తెగని గాలిపటం 110

ఇప్పటికే కొంతమంది నెలనెలా కొంత విరాళంగా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అంతేకాదు. మన నర్సింగ్ కాలేజీ స్టూడెంట్స్, మెడికల్ స్టాఫ్ కూడా ఖాళీ టైంలో పేషెంట్స్‌కు ఉచితంగా సేవ చేస్తామని మాటిచ్చారు” – థామస్.
అతని ముందు తాను మరుగుజ్జు అయిపోయిన భావన శేఖర్‌లో.
“నువ్వు తలపెట్టింది చిన్న పనికాదు థామస్. నీకు సంసారముంది. పిల్లలున్నారు. సొంత కుటుంబం చూసుకోడానికే కష్టమైపోతోందని అందరూ చెబుతుంటారు. అట్లాంటిది ఇతరుల కోసం ఇంత పెద్ద పని తలకెత్తుకోడం, దాని కోసం టైం కేటాయించడం మామూలు విషయం కాదు. దానికి ఎంతో గొప్ప మనసు కావాలి. నీది ఖచ్చితంగా గొప్ప మనసు. నీకు నేనెలా ఉపయోగపడగలనో చెప్పు. తప్పకుండా చేస్తా” – శేఖర్.
థామస్ మొహంపై నవ్వు. “మరీ అంతగా పొగడకోయ్. ఇది నేనొక్కణ్ణే చేస్తున్నానా. చాలామంది సాయం తీసుకుంటున్నా. నువ్వనుకుంటున్నట్లు ఇది ఇప్పటికిప్పుడు నాలో కలిగిన ఆలోచన కాదు. నేను కుర్రాడిగా ఉన్నప్పట్నించీ ఉన్నదే. ఓ రోజేమైందో తెలుసా? మా నాన్నకు విపరీతమైన కడుపునొప్పి వొచ్చింది. మా ఊళ్లో ఆస్పత్రి లేదు. జిల్లా ఆస్పత్రికెళ్లాలంటే పది కిలోమీటర్లు ప్రయాణించాలి. నాన్నను బస్సులో తెచ్చేసరికి హాస్పిటల్ మూసేశారు, టైం అయిపోయిందని. ఆ రోజంతా ఆస్పత్రి వరండాలోనే ఉన్నాం. కడుపునొప్పితో విలవిల్లాడుతున్న నాన్నను పరీక్షించిన డాక్టర్ వెంటనే ఆపరేషన్ చెయ్యాలన్నాడు. ఆపరేషన్‌కు కావాల్సిన డబ్బు మా వద్ద లేదు. ఈ విషయం తెలుసుకొని హాస్పిటల్లో ఉన్న పేషెంట్సే తలా కొంచెం చందాలు వేసుకొని ఆదుకున్నారు. మానవత్వాన్ని ఆ రోజు నేను ప్రత్యక్షంగా చూశా. అప్పుడే అనుకున్నా. ఆపదలో ఉన్న పేషెంట్స్‌ను ఎలాగైనా ఆదుకోవాలని. ఇప్పటికి అది కొలిక్కి వొచ్చింది. సరే.. ఈ పనిలో నువ్వెలా భాగం కావాలనుకున్నా సంతోషమే. డబ్బు సాయం చెయ్యొచ్చు. అనాథలను హాస్పిటల్‌కు తేవడంలో మాకు తోడ్పాటునీయొచ్చు” – వివరంగా, థామస్.
“రెండూ చేస్తా. నీకేమైనా అభ్యంతరమా?” – మనస్ఫూర్తిగా, శేఖర్.
‘నవజీవన్’ పని మొదలైంది. మొదటి రోజు అన్నదానానికి కిలో బియ్యం సరిపోయింది. నెల రోజులు గడిచేసరికి అది పది కిలోలకు పెరిగింది. రోగుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన వాళ్ల కోసం ఓ అద్దె ఇల్లు తీసుకున్నారు. దానికి ‘నవజీవన్ భవన్’ అనే పేరు పెట్టారు. ఇప్పుడు శేఖర్‌కు ఖాళీ సమయం ఉండట్లేదు. హాస్పిటల్ డ్యూటీ అవగానే నవజీవన్ భవన్‌కు వొచ్చేస్తున్నాడు.
జబ్బు నయం అయిన అనాథ పిల్లలను ఎర్నాకుళంలోని శిశుభవన్‌కు తీసుకెళ్లే బాధ్యతను అతనే చూసుకుంటున్నాడు. ఈ పనిలో పడి రెండు నెల్లపాటు హైదరాబాద్ రావడానికి అతనికి వీలు చిక్కలేదు.
* * *

