తెగని గాలిపటం 110

సికింద్రాబాద్ స్టేషన్‌లో శబరి ఎక్స్‌ప్రెస్‌లోంచి దిగి ఆటో ఎక్కేలోగా తడిసి ముద్దయ్యాడు శేఖర్. ఇంటికి వొచ్చేసరికి అరగంట. ఆటో దిగాడు. గజగజా వొణికిపోతున్నాడు. ఆతడి కోసమే ఎదురుచూస్తో కమలిని. ఆ వాన నీళ్ల సవ్వడిలోనూ ఆటో ఆగిన చప్పుడు ఆమె చెవులకు. ఇంట్లోంచి ఒక్క పరుగున బయటకు వొచ్చింది. ఆటోవాలాకు డబ్బులిచ్చి, గేటు తీస్తున్నాడు శేఖర్. తల గిర్రున తిరిగింది. కాళ్లు సత్తువ కోల్పోయాయి.

అతని స్థితి చూసి, ప్రమాదం శంకించి, ఒక్క ఉదుటున అతడి వొద్దకు వొచ్చింది. ఆమె పట్టుకోబోయినట్లయితే కింద పడిపోయేవాడే. అతడి తడి ఒళ్లు కొలిమిలో పెట్టిన కర్రులా సలసలా కాలిపోతోంది. అతడి చేతిని తన భుజం మీద వేసుకొని, నెమ్మదిగా నడిపించుకుంటూ ఇంట్లోకి – కమలిని.

శేఖర్ నిల్చోలేకపోతున్నాడు. తనను కమలిని పట్టుకోవడం, ఇంట్లోకి తీసుకురావడం తెలుస్తూనే ఉంది. ఆమెకు దూరంగా జరగాలని మనసు కోరుకుంటుంటే, శక్తి చాలడం లేదు దేహానికి. ‘శ్రీనాథ్‌గాడి కింద నలిగిన ఆమె దేహానికి తన దేహం రాచుకోవడమా?’. తల నరాలు చిట్లినంత నొప్పి. తెలివితప్పిపోయాడు.

