నా కథ 6 268

ఈ మాటలు నేను అంటున్న సమయంలో బయట నుండి అక్షరా… అక్షరా అంటూ రాజు పిలిచాడు… నేను లేచి బయటకు వెళ్తుంటే “అక్షరా…. నేను చెప్పింది చేస్తానని…. నా మీద ఒట్టేసావు… మర్చిపోకు… నా మీద ఒట్టు అంటే అర్థం నీకు తెలుసనుకుంటా…” అన్నాడు రవి… నేను ఈ లోపు డోర్ వరకు వెళ్ళిపోయాను… రవి మాటలు విని వెనక్కు తిరిగి చూసాను… రవి నన్నే చూస్తున్నాడు.. ఇంతలో నువ్ ఇక్కడున్నావా అంటూ రాజు ఆ గది వద్దకు వచ్చాడు…

“రాజూ ఒకసారి లోపలికి వస్తావా నీతో మాట్లాడాలి” అంటూ రవి పిలిస్తే రాజు లోపలికి వెళ్లి చెప్పరా అంటూ రవి పక్కన కూర్చున్నాడు…

“నువ్ నాకో సహాయం చేస్తావా..” అడిగాడు రవి..

“చెప్పరా… ఏం చెయ్యమంటావ్ …” అన్నాడు రాజు నవ్వుతూ…

“ఏం చెప్పినా చేస్తావా…”

“హా తప్పకుండా.. నీకేమైనా డౌటా..”

“ఏం చెప్పినా చేస్తానని ఒట్టెయ్యు ….” అన్నాడు రవి …

“అదేంట్రా కొత్తగా ఒట్టేయమంటున్నావ్ … నమ్మకం లేదా నా మీద… సరే ఒట్టు .. నువ్వేం చేయమన్నా చేస్తాను సరేనా…” అంటూ రవి చేతిలో చెయ్యి వేసాడు రాజు….

నాకు ఇంక అక్కడ ఉండాలని అనిపించలేదు… నిశ్శబ్దంగా అక్కడినుండి బయటకు నడిచాను … నేను వెళ్తుంటే “ఇలా కాదు నా మీద ఒట్టేసి చెప్పు” అని రవి అంటుండడం నాకు వినబడింది… ఇంకా వినడం నా వల్ల కాలేదు… అందుకని వడివడిగా కిచెన్ లోకి వెళ్ళిపోయాను…

నాకు ఏం చేయాలో అర్థం కాలేదు … “ నా మీద ఓట్ట్టేశావ్… దానర్థం తెలుసనుకుంటా” అనే మాటలు ఇంకా నాకు వినబడుతున్నాయి… అవి మాత్రమే కాదు అప్పటి వరకు రవి చెప్పిన మాటలు అన్నీ చెవుల్లో మోతలా మళ్ళీ మళ్ళీ వినబడుతూనే ఉన్నాయి… ఏం చేయాలో తెలియట్లేదు … రవి చేప్పినట్టు చేయడం నా వల్ల కాదు అని మాత్రం తెలుస్తుంది… అలాగే నిలబడి ఆలోచిస్తున్నాను… ఒక అరగంట తర్వాత రాజు ఆ గది నుండి విసురుగా బయటకు వచ్చాడు… నా వైపు ఒక రకంగా చూసాడు… అతని ముఖంలో ఉన్నది కోపమా, బాధా అనేది నాకు తెలియలేదు … రాజు కళ్ళలోకి చూడలేక నేను తల దించుకున్నాను… రాజు అంతే విసురుగా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు ….