రోజురోజుకూ పెరిగిపోతోంది, కమలిని మనసులో అశాంతి. శేఖర్ ప్రవర్తనతో పిచ్చిపడుతుందేమో అన్నట్లుంది. తన విషయం అతడికి తెలిసిపోయిందనే నమ్మకం గట్టిపడింది. అంతకు ముందే దూరం పెట్టేసింది శ్రీనాథ్‌ను.
ఒకసారొచ్చి “ఏమైంది నీకు? పద. స్వాగత్‌కు వెళ్దాం. నీ బాధేంటో చెబ్దువు గానీ” – శ్రీనాథ్.
“ముందు ఇక్కణ్ణించి వెళ్లు. పిచ్చి తలకెక్కి ఇంతదాకా నీతో తిరిగింది చాలు. ఇంకొంచెంసేపు ఇక్కడే ఉన్నావంటే అల్లరి పెడుతున్నావని గోలచేస్తా” – కమలిని, స్థిరంగా.
‘నువ్వూ, నేనూ కలిసి తిరగడం ఇక్కడివాళ్లకంతా తెలుసు. గోల చేసుకో. ఎవరూ నమ్మరు’ అందామనుకున్నాడు. ఆమె మొహంలోని నిజాయితీ ఆపేసింది. తనను ఇంతదాకా శారీరకంగా ఆమె హద్దుల్లోనే ఉంచిందన్న నిజం జ్ఞాపకమొచ్చింది. ఆమె వొంక అలాగే కొన్ని క్షణాలు చూసి, మారు మాట్లాడకుండా వెళ్లిపోయాడు.
అతడు తనకు కొనిచ్చిన వస్తువులన్నింటినీ అతడింట్లో పడేసి వొచ్చింది కమలిని.
* * *

2002 ఆగస్ట్ 7. ఉదయం నుంచీ ఒకటే వాన ముసురు. గద్దర్ ఇంటి ముందు ఆగింది ఆటో. కమలిని దిగింది. ఆ టైంలో ఇంట్లోనే గద్దర్. హాల్లో నలుగురైదుగురు రచయితలు, కవులు. అప్పటి రాజకీయాల గురించీ, సాహిత్యం గురించీ చర్చ. మధ్యమధ్యలో గద్దర్‌తో పాటు ఇంకో కవి నోటివెంట ఆశువుగా పాటలు. ఎవరో యువతి గబగబా గేటు తీసుకుని రావడం హాల్లోంచి చూశాడు గద్దర్. తలుపు తెరిచే ఉంటంతో నేరుగా హాల్లోకొచ్చి గద్దర్‌కు నమస్కారం పెట్టింది కమలిని.