ఆమెకు కాళ్లూ చేతులూ ఆడలేదు. అతడికి చలిజ్వరమని తెలుస్తోంది. తమాయించుకుంటూ – చకచకా అతడి బట్టలు విప్పేసింది. రగ్గు కప్పింది. తల తుడిచింది, టవల్‌తో. రెండు అరచేతుల్నీ రుద్దింది. జ్వరాలూ, తలనొప్పులూ, వొంటినొప్పులూ, జలుబులూ, గాయాలూ వంటి వాటికి వేసే మందులెప్పుడూ ఇంట్లో సిద్ధం. వాటిలోంచి పారాసెట్మాల్ టాబ్లెట్ తీసి, వేసింది. అప్పుడు ఆమె కళ్లు పరిశీలనగా, అతడి మొహంలోకి.
మనిషి బాగా తగ్గిపోయాడు. కళ్లు, బుగ్గలు లోతుకుపొయాయి. రగ్గు తీసి చూసింది. పొట్ట వీపుకు అతుక్కుపోయినట్లు డొక్కలు స్పష్టంగా. అతను కదిలాడు. రగ్గు కప్పింది. మంచం మీద పడుకోబెట్టింది. కొన్ని క్షణాల తర్వాత, అతను పలవరిస్తున్నాడు. ఆ పలవరింతలు ఆమె గుండెల్లో బాకుల్లా సూటిగా గుచ్చుకున్నాయి. కళ్లళ్లోంచి నీళ్లు ఉబికుబికి వొచ్చాయి. వెక్కిళ్లు. ఏడుస్తూనే అతడి అరచేతులూ, అరికాళ్లూ రుద్దుతూ – ఆమె. ఎన్ని కన్నీటి చుక్కలు రగ్గుమీద పడి ఇంకాయో!
* * *
కొంత కాలం వెనక్కి.
1997 ప్రారంభ రోజులు.
శేఖర్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి ఆరేళ్లయిపోయింది. ఇంతదాకా ఏ ఉద్యోగంలోనూ కుదురుగా ఉండలేకపోయాడు. ఈ ఆరేళ్లలో తన చదువుకు సంబంధంలేని ఉద్యోగాలూ చేశాడు. గవర్నమెంట్ జాబ్‌కు యత్నిద్దామంటే రిక్రూట్‌మెంట్లే లేవు. కేంద్రంలో ఐక్య ఫ్రంట్ ప్రభుత్వం అనిశ్చితిలో. రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అనిశ్చితిలో. ఎక్కడైనా ఒకటీ, అరా జాబ్స్ పడుతున్నా, ‘ఆమ్యామ్యా’ ప్లస్ రికమండేషన్ ఉంటే తప్ప వొచ్చే స్థితి లేదు. శేఖర్‌లాంటి ‘ఎందుకూ పనికిరాని’ నిజాయితీపరుడికి ఆ అవకాశం అసలే లేదు.
ఉద్యోగం వేటలో భాగంగా విజయవాడలో ఉంటున్న మేనమామ వరసయ్యే నరసింహం ఇంటికొచ్చాడు శేఖర్. అక్కడికి రావడం అది మొదటిసారేమీ కాదు. కానీ ఆ రోజు – అతడి జీవితాన్ని మలుపు తిప్పిన రోజు!
నరసింహం కూతురు కమిలిని. గతంలో వాళ్లు బాపట్లలో ఉండే కాలంలో, అక్కడే ఇంజనీరింగ్ చదివాడు శేఖర్. పేరుకు హాస్టల్లో ఉంటున్నా, వాళ్లింట్లోనే ఎక్కువ కాలం గడిపాడు. శని, ఆదివారాలు అక్కడే పడుకునేవాడు. సాధారణంగా భర్త తరపు చుట్టాలంటే నరసింహం భార్య వరలక్ష్మికి గిట్టేదు. చిత్రంగా శేఖర్ ఆమె ఆదరణకు నోచుకున్నాడు. ఒళ్లు దాచుకోకుండా పనిచేసే తత్వం అతడిది. బయటి పనులే కాదు, వంట పనిలోనూ సాయం చేసే అతడి గుణం నచ్చడంతో, అతడిపై అభిమానం చూపేది వరలక్ష్మి.
శేఖర్ ఫస్టియర్‌లో ఉన్నప్పుడు పెద్దమనిషయ్యింది కమలిని. అతడక్కడ నాలుగేళ్లున్నాడు. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. మానసికంగానూ దగ్గరయ్యారు. ‘శేఖరే నా మొగుడు’ – మనసులో ఆనాడే కమలిని నిర్ణయం. ఇప్పటిదాకా బయటపెట్టలేదు. హోదాపరంగా, ఆర్థికపరంగా కమలిని వాళ్లు శేఖర్ వాళ్లకంటే పైమెట్టు. ఇది అతడికి బాగా తెలుసు. ఆమె ముందు అతనూ బయటపడలేదు. ధైర్యం చెయ్యలేకపొయ్యాడంటే కరెక్ట్.
కమలినికి సంబంధాలు చూస్తున్నారు. తన అన్న కొడుకుతో కూతురి పెళ్లి చెయ్యాలనేది వరలక్ష్మి కోరిక. అతగాడంటే కమలినికి ఇష్టంలేదు. ఆ సంగతి తల్లికి చెప్పాలంటే ఆమెకు జంకు.

అట్లాంటి రోజుల్లో ఆ ఇంటికొచ్చాడు శేఖర్. ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. నరసింహం, వరలక్ష్మి డాబామీదకెళ్లారు, పడుకోవడానికి. కాసేపటికి వాళ్లిద్దరూ వాదులాడుకుంటున్న సంగతి కింద హాల్లో ఉన్న అతడికి తెలుస్తోంది. ‘పెళ్లి’ అనే మాట తప్ప మిగతా మాటలు అర్థం కాలేదు.
టైం పదిన్నర. తన గదిలోంచి బయటకొచ్చింది కమలిని. మనసులో భయం స్థానంలో తెలీని తెగువ. నవారు మంచం మీద అటూ ఇటూ పొర్లుతూ శేఖర్. అతని మనసు స్థిమితంగా లేదు. ఆమెకు తెలిసింది. కొద్ది క్షణాల ఊగిసలాట. మనసుకి ధైర్యం చెప్పుకుని అతని మంచం కాడికి ఆమె. మంచం కోడు కాలికి తగిలి అలికిడి. కళ్లు తెరిచి, అటు చూసి గతుక్కుమన్నాడు శేఖర్. గబాల్న లేచి కూర్చున్నాడు.
“ఏంటి కమ్మూ?” చిన్న గొంతుతో, శేఖర్.

6 Comments

  1. Ganjayi vanam lo tulasi Mokka la undi me katha. Gandhapu

  2. Chalabagundi sir ee story
    Naa manaus baruvekki kallu thdichayi
    Ee story chaduvuthunte

  3. Taking lot of delay for next story.

  4. Since 8days there is no new stories not updated.

  5. After this next stories are not appearing why it is.

  6. Why next post is not appearing in ending of the story.

Comments are closed.