ఆ యక్ష బ్రాహ్మణుడు ఆ వజ్రాన్ని నా చేతుల్లో పెట్టి,మధనా ఇన్నాళ్లూ నేను పడిన కష్టానికి ప్రతిఫలం కలిగింది,నా బాధ్యతని నేను విజయవంతం గా నిర్వర్తించాను ఇక నేను సెలవు తీసుకుంటాను అనగా ,బ్రాహ్మణా ధన్యవాదాలు మీరు మాతో పాటే ఉండాలి అనగా ఆ యక్షుడు నా విజ్ఞప్తి ని తిరస్కరిస్తూ మధనా ఇంతటితో నా కర్తవ్యం ముగిసింది నేను వెళ్లక తప్పదు,విజయుడవు అయ్యి ఈ విశ్వ కళ్యాణం ని జరిపిస్తావు అని ఆశతో సెలవు తీసుకుంటున్నాను అంటూ అదృశ్యం అయ్యాడు సంతోషంగా..
యక్ష బ్రాహ్మణుడు అదృశ్యం అయ్యిన కాసేపటికి నేను తేరుకొని,రఘుపతి బ్రాహ్మణా ఈ వజ్రంతో నేనేమి చేయాలో సెలవివ్వండి అన్నాను.
మధనా ఈ వజ్రం యొక్క విశిష్టత ఏంటంటే ఈ విశ్వానికి పగలు,రాత్రిలని కలిగిస్తూ తేజస్సుని ఇవ్వడం,ఈ వజ్రం వాడి చేతిలో పడితే పగలుని మాయం చేసి కేవలం రాత్రి ఉండేలా వాడు ఈ విశ్వాన్ని తన అదుపులోకి తెచ్చుకొని తన పనిని నెరవేర్చుకుంటాడు సునాయాసంగా… అలాగే నీ దగ్గర ఉన్న మహాదీపం ఈ విశ్వ జననం,మరణం ల రహస్యాలని కలిగివుంది…ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇవి రెండూ ఆ మాయావుల చేతికి చిక్కకుండా కాపాడుకోవాలి అలాంటప్పుడు మాత్రమే నువ్వు ఈ విశ్వ కల్యాణం ని జరిపించగలవు..ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వచ్చే పౌర్ణమి నాడు ఆ మహా తల్లి వరూధిని నీకు మహాదీపాన్ని సంపూర్ణంగా సమర్పించి ఈ విశ్వం తాలూకు రహస్యాలన్నింటినీ నీకు వివరిస్తుంది అందులకి గానూ నువ్వు మధనం ని జరపాల్సి ఉంటుంది బహుశా నువ్వు అదే పనిలో నిమగ్నమయి ఉన్నావు అనుకుంటున్నా అంటూ చిన్నగా నవ్వాడు..
నిజమే బ్రాహ్మణా మీరన్నది నేను అదే పనిలో ఉన్నాను, ఎలాగైననూ ఈ మాయావుల అంతం చూడాలని పట్టుదలతో ఉన్నాను.
పట్టుదల ఒక్కటే సరిపోదు మధనా,అత్యంత చాకచక్యం కావాలి… వాడు ఒక మాయావి అని గుర్తుంచుకో వాడికి అనుకూలం లేనప్పుడు దొంగదెబ్బ కొట్టడానికి కూడా వెనకాడడు, జాగ్రత్తగా ఉండటం సమంజసం.
అలాగే బ్రాహ్మణా,ఇంతకీ మిమ్మల్ని కలవడానికి వాడికి గల అభ్యంతరం ఏమిటో చెప్పనేలేదు మీరు అన్నాను వినయంగా.
దానికి ఒక మహత్తర చరిత్ర ఉంది మధనా,నువ్వనుకున్నట్లు ఈ కోట మామూలు కోట కాదు,ఇది ఒక అద్భుతం..ఇందులోనే సకల చరాచర సృష్టి రహస్యాలు ఉన్నాయి..దేవతలు ఈ విశ్వాన్ని సృష్టించింది ఈ కోటలోనే..ఈ కోట రహస్యాలు సర్వం తెలుసుకుంటే విశ్వాన్ని శాసించే శక్తి లభిస్తుంది..నాకు ఈ కోటలోని రహస్యాలు కొంతమేరకు తెలుసు అందుకే వాడు నీకు తెలిసే అవకాశం ఉందని అడ్డు పడ్డాడు..
ఆయన మాటలకి ఆశ్చర్యం అవధులు దాటింది…అత్యంత ఆశ్చర్యం గా ఏమంటున్నారు బ్రాహ్మణా??ఈ కోటలోనే సకల సృష్టి జరిగిందా???
నిజం మధనా,ఈ కోటని సాక్షాత్తూ ముక్కోటి దేవతలు ప్రతిష్టించారు..కాలగమనంలో ఈ కోటకి అంత ప్రాముఖ్యత లభించకపోయినా గుహుడి వల్ల విపత్తు ఉందని భావించిన రాజసింహుడు ఈ కోటని తన అపార శక్తులతో దుష్ట శక్తులు ఇందులోకి ప్రవేశించకుండా అష్ట దిగ్బంధనం చేసాడు,అలా చేయడం మూలానే ఇన్ని రోజులూ ఈ విశ్వం మనుగడని సాగిస్తోంది,అలాగే మా వంశపు వారసుల్లో ఒకరు ఈ కోటకి కాపలాగా వుంటూ సురక్షితంగా ఉంచుతున్నారు…ఈ కోటలో వున్నంతకాలం మమ్మల్ని ఎదిరించే శక్తి ఎవ్వరికీ లభించదు..