“దండాలు తల్లీ. ఎవరమ్మా నువ్వు. అట్లా కూర్చో” – చాప చూపిస్తూ, గద్దర్.
అక్కడున్నోళ్లంతా చాపలపైనే కూర్చుని ఉన్నారు. ఆమెకు గద్దర్ తప్ప మిగతా వాళ్లెవరూ తెలీదు. కమలినిలో మొహమాటం. గమనించాడు గద్దర్.
“వీళ్లంతా మనవాళ్లేనమ్మా. మంచి రచయితలు, కవులు. మొహమాటపడకుండా చెప్పు” – గద్దర్.
“నా పేరు కమలిని అండీ. మీరంటే మా ఆయనకు చాలా ఇష్టం” – కమలిని.
“అవునా. ఎవరు మీ ఆయన?” – గద్దర్.
“శేఖర్. మీరప్పుడు నిమ్స్ హాస్పిటల్లో ఉంటే మిమ్మల్ని చూసొచ్చిందాకా నిలవలేకపోయాడండీ” – కమలిని.
“మంచిది తల్లీ. ఎందుకొచ్చావో చెప్పు. ఆ పోరగాడికేమీ కాలేదు కదా. అతను లేకుండా ఒక్కదానివే వొచ్చావంటే ఏదో పెద్ద గడబిడ అయ్యుంటుంది” – గద్దర్.
ఏడుపు తన్నుకొచ్చింది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
“ఈ తల్లికి నిజంగానే ఏదో కష్టమొచ్చినట్టుంది గద్దరన్నా. ఫర్లేదు చెల్లెమ్మా. మేమంతా నీ అన్నల్లాంటోళ్లమే. నీ బాధేందో చెప్పరాదే” – ఒకతను.
“గోరటి ఎంకన్న పేరు వినుంటావులే తల్లీ. ఇతనే ఆ ఎంకన్న. చెప్పు బిడ్డా. శేఖర్ ఏడున్నాడు?” – గద్దర్.
ధైర్యం తెచ్చుకొని పది నిమిషాల్లో తన కథంతా చెప్పింది.
“నేను తప్పుచేశాను. దాన్ని దిద్దుకోవాలనుకుంటున్నా. ఎలాగో తెలీడం లేదు. రెండు నెలలు దాటిపోయింది. మనిషి రావట్లేదు. నాలుగైదు రోజుల క్రితం ఫోన్‌చేసి అడిగితే వొస్తానన్నాడు. అతను రాలేదు కానీ మనియార్డర్ వొచ్చింది. తను నా మొహం చూడ్డానిక్కూడా ఇష్టపడట్లేదని అర్థమైంది. నాకు శేఖర్ కావాలి. అతనెక్కడెంటే నేనూ అక్కడే. అతన్ని ఇంకెప్పుడూ కష్టపెట్టే పని చెయ్యను. ఆ విషయం నేను చెబితే నమ్మడు. మీరు చెబితే నమ్ముతాడు. మీరు ఆయనకు దేవుడికిందే లెక్క. అందుకే వెతుక్కుంటూ మీ వద్దకొచ్చాను” – కమలిని.
రెండు మూడు నిమిషాల నిశ్శబ్దం. గద్దర్ వద్దకు ఈ రకమైన పంచాయితీ ఇదివరకెప్పుడూ రాలేదు. కమలిని గొంతులో, మొహంలో నిజాయితీ తోచింది అందరికీ.
“అన్నా, ఈ బిడ్డ చేసిన తప్పు తెలుసుకుంది. ఇక నుంచీ మంచిగా ఉంటానంటోంది. సాయం చెయ్యన్నా” – వెంకన్న.
గద్దర్ నవ్వాడు. కమలిని తలమీద చేయేసి “నిజం నిన్ను నీడగా వెంటాడుతున్నదే తల్లీ. ఇవాళ నువ్వే కాదు, ఎంతోమంది మార్కెట్ మాయలోపడి విలాసాలకు బానిసలవుతున్నారమ్మా. జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. అనుబంధాల్నీ, ఆత్మీయతల్నీ విస్మరిస్తున్నారు. నువ్వు చాలా త్వరగానే నీ తప్పు తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. శేఖర్ సంగతి నేను చూసుకుంటా. అన్నంతినెళ్లు తల్లీ” – గద్దర్.
* * *

6 Comments

  1. Ganjayi vanam lo tulasi Mokka la undi me katha. Gandhapu

  2. Chalabagundi sir ee story
    Naa manaus baruvekki kallu thdichayi
    Ee story chaduvuthunte

  3. Taking lot of delay for next story.

  4. Since 8days there is no new stories not updated.

  5. After this next stories are not appearing why it is.

  6. Why next post is not appearing in ending of the story.

Comments are closed.