తెగని గాలిపటం 110

నగలూ, ఖరీదైన చీరలూ కొనిపెట్టలేకపోయినా శేఖర్ తనను ప్రేమించాడు. తన బాధ అతడి బాధ. ఎట్లా లాలించేవాడు! తనకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకోవాలని తపించేవాడు. తనను దగ్గరకు తీసుకున్నప్పుడల్లా అతడి స్పర్శలో, అతడి ఊపిరిలో ఎంతటి అనురాగం!
కొంతకాలంగా శేఖర్ తనతో అంటీ అంటనట్లుగా ఉంటున్నాడు. ప్రేమగా పలకరించడం లేదు. దగ్గరకు రాకుండా దూరదూరంగా మసలుతున్నాడు. అంటే.. అంటే.. తన విషయం శేఖర్‌కు తెలిసిపోయిందా? అందుకనే అట్లా దూరంగా మసలుకుంటున్నాడా? చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. అనిపించడమేమిటి? అదే నిజం. లేకపోతే అట్లా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు?
ఆందోళనా, ఆవేదనా కలిసి.. కమలిని ఒంటిలో వొణుకు. తన వ్యవహారం తెలిసి కూడా ఒక్క మాటా అడగకుండా, ఒక్క మాటా అనకుండా ఎలా ఉండగలుగుతున్నాడు? నిజంగా తెలిసుంటుందా? తెలీకపోతే అతడి ప్రవర్తనకు అర్థం? శేఖర్‌కు తెలుసో, తెలీదో.. పోనీ. ఇకముందు అతడిని మోసం చెయ్యకూడదు. కానీ.. ఇప్పటిదాకా చేసిన తప్పుడు పనులో? అతడి ముందు తన తప్పును వొప్పుకొని క్షమించమని అడగొద్దా? తను శేఖర్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకొని అతడితోనే లోకమని అబద్ధాలాడి, ఇంకొకరితో తిరుగుతోంది. దీన్నెలా సరిదిద్దుకోవాలి?.. కమలిని తల పగిలిపోతోంది.
శనివారం రాత్రి కొట్టాయం నుంచి వొచ్చాడు శేఖర్. భోజనాలయ్యాయి.