ఆ రోజు నేను అన్నం ముట్టలేదు… రాజు బయటకు వెళ్లిపోయిన తర్వాత కూడా చాలా సేపు కిచెన్ లోనే అలాగే నిలబడి పోయాను… కాళ్ళు లాగుతుంటే హాల్ లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాను… ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు నాకు…. రవి చెప్పిన మాటలు చెవుల్లో రిపీటెడ్ గా మారుమోగుతున్నాయి… కానీ ఆ మాటలు నాకు జీర్ణం అవ్వట్లేదు… రెండు మూడు రోజులు నేను రవితో మాట్లాడలేదు… రాజు అయితే ఇంటికే రాలేదు… రవి ఉన్నపుడు మా బెడ్ రూమ్ వైపు నేను అసలు వెళ్లనే లేదు.. ఒక వేళ రవి హాల్ లోకి వస్తే నేను కిచెన్ లోకి వెళ్లి పోయేదాన్ని…
వండినవన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టేదాన్ని… రవి తానే వడ్డించుకుని తిని వెళ్ళేవాడు…
నన్ను మాట్లాడించే ప్రయత్నం చేసినా నేను పలకలేదు… నాకు ఎందుకో మాట్లాడాలని అనిపించలేదు….
నాకు ఎంతసేపూ ఒకటే ఆలోచన… ‘ఎందుకు రవి ఇలా విపరీతంగా ఆలోచించాడు’ అని… నేనూ రాజు పెళ్లి చేసుకోవడం ఏంటి… దానికోసం రవి చెప్పిన కారణాలేవీ ఏవీ నాకు సరైనవి గా అనిపించడం లేదు…
రాజుతో పెళ్లి అనే ఆలోచనే నాకు ఎలాగో ఉంది… రవికి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది…
రవికి మగతనం పోవడం వల్ల నేను రాజుని పెళ్లి చేసుకోవడం ఎంతవరకు సబబో నాకు తెలియట్లేదు…
నేనెప్పుడూ రవికి మగతనం పోయిందని బాధ పడినట్టుగా కూడా రవి దగ్గర ప్రవర్తించలేదు… మరి రవి ఎందుకు ఇలా చేస్తున్నాడు…
ఎంత ఆలోచించినా నేను ఏమీ తేల్చలేక పోయాను…

ఈ విషయంలో రాజు మనసులో ఏముంది అనేది నాకు ఇంకో అంతుబట్టని విషయం… రవి దగ్గరనుండి బయటకు వచ్చినప్పుడు మాత్రం రాజు ముఖం కోపంగా కనబడింది… ఆ కోపం ఎవరి మీద… రవి మీదనా… లేక నా మీదనా… కొంపదీసి నేనే ఈ ప్రతిపాదన తెచ్చాను అని రాజు అనుకోవట్లేదు కదా… రవికి మగతనం పోయినందువల్ల నేను తనని కోరుకుంటున్నాను అనుకుంటున్నాడా… అందుకే అంత కోపంగా చూసాడా నా వైపు… అలా అనుకుంటేనే సిగ్గుతో చచ్చిపోవాలని అనిపిస్తుంది నాకు… ఈ ఆలోచన నాది కాదు అని చెబుదామన్నా రాజు ఇంటికి రావట్లేదు… ఏమాయ్యాడో తెలియదు… ఫోన్ చెయ్యడానికి కూడా నాకు చేతనవ్వట్లేదు… ఫోన్ చేసి ఎలా మాట్లాడాలి… ఏమని మాట్లాడాలి… ఇలా జవాబులు దొరకని ప్రశ్నలతోనే మూడు రోజులు గడిచిపోయాయి…

మూడు రోజుల తర్వాత రవి రాజుని వెంట బెట్టుకుని వచ్చాడు ఇంటికి… నాకు రాజు కళ్ళలోకి చూసేందుకు ధైర్యం సరిపోక తల దించుకొని కిచెన్ లోకి వెళ్లబోయాను… రాజు కూడా నా వైపు చూడట్లేదు… నేను వెళ్తుంటే రవి నన్ను ఆపి ఒక్క నిమిషం ఇలా కూర్చో అన్నాడు…
రవి రాజు చెరో సోఫాలో కూర్చుని ఉన్నారు..
నేను కూర్చోలేదు కానీ వెళ్లకుండా అక్కడే నిలబడ్డా…

“చూడండీ…” అంటూ మొదలెట్టాడు రవి…
” నేను చెప్పాల్సింది మొన్ననే మీకు వివరంగా చెప్పాను… మీరు నేను చెప్పినట్టు చేస్తామని నాకు మాటిచ్చారు… ఇప్పుడేమో మౌనపోరాటం చేస్తున్నారు… మీకు ఇంకో వారం రోజులు టైం ఇస్తున్నాను… ఈ రోజు బుధవారం… వచ్చే బుధవారం కల్లా మీరిద్దరూ నేను చెప్పినట్టు చేయడానికి అంగీకారం తెలుపాలి… లేదంటే….” అంటూ ఆగాడు రవి…

నేను రవి వైపు తిరిగి చూసాను… రాజు కూడా నాలాగే రవి వైపే చూస్తున్నాడు…

” ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు… ” అంటూ ముగించి అక్కడనుండి వెళ్ళిపోయాడు రవి…

