నా కథ 1328

నేనూ అటువైపే చూస్తున్నాను… కానీ చూపులు మాత్రమే అక్కడ ఉన్నాయి.. మనసు లగ్నం కావట్లేదు…
కాసేపయ్యాక వెనక్కి తిరిగి బ్లూ షర్ట్ వైపు చూసాను..
బ్లూ షర్ట్ ఇంకా నా వైపే చూస్తున్నాడు..
నేను మళ్లీ తల తిప్పేసుకున్నా…
మళ్లీ గట్టిమేళం వినబడింది…
బావ ..అక్క మెళ్ళో తాళి కడుతున్నాడు…
ఫోటోగ్రాఫర్ పక్కకి జరగమనడంతో
నేను మండపానికి అవతలి వైపుకి కదిలాను..
అతని చూపులు నన్నే ఫాలో అవుతున్నట్టు అనిపించింది…
అవతలికి వెళ్లి నిలబడితే అతనికి ఎదురుగా ఉన్నాను..
బ్లూ షర్ట్ నన్నే చూస్తున్నాడు…
నేనూ ఒక సారి అతన్ని పరిశీలనగా చూసాను..
తెల్లటి పాంటు మీద నీలం రంగు షర్ట్ టక్ చేసుకుని ఉన్నాడు.. ఆరడుగుల ఎత్తు, కోలమోహం, కొనదేలి ఉన్న ముక్కు, తెలుపు, ఎరుపులకి మధ్యగా ఉన్న రంగు..జుట్టు నుదుటి మీద పడుతుంటే మాటి మాటికీ సవరిస్తున్నాడు…
అతన్ని చూస్తే నాకెందుకో ‘సెక్రెటరీ’ నవలలో ‘రాజశేఖరం’ గుర్తొచ్చాడు…
మ్యాన్లీ గా ఉన్నాడనిపించింది… అప్పటి వరకు ఉన్న అనీజీ ఫీలింగ్ పోయి నేనూ మళ్లీ మళ్లీ అతన్ని చూడసాగాను..
బ్లూ షర్ట్ మాత్రం తదేకంగా నన్నే చూస్తున్నాడు…
నేను అటూ ఇటూ తిరుగుతూ పెళ్లికి వచ్చిన వాళ్ళని పలకరిస్తుంటే..
నేను ఎటు వెళ్తే అటు వస్తూ.. కాస్త దూరంగా ఉంటూ నన్నే ఫాలో అవుతున్నాడు…

పెళ్లి పూర్తయి అక్క బావలూ పెళ్లి మండపం ముందు భాగంలో నిలబడి ఉంటే ఒక్కొక్కరూ వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించి వెళ్తున్నారు..
నేను అక్క వెనకాల నుంచుని అక్కకి వచ్చిన గిఫ్ట్స్ తీసుకుని పక్కకి పెడుతున్నాను..
బ్లూ షర్ట్ కూడా లైన్లో నుంచున్నాడు… నన్నే చూస్తూ దగ్గరగా వచ్చాడు…
అక్షింతలు తీసుకొని బావ మీదా అక్క మీద వేస్తూ కొన్ని నా మీద కూడా వేసాడు..
నేను చురుగ్గా చూస్తుంటే.. ఏమీ తెలియనట్టు … బావ ను కౌగలించుకొని, అక్కకి షేక్ హాండ్ ఇచ్చి అభినందించి కిందికి వెళ్ళాడు…
కిందికి వెళ్ళాక కూడా ఒక పక్కన నుంచొని నన్నే చూడడం నేను గమనించాను…
చాలాసేపు నేను వచ్చే వాళ్ళను పలకరిస్తు అక్కడే ఉన్నాను… అందరూ అయిపోయాక చూస్తే బ్లూ షర్ట్ అక్కడ లేడు..
నా కళ్ళు బ్లూ షర్ట్ కోసం పెళ్లి పందిరి అంతా వెతికాయి… ఎక్కడా కనబడలేదు.. ఎప్పుడు వెళ్లిపోయాడో.. చిన్న నిరాశ కలిగింది …

భోజనం కోసం చేతులు కడుక్కుందామని వెళ్తుంటే… చేతిలో కర్చీఫ్ తో పాటు ఆ చీటీ కూడా ఉంది…
పడేద్దామనుకుంటూనే… దాన్ని బ్లౌజ్ లోకి తోసేసా… ఎందుకలా చేశానో నాకే అర్థం కాలేదు..

భోజనాలు అయ్యాక బియ్యాలు పోయడం లాంటి చాలా కార్యక్రమాలు జరిగాయి..
సాయంత్రం పూట మొదలైన బరాత్ (ఊరేగింపు) రాత్రి వరకు సాగింది…
తొమ్మిది దాటాక అక్కని బావతో వాళ్ళింటికి పంపించారు…
వెళ్లిన వాళ్ళు వెళ్లిపోగా దగ్గరి బంధువులు కొందరు మాత్రం ఉండిపోయారు..
అందరూ భోజనాలు చేసి పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు…
నేను కాసేపు వాళ్ళతో ఉండి నిద్రొస్తుందమ్మా అంటూ నా గదికి వచ్చి బెడ్ మీద వాలాను…
డ్రెస్ కూడా చేంజ్ చేసే ఓపిక లేక అలాగే పడుకున్నా…
బ్లౌజ్ లో ఏదో తగులుతున్నట్టయింది…
తీసి చూస్తే బ్లూ షర్ట్ ఇచ్చిన చీటీ..
మళ్లీ ఒకసారి చదివా దాన్ని…
అందంగా ఉన్నాయి అక్షరాలు….

” బాపూ బొమ్మల్ని ఎప్పుడూ బొమ్మల్లో చూసేవాన్ని..
మొదటి సారి లైవ్ గా చూస్తున్నా….

… రవి”

ఎంత అందంగా పోల్చాడు నన్ను అనుకుంటూ చీటీని పెదాలకి ఆనించాను..
రవి అని ఉన్నచోట లిప్ స్టిక్ అంటుకుంది..
చదివిన రెండు సార్లు అతని పేరును చదవలేదు..
బ్లూ షర్ట్ పేరు రవి అన్న మాట…
ఎందుకో పెదాల మీదికి చిరునవ్వొచ్చింది..
‘రవి’ అని ఒకసారి బయటకు పలుకుతూ ఆ చీటీని అలాగే ఎద మీద పెట్టుకొని కళ్ళు మూసుకున్నాను…