రాములు ఆటోగ్రాఫ్ – Part 8 103

రాము రేణుక దగ్గరకు వచ్చి ఆమె ఎదురుగా మోకాళ్ల మీద కూర్చుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ, “నాకు ఇవన్నీ ఎలా తెలుసంటే…. నాకు నువ్వే అన్నీ చెప్పావు,” అన్నాడు.
“నేనా….నేను నీకు ఇవన్నీ ఎప్పుడు చెప్పాను,” అంటూ రేణుక రాము ఏం చెబుతున్నాడో అర్దం కానట్టు అడిగింది.
“నువ్వంటే నువ్వు కాదు…..నువ్వు రాసిన లెటర్….” అన్నాడు రాము.
“లెటర్….నేను నీకు ఎప్పుడు రాసాను….ఏ లెటర్ రాము,” అని అడిగింది రేణుక.
రాము పైకి లేచి నిల్చుని, “రేణుక….నేను ఇప్పుడు నీకు, నీ తలరాతకు మధ్యలో నిల్చుని ఉన్నాను….నీ తలరాతలో ఏం రాసుందో తెలుసుకోవాలనుకుంటున్నావా….” అంటూ ఒక్క క్షణం అగాడు రాము.
రాము చెబుతున్న మాటలు ఇంకా తనకు అర్ధం కానట్టు రేణుక అతని వైపు చూస్తున్నది.
“రేపు మీ ఇద్దరూ ఢిల్లో వెళ్ళడానికి రెడీ అవుతారు….కాని కిషన్ తల తెగి కనిపించినట్టే….డ్రైవర్ తల కూడా తెగి కారులో మీకు కనిపిస్తుంది…ఈ ఇంట్లోనే మీ ఇద్దరూ బందీలైపోతారు…సునీత కూడా నిన్ను రక్షించలేదు….” అంటూ రాము తల ఎత్తి బెడ్ రూమ్ తలుపు వైపు చూసాడు
అక్కడ అద్దం మీద ఎవరో శ్వాస పీలుస్తున్నట్టు గాలి మంచులా కనిపించడంతో అక్కడ ప్రొఫెసర్ సుందర్ ప్రేతాత్మ్ వచ్చి తమ మాటలు వింటున్నాడని అర్ధమయింది.
కాని రాము తనను గమనించాడని ప్రొఫెసర్ సుందర్ ప్రేతాత్మకు తెలియకుండా జాగ్రత్త పడుతూ మళ్ళీ రేణుక వైపు తిరిగి, “ఎందుకంటే సునీత పరిస్థితి కూడా డ్రైవర్, కిషన్ లలాగే ఆమె తల కూడా తెగిపోతుంది…ఆ తరువాత ఈ ఇంట్లో నువ్వు, ఆ ప్రొఫెసర్ ప్రేతాత్మ తప్పితే ఇంకెవరూ ఉండరు….ఆరు రోజుల వరకు ఆ ప్రేతాత్మ నిన్ను తనకిష్టం వచ్చినట్టు అనుభవిస్తుంది…ఆ ప్రేతాత్మ పెట్టే బాధలు భరించలేక ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు….యాభై ఏళ్ల తరువాత కూడా నీ అరుపులు ఈ విల్లాలో వినిపిస్తూనే ఉంటాయి…” అంటూ రాము రేణుక భుజాలు పట్టుకుని సోఫాలో నుండి పైకి లేపి, “నిన్ను ఈ బాధ నుండి బయట పడేయడానికి వచ్చాను రేణుక…నన్ను నమ్ము…” అంటూ రేణుకను గట్టిగా కౌగిలించుకున్నాడు రాము.
అలా కౌగిలించుకున్న రాము రేణుక చెవిలో ఎవరికీ వినబడకుండా, “రేణుక….సుందర్ ప్రేతాత్మ ఇక్కడే మన మాటలు వింటుంది. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను…ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ నమ్మనట్టు నటిస్తూ నన్ను కోప్పడుతూ బయటకు గెంటేయంది….ఒక గంట తరువాత ఇక్కడకి దగ్గరలో ఉన్న పార్క్ కి సునీత ని తీసుకుని వచ్చేయ్….నేను మీ ఇద్దరికీ చాలా విషయాలు చెప్పాలి,” అన్నాడు.
దాంతో రేణుక, “అలాగే రాము,” అన్నది.

