అక్క చెప్పిన విషయం నేను ఇంకా అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేస్తున్నాను…
ఇది నేను ఏ మాత్రమూ ఊహించని పరిణామం…
అక్క పెళ్ళైన నెలరోజుల్లో నా పెళ్ళికి సంబంధించిన ప్రస్తావన వస్తే మామూలు పరిస్థితుల్లోనే నమ్మడం కష్టం..
అలాంటిది ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో నా దగ్గరకు ఇలా పెళ్లి ప్రస్తావన రావడం నా మనసు జీర్ణం చేసుకోలేకపోతుంది…
నాకు అక్క పెళ్లి నాటి రాత్రి సంఘటన గుర్తొచ్చింది…
రవి చేతిలో మలైనమై(?) పోయిన నేను అందరూ ‘చాలా మంచివాడు’ అంటున్న వ్యక్తికి భార్యగా వెళ్లడం సరైనదేనా…?
ఇది అతనికి ద్రోహం చేయడం కాదా…?
జీవితాంతం అతన్ని మోసం చేస్తూ బతకాలా?
పోనీ అతనికి నిజం చెప్తే అర్థం చేసుకుని అంగీకరిస్తాడా…? వదిలేస్తాడా..?
అప్పుడు నా పరిస్థితి ఏమిటి?
ఇలా రకరకాల ప్రశ్నలు …
మరో వైపు..
జరిగిన దాంట్లో నా తప్పేమైనా ఉందా?
నా ప్రమేయం లేకుండా జరిగిన దానికి నేనెలా బాధ్యురాలిని అవుతాను?
నా తప్పేమీ లేనప్పుడు ద్రోహం చేసినట్టెలా అవుతుంది…
అయినా ఇతగాడేమైనా సత్పురుషుడా…
ఫొటోలో, వీడియోలో చూసి నచ్చానని ఏకంగా పెళ్లి వరకు వెళ్ళిపోయాడు…
నా అభిప్రాయం ఏమైనా పట్టించుకున్నాడా…
నా ఇష్టం తెలుసుకోకుండానే పెళ్లి తప్పనిసరి అనే స్టేజి కి పరిస్థితులను తీసుకొచ్చాడు…
మాట వరసకి నా అభిప్రాయం అడుగుతున్నారు గానీ అక్క చెప్పినదాన్ని బట్టి చూస్తే ఈ పెళ్లి తప్పక జరిగేలాగే ఉంది..
రవి నా ఇష్టం లేకుండానే బలవంతంగా నా శరీరంతో ఆడుకున్నాడు…
ఇతడు ఇప్పుడు పెళ్లి పేరుతో దర్జాగా అదే పని చేద్దామనుకుంటున్నాడు…
ఇద్దరి మధ్యా పెద్ద తేడా ఉన్నట్టు అనిపించట్లేదు నాకు..
ఆ మాటకొస్తే మగాళ్లేవరికీ ఆడవాళ్ళ అభిప్రాయాలతో పనిలేదేమో అనిపించింది..
లేకపోతే నాన్న గానీ, బావ గానీ నా ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండానే విషయం ఇంతవరకు తీసుకొస్తారా అనిపించింది .
చేతిలోని పుస్తకం నుండి ఫోటో ఉన్న కవర్ అంచులు బయటకు కనబడుతున్నాయి…
నాకు దాన్ని తీయాలని గానీ, ఫోటో చూడాలని గానీ అనిపించలేదు…
పుస్తకంతో సహా దాన్ని పక్కన పడేసి పడుకుండి పోయాను…
అటు కాసేపు, ఇటు కాసేపు ఆలోచనలతో తెలియకుండానే నిద్రపోయాను…
మర్నాడు పొద్దున పూట అమ్మా, నాన్నా, అక్కా, నేను అందరం టిఫిన్ చేస్తున్నాం…
నేను ఏమీ మాట్లాడకుండా తింటున్నాను…
అమ్మ అక్కకు సైగ చేయడం తెలుస్తూనే ఉంది నాకు..
కాసేపటికి అక్క అడిగింది…
“అక్షరా ఫోటో చూసావా, అబ్బాయి నచ్చాడా” అని..
నేను అవును అన్నట్టు తలూపాను..
“మరి వాళ్ళని రమ్మందామా” అని అడిగింది అక్క..
“దేనికి” అన్నాను నేను..
“చెప్పా కదే పెళ్లి చూపులకి”
“ముందే నన్ను చూసి వాళ్లకు నేను నచ్చానని చెప్పావ్ కదా… మళ్లీ పెళ్లి చూపులెందుకు”
“నువు చూడవా”
“మీరు చూసారు కదా… మీ అందరికీ నచ్చినవాడు నాకు నచ్చకుండా ఉంటాడా”
“అది కాదే. ఏదో ఫార్మాలిటీ కైనా పెళ్లిచూపులు ఉండాలి కదా”
“నాకవన్నీ ఇష్టం లేదక్కా… ఆల్రెడీ వాళ్ళకి నేను , మీకు అతడు నచ్చడం జరిగింది… ఇంక పెళ్లిచూపులు ఎందుకు”
“ఏంటే నీకా అబ్బాయి నచ్చలేదా”
“నచ్చకపోవడం కాదక్కా… నువ్వే చెప్పావు కదా.. నేను ఓకే అంటే చాలు పెళ్లి అయిపోయినట్టే అని..
ఇప్పుడు నేను సరే అంటున్నా కదా… ఇంకా ఈ తతంగం అంతా అవసరమా…
అసలు నాకు మొదట్నుంచీ పెళ్ళిచూపుల తతంగం అంటే చాలా కోపం .. వాళ్ళెవరో వస్తారని పొద్దున్నించి రెడీ అయి కూచోవడం.. కాఫీలు టిఫిన్లు ఇవ్వడం..
అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ వినయంగా జవాబులివ్వడం…
ఇదంతా ఒక పెద్ద ప్రహసనం… చిరాకు వ్యవహారం..
నా అదృష్టానికి ఇప్పుడు వీళ్ళు ఇదంతా ఏమీ లేకుండానే ఓకే చెప్పారు..
ఐ యాం వెరీ హ్యాపీ నౌ..
పెళ్ళిచూపులే కాదు ఎంగేజ్మెంట్ కూడా ఏమీ వద్దు…డైరెక్టుగా పెళ్లి పెట్టేయండి..
నా పెళ్ళికి సంబంధించి ఇదొక్కటే నా కోరిక..
ప్లీస్ అక్కా కాదనకండి”
అని చెప్పేసి నా గదిలోకి వెళ్ళిపోయాను…
నేను చాలా రోజుల్నుండి ముభావంగా ఉండడం వల్లనో ఏమో.. అమ్మగానీ, నాన్నగానీ ఏమీ మాట్లాడలేదు…