తను చేసిన పిచ్చి పనులు చెప్పుకొని, క్షమించమని అడగాలని చెబుతోంది కమలిని మనసు. ధైర్యం చాల్లేదు. దానికి బదులుగా “నేను కూడా నీతో వొచ్చేస్తా. నువ్వక్కడ, నేనిక్కడ.. ఇట్లా ఎంత కాలం? నువ్వొచ్చేదాకా వారాల పాటు ఎదురుచూస్తూ ఉంటం నా వల్ల కావట్లేదు” – ఆమె.
అతనిలో కాస్తంత ఆశ్చర్యం. నవ్వొచ్చింది. ఆమెకు కనిపించకుండా పెదాల మాటున అదిమిపెట్టి “ఇప్పుడు నేనుంటున్న ఇంట్లో కుదరదు. ఒక్కటే గది. ఇద్దరికీ సౌకర్యంగా ఉండే ఇల్లు చూస్తా. అప్పుడు వొద్దువుగానీలే” – అతను.
దూర ప్రయాణం చేసి అలసివుంటంతో నిద్ర ముంచుకువొస్తోంది. వెళ్లి పడుకున్నాడు. ఆ పూట అతడితో కాసేపు కబుర్లు చెప్పాలనీ, మనసు విప్పాలనీ కమలిని ఆరాటం.
“ఏమైనా కబుర్లు చెప్పకూడదూ? కొట్టాయం ఎట్లా ఉందో, అక్కడి మనుషులు ఎట్లా ఉంటారో, నీకు అక్కడ ఎట్లా అనిపిస్తున్నదో చెప్పొచ్చు కదా. ఎప్పుడూ రావడం, అలసిపోయానని పడుకోడం. నిన్ను ఇబ్బంది పెట్టకూడదని ఇన్నాళ్లూ నేను ఏమీ అడగలేదు. ఇవాళ పౌర్ణమి. డాబా పైకెళ్లి పడుకొని, కాసేపు కబుర్లు చెప్పుకుందాం” – కమలిని.
తట్టింది, అతడి భుజంపై. లేద్దామనుకున్నాడు. మనసు ఎదురు తిరిగింది. ఆమె నటిస్తోందనీ, తనకు అనుమానం రాకుండా ప్రేమ వొలకబోస్తోందనీ ఊహ.
“ఇప్పుడు కాదు, ఇంకోసారి చూద్దాంలే. నిద్ర ఆగట్లేదు” – శేఖర్. ఆవులించాడు. కళ్లు మూసుకున్నాడు.
కమలినికి తన్నుకొస్తోంది, ఏడుపు. చప్పుడు చెయ్యకుండా డాబా పైకెళ్లి చాపమీద పడుకుంది. ఆమె కన్నీళ్లతో తడిసి దిండు ఉక్కిరిబిక్కిరి.
* * *
ఇప్పుడు కోజికోడ్‌లోని సెంట్రల్ లైబ్రరీకి బానిస శేఖర్. ప్రపంచ సాహిత్యం చదువుతుంటే ఇంకా ఇంకా విశాలమవుతూ మనసు. అక్కడికెళ్లే సమయం చిక్కకపోతే కొట్టాయంలోని పబ్లిక్ లైబ్రరీకెళ్లి ఇంగ్లీష్ పత్రికలు చూస్తున్నాడు.
కొట్టాయం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వెన్నిమాల, మాతృమాల అనే కొండ ప్రాంతాలకు వెళ్లి సాయంత్రాలు కాలక్షేపం చేస్తున్నాడు. థామస్ మరింత దగ్గరయ్యాడు. అతను లేకుండా ఒంటరిగా వెళ్లాలనుకున్నప్పుడు లైబ్రరీ నుంచి తెచ్చుకున్న పుస్తకాన్ని తీసుకుపోయి, అక్కడ చదువుకుంటుంటే మనసు వెలిగిపోయేది.
కొట్టాయం దగ్గరలోనే ఉన్న తిరునక్కర మహాదేవ ఆలయం (శివాలయం)కు అప్పుడప్పుడూ వెళ్లొస్తున్నాడు.
అక్కడ మరో రెండూళ్లు తెగ నచ్చేశాయ్. ఒకటి కల్లర, రెండు రామాపురం. కల్లరలో ఎటు చూసినా యేర్లు, వరిపొలాలు, ప్రాచీన గుళ్లు, చర్చిలు. ఎళుమంతురూత్ యేటిలో పడవపై ప్రయాణిస్తూ చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ మైమరచిపోయాడు.
రామాపురం ఓ చారిత్రక స్థలం. రామాపురత్తు అనే యోధుడి జన్మభూమి. ప్రఖ్యాత మలయాళ రచయిత్రి లలితాంబిక నివసించిన ఊరు. అక్కడ రామాలయం ఉంది. ఆ గుడికి చుట్టూ మూడు కిలోమీటర్ల దూరంలో భరత, లక్ష్మణ, శతృఘ్న గుడులున్నాయి. అన్నింటినీ దర్శించాడు. లలితాంబిక రాసిన ఏకైక నవల ‘అగ్నిసాక్షి’ ఫేమస్ అనీ, దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వొచ్చిందనీ తెలుసుకొని, దాని ఇంగ్లీష్ అనువాదం చదివాడు.
“ఏమిటి విషయం?” – థామస్, ఒక రోజు.
“ఏ విషయం?” – శేఖర్.
“సెలవులు వొస్తున్నా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నావ్. పుస్తకాలు తెగ తిరగేస్తున్నావ్. చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చుట్టబెట్టేస్తున్నావ్. ఏంటి కత?” – థామస్.
బలహీనంగా నవ్వుతూ, మౌనంగా శేఖర్.
“నువ్వెళ్లకపోతే పోయావ్. నీ వైఫ్‌నైనా తీసుకొచ్చేయొచ్చుగా. నువ్విక్కడ, ఆమేమో అక్కడ. ఏం బాలేదు. ఇట్లా ఎంత కాలం?” – థామస్.
“ఆమె కూడా అదే అంటోంది. చూడాలి” – శేఖర్.
థామస్ ఇక పొడిగించలేదు. నిజానికి అతను శేఖర్‌తో మాట్లాడాలనుకున్నది ఆ విషయం కాదు.
“శేఖర్, నేను ‘నవజీవన్’ అనే ఓ సేవా సంస్థను ప్రారంభించాలనుకుంటున్నా. దానికి నా స్నేహితులు, సన్నిహితుల నుంచి సహకారం ఉంటే సక్సెస్‌ఫుల్‌గా చేస్తాననే నమ్మకం ఉంది” – థామస్.
“నవజీవనా. బాగుంది. దానితో ఏం చేద్దామని?” – శేఖర్.
“అనాథలు, శారీరక, మానసిక వికలాంగులు ఎంతోమంది అనారోగ్యాలతో సరైన వైద్యం లభించక చచ్చిపోతున్నారు. అలాంటి వాళ్లకు మన హాస్పిటల్లోనే ట్రీట్‌మెంట్ ఇప్పించి, ఆరోగ్యాన్ని ఇవ్వాలనేది నా ఉద్దేశం. కేవలం వైద్యమే కాదు, వాళ్లకు ప్రేమానురాగాల్నీ అందించాలి. తద్వారా వాళ్లకు అందరిలా జీవితాన్ని కొనసాగించే ఏర్పాటు చెయ్యాలనేది నా సంకల్పం” – థామస్.
“ఎంత గొప్ప సంకల్పం!” – శేఖర్, అప్రయత్నంగా.
అతనిలో చాలా సంభ్రమం. ఇట్లాంటి ఆలోచన థామస్‌కు ఎట్లా వొచ్చింది? తనేమో సొంత సమస్యతో తెగ సతమతమైపోతూ, దాన్నుంచి ఎట్లా బయటపడటమా అని ఆలోచిస్తుంటే, థామస్ నలుగురికీ మంచి చేసే పని గురించి ఆలోచిస్తున్నాడు. ఆలోచన రావడం సరే, దాన్ని ఆచరణలోకి తీసుకు రావాలంటే ఎంత శ్రమ చెయ్యాలి! ఎంత ఓపిక కావాలి!!
“ఆలోచనదేముంది శేఖర్. ఆచరణ ముఖ్యం. వాళ్ల వైద్యానికి అయ్యే ఖర్చును భరించాలి. అందుకోసం నా జీతంలో పాతిక వంతును దీనికోసం కేటాయించాలని నిర్ణయించుకున్నా. పైగా ఇక్కడున్నంత కాలం వాళ్లకు ఆహారాన్ని ఏర్పాటుచేయడం కూడా ప్రధానమే. అందుకే నిత్యాన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించాలి.

6 Comments

  1. Ganjayi vanam lo tulasi Mokka la undi me katha. Gandhapu

  2. Chalabagundi sir ee story
    Naa manaus baruvekki kallu thdichayi
    Ee story chaduvuthunte

  3. Taking lot of delay for next story.

  4. Since 8days there is no new stories not updated.

  5. After this next stories are not appearing why it is.

  6. Why next post is not appearing in ending of the story.

Comments are closed.