రాములు ఆటోగ్రాఫ్ – Part 8 104

కాని అప్పటికే రేణుక తన చేతిలో ఉన్న క్యాండిల్ స్టాండ్ తీసుకుని అప్పుడే కింద నుండి లేవబోతున్న సుందర్ తల మీద గట్టిగా తన బలం మొత్తం ఉపయోగించి కొట్టింది.
తల మీద గట్టిగా దెబ్బ తగలడంతో సుందర్ పెద్దగా అరుస్తూ గోడ వైపుకు పడ్డాడు.
అది చూసి రేణుక భయంతో తన చేతిలో ఉన్న క్యాండిల్ స్టాండ్ ని పక్కకు విసిరేసి సుందర్ వైపు చూస్తున్నది.
సుందర్ చిన్నగా గోడ పట్టుకుని పైకి లేచి రేణుక వైపు అడుగులు వేస్తున్నాడు….అతని అడుగులు తడబడుతున్నాయి.
రేణుక సుందర్ వైపు భయంతో చూస్తూ వెనక్కు అడుగులు వేస్తూ చూస్తున్నది. సుందర్ రెండడుగులు వేయగానే అతని తల నుండి రక్తం ధారగా కారడం మొదలయింది.
అప్పటికే రాము కూడా లోపలికి వచ్చి సుందర్ తల మీద నుండి రక్తం కారుతుంటే ఏం చేయాలో తెలియక అలాగే చూస్తున్నాడు.
సుందర్ అలా తల నుండి రక్తం ధారగా కారడం చూసి రేణుక కూడా భయంతో గోడకు ఆనుకుని అలాగే చూస్తున్నది.
సుందర్ చిన్నగా అలాగే ఇంకో రెండడుగులు ముందుకు వేసి రేణుక మీద పడి పోయాడు.
రేణుక భయంతో సుందర్ ని తన మీద నుండి కిందకు తోసింది…..అప్పటికే సుందర్ చనిపోయి కింద పడిపోయాడు.
తన మీద నుండి సుందర్ ని తోసేసిన తరువాత రేణుక ఏడుస్తూ రాము వైపు చూసింది.
ఏది జరక్కుండా ఆపుదామని వారం రోజుల నుండి రేణుక వెన్నంటే ఉండి కాపాడుకుంటూ వచ్చాడో….అదే జరిగే సరికి రాముకి కూడా ఏం చేయాలో తోచక తల మీద తగిలిన దెబ్బ విపరీతంగా బాధ పెడుతుంటే నిస్సహాయంగా అలాగే వెనక్కి అడుగులు వేస్తూ గది లోనుండి బయటకు వచ్చి కారిడార్ లో కూర్చుండిపోయాడు.
గదిలో ఉన్న రేణుక రాము ఏమీ మాట్లాడకుండా ఉండే సరికి ఆమె కూడా ఏంచేయాలో తెలియక రాము వైపు ఏడుస్తూ చూస్తున్నది.
బయట కూర్చున్న రాము అలాగే పక్కకు వాలిపోయి సృహ తప్పి పడిపోయాడు.
***********
తరువాత మెలుకువ వచ్చి చూసే సరికి తను హాస్పిటల్ లో బెడ్ మీద ఉన్నట్టు, తన తలకు కట్టు కట్టినట్టు గమనించాడు రాము.
తల మీద తగిలిన దెబ్బకు రాముకి తల చాలా భారంగా ఉన్నట్టు అనిపించడంతో చిన్నగా కళ్ళు తెరిచి చూసాడు.
ఎదురుగా బెడ్ పక్కనే చైర్ లో రేణుక కూర్చుని ఉన్నది….ఆమె పక్కనే సునీత నిల్చుని ఉన్నది.
వాళ్ళిద్దరూ కంగారుగా రాము ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా అన్నట్టు ఆత్రంగా చూస్తున్నారు.
రేణుక కళ్ళల్లో అయితే నీళ్ళు కారుతున్నాయి.
రాము కళ్ళు తెరవడం చూసి రేణుక ఆనందంగా దగ్గరకు వచ్చి అతని చేయి పట్టుకుని నిమురుతూ, ఇంకో చేతిని రాము మొహం మీద పెట్టి చిన్నగా నిమురుతూ, “ఇప్పుడు ఎలా ఉన్నది రాము,” అనడిగింది.
సునీత కూడా సంతోషంగా, “ఎలా ఉన్నది రాము….రెండు మూడు రోజుల్లో నువ్వు లేచి తిరుగుతావని డాక్టర్ గారు చెప్పారు,” అన్నది.
కాని రాము తల మీద తగిలిన దెబ్బతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు.
రాము తన కళ్ళు బలవంతంగా తెరిచి రేణుక వైపు చూస్తూ, “అతను….అతను….ఇక్కడే ఉన్నాడు….వాడు….ఇప్పుడు….వాడు ఇప్పుడు ప్రేతాత్మ అయిపోయాడు,” అంటూ చిన్నగా మాట్లాడుతున్నాడు.
రాము ఏం చెబుతున్నాడో అర్ధం కాని రేణుక, “రాము….ఏం మాట్లాడుతున్నావు….నువ్వు ఏం చెబుతున్నావో మాకు అసలు అర్ధం కావడం లేదు,” అనడిగింది.
సునీత కూడా రాము మాట్లాడుతున్నది అర్ధం కాక అలాగే చూస్తున్నది. కాని రాముకి అప్పటికే మాట్లాడే ఓపిక లేక మత్తుతో కళ్ళు మూసుకున్నాడు.
రాము కళ్ళు మూసుకోవడం చూసి సునీత రేణుక భుజం మీద చెయ్యి వేసి, “పద….ఇక వెళ్దాం,” అన్నది.
కాని రేణుకకు రాముని అలా వదిలేసి వెళ్లడానికి మనసొప్పలేదు.