నేను రాజు వైపు చూసాను… అదే క్షణంలో రాజు కూడా నా వైపు చూసాడు… క్షణకాలం మా ఇద్దరి కళ్లు కలుసుకున్నాయి… మరుక్షణం తప్పు చేసిన దానిలా నేను తలతో పాటు నా కళ్ళు దించుకున్నాను… రాజు అక్కడ్నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు…

వారం రోజులూ గడిచిపోయాయి… ఈ వారం రోజుల్లో ఒక్కసారి కూడా రాజుకి ఎదురుపడలేదు నేను…
నాకెందుకో బాగా గిల్టీ గా అనిపించసాగింది… రాజు ముందుకు వెళ్ళడానికి కూడా మనస్కరించడం లేదు… రాజు కూడా ఎక్కువగా ఇంట్లో ఉండలేదు… ఆఫీస్ నుండి రాగానే తన గదిలోకి వెళ్లిపోయే వాడు…

ఆ రోజు బుధవారం రవి హాల్లో కూర్చున్నాడు… రాజుని, నన్ను పిలిచాడు… నేను వెంటనే వెళ్ళలేదు… ఇంకో రెండు సార్లు పిలిచాక వెళ్లి తలా దించుకొని నిలబడ్డా… అప్పటికే రాజు వచ్చి ఇంకో వైపు నిలబడి బయటకు చూస్తున్నాడు…

నేను వెళ్ళాక రవి అడిగాడు… ” చెప్పండి నేను చెప్పింది చేస్తారా లేదా…” అని… నేను ఏమీ మాట్లాడకుండా అలాగే తల దించుకుని నిల్చున్నాను… రాజు కూడా ఏమీ మాట్లాడలేదు…

“మిమ్మల్నే అడిగేది… ఏదో ఒకటి చెప్పండి…” అన్నాడు రవి…

“నా వల్ల కాదు… ” … నేను రాజు ఇద్దరం ఒక్కసారే అన్నాం…
“అయితే నాకిచ్చిన మాట…” అడిగాడు రవి.. మేమిద్దరమూ సమాధానం చెప్పలేదు …

“నా మీద ఒట్టేసి మరీ చెప్పారు కదా…” అన్నాడు రవి…

“రవీ… ఇది సాధ్యం కాదు… నేనీ పని చేయలేను… నేనెప్పుడూ అక్షర ని వేరే దృష్టితో చూడలేదు… తననెప్పుడూ ఒక మంచి ఫ్రెండ్ లానే చూస్తూ వచ్చా… ఇప్పుడు నువ్ సడన్ గా ఆమెను పెళ్లి చేసుకో అనడం ఏమైనా బాగుందా… అసలెలా అనగలుగుతున్నావ్ ఈ మాట… తనకి నువ్వంటే ఎంత ప్రేమ… అలాంటిది నువ్వు ఇప్పుడు తనని ఎంత బాధపెడుతున్నావో నీకు అర్థం అవుతుందా…”
రాజు ఈ మాటలు అంటుంటే నాకు దుఃఖం ఆగలేదు.. నా కళ్లలోంచి కన్నీళ్లు వరదలా వచ్చేసాయి… రాజు నన్ను అపార్థం చేసుకోలేదని కొంచెం రిలీఫ్ అనిపించింది…

” నువు చేసేది కరెక్ట్ కాదు రవీ… నువ్ అనవసరమైన విషయాలు ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటున్నావు… నువ్వు బాధపడి మమ్మల్నీ బాధ పెడుతున్నావు… ” రాజు ఇంకా ఏదో చెప్పబోతుంటే రవి అడ్డుపడి…
” లేదు రాజు నువ్వంటున్నది, అనుకుంటున్నది తప్పు… నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను… ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే సరైన పని.. మీరు నా సంతోషం కోరుకునే వాళ్లే అయితే నేను చెప్పినట్టు చేయండి… ఇంక దీని మీద వాదనలు అనవసరం… చేస్తారా చేయరా ఏదో ఒకటి తేల్చి చెప్పండి…”అన్నాడు…

“నేను చేయలేను రవీ…. ” అన్నాడు రాజు తేల్చి చెప్పేస్తూ…
“అక్షరా…” అంటూ నా వైపు చూసాడు రవి…

“నా వల్ల కాదు అని మీకు ఆరోజే చెప్పాను… ఈ రోజు కూడా అదే చెప్తున్నాను… మీరీ మంకు పట్టు వదలండి ప్లీస్…” అన్నాను నేను బతిమాలుతూ…