రాజసింహుడి యొక్క వీరత్వం ఈ విశ్వాన్ని ఆ మాయావుల నుండి ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంది బ్రాహ్మణా,ఆ వీరుడు మాతో పాటూ ఉండి ఉంటే ఈ కార్యం సునాయాసంగా విజయవంతం అయ్యేది,దురదృష్టవశాత్తు ఆయన కాలం చేయడం అత్యంత బాధాకరం అన్నాను.
చింత వలదు మధనా,అతడి కార్యాన్ని అతని కంటే ప్రతిభావంతుడైన నీ చేతిలో పెట్టి సంతోషంగా ప్రకృతిలో కలిసిపోయారు రాజసింహుడు, ఇక ఆ బాధ్యత నీదే .
అలాగే బ్రాహ్మణా చాలా విలువైన సమాచారం ఇచ్చారు ధన్యుడను మీకు ఎల్లప్పుడూ అంటూ వినయంగా నమస్కరించాను…
ఇది నా బాధ్యత మధనా,ఇంకొక ముఖ్యమైన విషయం మీకు మనవి చేయాలి నా బాధ్యతగా,ఇద్దరూ ఈ హారాలు ధరించి నాతో పాటూ ధైర్యంగా రండి అంటూ హారాలు మా మెడలో వేసి ముందుకు కదిలాడు..
ఆశ్చర్యం గా ఆయన నడుస్తుంటే కోట గోడలు సైతం పక్కకి తొలగిపోతూ దారిని ఇవ్వడం వింతగా ఉంది,ఆయన వెనక నడుస్తుంటే మా ఇద్దరి వెనకాల ఏవో శక్తులు మమ్మల్ని వెంటాడుతుండటం లీలగా తెలుస్తోంది…
మీ వెనకున్నవి దుష్ట శక్తులు మధనా,అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు,ఈ విశ్వ శాంతి కోసం అప్పట్లో అతి భయంకరమైన రాక్షసులని ఈ కోటలో బలి ఇవ్వడం జరిగింది వాటి తాలూకు శక్తులు అవి అంటూ తేలికపరిచాడు రఘుపతి..
అలా దాదాపూ గంట సేపటి నడక తర్వాత ఒక అడవిలోకి మా ప్రయాణం సాగింది,అంత చిన్న కోటలో ఇంతటి దారి ఉందని అనుకోలేదు..అందులోనూ అంతటి చిన్న కోటలో ఒక గంట పాటూ కాలినడక అంటే మహా ఆశ్చర్యం గా అనిపించింది….
పచ్చటి అడవి కనిపించేసరికి ఆశ్చర్యం అధికం అయింది నాలో…ఆ అడవి కి బయటన వరూధిని భవనం కాంతులతో విరజిల్లుతోంది..
నేను ఆశ్చర్యంతో బ్రాహ్మణా ఇది వరూధిని నిలయం మేము ఇంతకుముందే ఇక్కడికి వెళ్ళాము అన్నాను..
అవును మధనా,ఇప్పుడు ఈ వరూధిని నిలయాన్ని మీకు చూపించడంలో గల అంతరార్థం ఏంటంటే,ఈ విశ్వ రహస్యాలన్నీ మహాదీపం స్థావరం అయిన వరూధిని నిలయంలో నిక్షిప్తమై ఉండటం,ఇంకా రాత్రీ,పగలు ని నిర్ణయించే వజ్రం ఈ కోటలో ఉందని తెలియజేయడం,ఇప్పుడు మీకు అర్థం అయుంటుంది అంతా విషయం అన్నాడు బ్రాహ్మణుడు.
అర్థం అయ్యింది బ్రాహ్మణా,ఈ విశ్వానికి సంబంధించిన ఏ పని అయిననూ ఈ రెండు ప్రదేశాలతోనే ముడిపడివుంది,ఈ విశ్వ కల్యాణం కూడా ఈ రెండు ప్రదేశాల్లోనే జరగాలి అంతేగా.
భేష్ మధనా సరిగ్గా చెప్పావు,అలాగే ఆ మాయావుల అంతం కూడా ఈ వరూధిని నిలయంలోనే జరగాలి .
అలాగే బ్రాహ్మణా అర్థం అయ్యింది మొత్తం.
సంతోషం మధనా,ఒక్కసారి వరూధిని మాట దర్శనం చేసుకొని వెళ్దాం అంటూ మనసులో ఏవో ఉచ్చారణ చేయగా వరూధిని మా ముందు ప్రత్యక్షం అయింది.
వినయంగా అందరమూ నమస్కరించగా,ఆమె రఘుపతి ని ప్రశంసిస్తూ భేష్ రఘుపతి, నీ కార్యాన్ని విజయవంతం గా నిర్వర్తించావు ఇక కోటలోని రహస్యాలు మధనుడికి వివరించు తక్కిన నా నిలయంలోని రహస్యాలని నేను సవివరంగా పౌర్ణమి నాడు వివరిస్తాను అంటూ నన్ను ఆప్యాయంగా కౌగిలించుకుని అదృశ్యం అయిపోయింది..