా అన్నీ మా బాధ్యతే…
మీరా విషయంలో ఏమీ దిగులు పడవద్దు ” అంది ఆవిడ….”
అని చెప్పి ఊపిరి తీసుకోడానిక్ అన్నట్టు ఆపింది అక్క…
నేనేమీ మాట్లాడలేదు…
ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు…
అక్క చెప్పింది అంతా అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నాను..
కాసేపు ఆగి అక్కే మళ్లీ అంది..
” అక్షరా…నాకు, అమ్మకు, నాన్నకు ఆ అబ్బాయి, వాళ్ళ అమ్మ బాగా నచ్చారే…
మీ బావ మాటల్లో చెప్పాలంటే మనకి ఇంతకన్నా మంచి సంబంధం ఎప్పటికీ దొరకకపోవచ్చు …
అందుకే నాన్న కూడా పెళ్లి ఖర్చులకు కాస్త ఇబ్బందైనా ఒప్పుకుందామనుకుంటున్నాడు…
కావలసిందల్లా నీ అభిప్రాయం మాత్రమే..
నువ్ ఈ మధ్య ఎవరితోనూ సరిగా మాట్లాడట్లేదటగా..
అందుకే నీకు చెప్పడంకోసమే అమ్మ నన్ను రమ్మంది..
నీ ఇష్టం లేకుండా మాత్రం ముందుకు వెళ్లకూడదని నేను గట్టిగా చెప్పాను నాన్నతో..
ఇదిగో ఈ కవర్లో ఆ అబ్బాయి ఫోటో ఉంది…
చూసి ఆలోచించి నీ అభిప్రాయం చెప్పు..
నీకు ఒకే అయితే వాళ్ళని పెళ్ళిచూపులకి రమ్మందాం..
పెళ్లి చూపుల్లో ఆ అబ్బాయి నీకు నచ్చితే అప్పుడు మిగతా విషయాలు మాట్లాడకుందాం.. సరేనా గుడ్ నైట్ ” అంటూ తన చేతిలోని కవర్ నా పుస్తకంలో పెట్టి వెళ్ళిపోయింది అక్క..

అక్క వెళ్ళాక ఏం చేయాలో తెలియక చాలా సేపు అలాగే కూర్చుండి పోయాను…
మనసంతా బ్లాంక్ గా అయిపోయింది…