అంతలో సునీత రేణుక దగ్గరకు వచ్చి రేణుకని రాము కౌగిలి నుండి విడిపించి, “రాము….ఏం చేస్తున్నావో….ఏం మాట్లాడుతు ఉన్నావో అర్ధమవుతున్నదా…నీ ప్రవర్తన నాకు నచ్చలేదు,” అంటూ రాముని తోసేసింది.
రాము రేణుక వైపు చూస్తూ, “రేణుక….నన్ను నమ్ము రేణుక….నేను నిజమే చెబుతున్నాను,” అన్నాడు.
కాని రేణుక మాత్రం రాము చెప్పిన ప్రకారం, “నీ మాటలు ఏమాత్రం నమ్మేలా లేవు రాము….ఇప్పటి దాకా నువ్వు మంచి వాడివి అనుకున్నాను….మాకు నువ్వు చెప్పే కట్టుకధల మీద ఏమాత్రం నమ్మకం లేదు….నువ్వు ఏదో కట్టుకధలు చెప్పి నన్ను బుట్టలో పడేసుకోవాలనుకుంటున్నావు…..ఇక ఇక్కడ నుండి వెళ్ళిపో,” అన్నది.
“రేణుక….ప్లీజ్….నన్ను నమ్ము,” అంటూ బ్రతిమిలాడుతున్నాడు రాము.
“రాము….please get out from my house,” అంటూ గట్టిగా చెప్పింది రేణుక.
కాని రాము రేణుక చెప్పేది వినకుండా, “నా మాట విను రేణుక,” అన్నాడు.
దాంతో రేణుక కోపంగా, “రాము….మా ఇంట్లో నుండి వెళ్ళిపో….” అంటూ గట్టిగా అరిచింది.
ఇక రాము చేసేది లేక అక్కడ నుండి వెళ్ళిపోయి….ఇంతకు ముందు రేణుకకి తాను కలవమన్న చోటకు వచ్చి వాళ్ళిద్దరి కోసం ఎదురుచూస్తున్నాడు.
అరగంట తరువాత రేణుక, సునీత ఇద్దరూ కారులో రాము చెప్పిన చోటకు వచ్చారు.
కారు దిగిన వెంటనే రేణుక పరిగెత్తుకుంటూ రాము దగ్గరకు వచ్చి, “రాము…..” అంటూ దగ్గరకు వచ్చి వాటేసుకోబోయింది.
కాని రాము ఆమెని దూరం నుండే ఆపుతూ, “ష్…..మాట్లాడొద్దు,” అన్నాడు.
దాంతో రేణుక అక్కడే రాముకి నాలుగడుగుల దూరంలో ఆగిపోయి ఏంటన్నట్టు చూసింది.
అంతలో సునీత కూడా కారు దిగి రేణుక పక్కనే వచ్చి నిల్చున్నది.
రాము తన ఫ్యాంట్ జేబులో నుండి ఒక లెటర్ తీసి సునీత కి ఇస్తూ చదవమన్నట్టు సైగ చేసాడు.
సునీత రాము ఎందుకు మాట్లాడటం లేదో, లెటర్ ఎందుకు ఇస్తున్నాడో అర్ధం కాక అయోమయంగా రాము చేతిలో లెటర్ తీసుకుని చదువుతున్నది.
లెటర్ : నేను మిమ్మల్నిద్దరినీ ఆ ఇంటి నుండి దూరంగా ఎందుకు రమ్మన్నానంటే….సుందర్ ప్రేతాత్మ మిమ్మల్ని ఫాలో చేయకుండా ఉంటుందని అనుకుంటున్నాను….ఒకవేళ ఆ ప్రేతాత్మ మిమ్మల్ని ఫాలో చేసి వచ్చినట్లయితే నేను విన్నదాని ప్రకారం ఆత్మలకి చదవడం కాని, రాయడం కాని తెలియదు….
ఆ లెటర్ చదువుతూ సునీత ఒకసారి రాము వైపు చూసి తన చేతిలోని లెటర్ పక్కనే ఉన్న రేణుకకి ఇచ్చింది.
రేణుక ఆ లెటర్ ని చేతిలోకి తీసుకుని చదువుతున్నది….
లెటర్ : ఇప్పుడు నేను చెప్పేదేంటంటే….నేను ఇంతకు ముందు మీ ఇద్దరికీ మీ ఇంట్లో చెప్పిన విషయాలు మీ ఇద్దరూ నమ్ముతున్నారా లేదా….కేవలం సైగలతోనే సమాధానం ఇవ్వండి…మాటల్లో వద్దు…..
ఆ లెటర్ చదివిన తరువాత రేణుక ఒక్కసారి రాము వైపు చూసి తరువాత సునీత వైపు చూసింది….సునీత కూడా నమ్ముతున్నట్టు తల ఊపింది.

3 Comments

  1. Challa bagundhi bayya

  2. Bayya story lo inka kastha kadha add chye

  3. Sir story super.upload next episode

Comments are closed.