“మీరు వెళ్లండి సునీత….నేను కొద్దిసేపు ఆగి వస్తాను,” అన్నది రేణుక.
“అది కాదు రేణుక….రాము మత్తులో ఉన్నాడు కదా….నువ్వు ఇక్కడ ఉండి కూడా ఉపయోగం లేదు….అతనికి సృహ రాగానే డాక్టర్ మనకు కబురు పెడతాడు….అప్పుడు మళ్ళి వద్దువు గాని,” అన్నది సునీత.
దాంతో రేణుక చైర్ లో నుండి లేచి సునీత తో కలిసి హాస్పిటల్ నుండి వెళ్ళిపోయింది.
అలా పడుకుండి పోయిన రాముకి తనను ఎవరో పిలుస్తున్నట్టు అనిపించడంతో మెలుకువ వచ్చి పక్కకు తిరిగిచూసాడు.
హాస్పిటల్ అంతా చీకటిగా ఉన్నది….అక్కడక్కడ బెడ్ లైట్లు వేసి ఉన్నాయి.
టైం రాత్రి పదకొండు గంటలు అయినట్టుగా అక్కడ గోడకి ఉన్న గడియారం చూపిస్తున్నది.
రాము చిన్నగా తనను పిలుస్తున్న వైపు తల తిప్పి చూసాడు.
పక్క బెడ్ మీద అతను రాము తన వైపు చూడగానే, “నీకు ఒక విషయం చెప్పాలి….” అన్నాడు.
రాము ఏంటది అన్నట్టు చూసాడు
“ఉదయం నిన్ను చూడటానికి ఒక అమ్మాయి వచ్చింది కదా….ఆమెకు చాలా పెద్ద దెబ్బలు తగిలాయి…నువ్వు తల మీద దెబ్బతో మత్తుగా నిద్ర పోతున్నప్పుడు…కొంతమంది ఆ అమ్మాయి చాలా సీరియస్ కండీషన్ లో ఉన్నప్పుడు హాస్పిటల్ కి తీసుకొచ్చారు. అ అమ్మాయిని ఆడవాళ్ళ వార్డ్ లోకి తీసుకెళ్ళారు,” అని చెప్పాడు అతను.
ఆ మాట వినగానే రాము కంగారుగా ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు…కాని తల మీద దెబ్బ బాగా నొప్పి పుట్టడంతో రాము తన చేత్తో దెబ్బ తగిలిన చోట పట్టుకుని తూలుతూ మంచం మీద నుండి కిందకు దిగాడు.
అలా తూలుతూనే నడుస్తూ….మధ్యమధ్యలో ఆసరాగా అక్కడ ఉన్న మంచాలను పట్టుకుంటూ తనుండే వార్డ్ నుండి బయటకు వచ్చి ఆడవాళ్ళ వార్డ్ వైపుకు నడుస్తున్నాడు.
రాము వార్డ్ నుండి బయటకు రావడం చూసి అక్కడ ఉన్న డ్యూటీ నర్స్ అతన్ని పిలుస్తూ, “excuse me…sir…ఎక్కడకి వెళ్తున్నారు….మీరు అలా వెళ్ళకూడదు,” అని పిలుస్తున్నది.
కాని రాము ఆమె మాటలను పట్టించుకోకుండా ఆడవాళ్ల వార్డ్ లోకి వెళ్ళి రేణుక కోసం కంగారుగా వెతుకుతున్నాడు.
అలా వెతుకుతున్న రాముకి ఒక బెడ్ మీద రేణుక సృహ లేకుండా పడి ఉండటం చూసి ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ స్టూల్ మీద కూర్చుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఆమెను పైనుండి కిందదాకా చూస్తూ, “రేణుక….రేణుక… ఇదంతా ఎలా…..” అని అడగబోతుండగా….
బెడ్ మీద ఉన్న రేణుక మాయమైపోయి ఆమె ప్లేసులో సుందర్ ప్రేతాత్మ లేచి కూర్చున్నది.
రాము ఒక్కసారిగా సుందర్ ప్రేతాత్మను చూసి అదిరిపడ్డాడు. సుందర్ ప్రేతాత్మ రాము గొంతు పట్టుకుని అతని వైపు క్రూరంగా చూస్తూ, “నువ్వు ఇక్కడకు యాభై ఏళ్ళు వెనక్కు వచ్చావని నాకు తెలుసు…రేణుకను రక్షించడానికి వచ్చావని నాకు తెలుసు…నాకు రేణుకకు మధ్యలో ఎవరూ రాలేరు….రేణుక నాది…రేణుకని రక్షించడానికి వచ్చిన నువ్వు ఆ ఇంటి పనివాడు కిషన్ ని కూడా రక్షించలేకపోయావు….టెలిగ్రామ్ పంపించడానికి వచ్చిన అతన్ని పైకి పంపించాను,” అంటూ రాము గొంతుని గట్టిగా నొక్కుతూ నవ్వుతున్నాడు.
రాము ఊపిరాడక సుందర్ ప్రేతాత్మ చేతి పట్టు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
రాము తన చేతి పట్టులో నుండి గింజుకోవడం చూసిన సుందర్ ప్రేతాత్మ గట్టిగా నవ్వుతున్నది.
దాంతో బెడ్ మీద పడుకున్న రాము ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు.

3 Comments

  1. Challa bagundhi bayya

  2. Bayya story lo inka kastha kadha add chye

  3. Sir story super.upload next episode

Comments are closed.