తెగని గాలిపటం 119

మరోసారి ఆగస్ట్ 15కి. తెల్లవారితే 16.
ఒంటిమీదున్న రగ్గుతీసి అవతలకు నెట్టాడు శేఖర్. ఒళ్లంతా చెమట్లు. పక్కకు చూశాడు. కమలిని లేదు. లేచాడు. విపరీతమైన నీరసం. గద్దర్ ఫోన్ చేయడం, రాత్రి తను రావడం, కమలిని తనకు సపర్యలు చెయ్యడం.. అన్నీ జ్ఞాపకానికొచ్చాయి. ఆమె కన్నీటి చుక్క తన చేతిపైపడ్డం జ్ఞాపకానికొచ్చింది. ఆమె తప్పు తెలుసుకుందా? పశ్చాత్తాపపడుతోందా? లేక తన స్థితికి బాధపడుతోందా? ఆమె దుఃఖానికి రెండూ కారణమేనా?
మంచం మీంచి దిగాడు. ముందు గదిలో వెల్తురు. చప్పుడు చెయ్యకుండా కిటికీ రెక్కను నెమ్మదిగా తెరిచాడు. కింద కూర్చొని పేపర్‌పై ఏదో రాస్త్తూ, కమలిని. మధ్య మధ్య కళ్లు తుడుచుకుంటూ…
ఆ ఒక్క దృశ్యం.. ఆ ఒకే ఒక్క దృశ్యం.. ఎన్నో విషయాలు చెప్పింది. సందేహమే లేదు. ఈ కమలిని, మునుపటి కమలిని కాదు. తన కమ్ము!
ఆమెపై ప్రేమ ఉప్పెనలా తోసుకువొస్తుంటే.. తన కళ్లు తడవటం అతడు గమనించలేదు. ఒళ్లు స్వాధీనంలో లేని విషయం పట్టించుకోలేదు. తలుపు తోశాడు. “కమ్మూ!” అంటా ఒక్క ఊపున వెళ్లాడు. ఆమెలో ఉలికిపాటు. రాస్తున్న పేపర్‌ను దాచబోయింది, కంగారుగా. పేపర్ ఆమె మాట వినలేదు. చేతిలోంచి జారి కిందకి.
ఆమె తియ్యబోతుంటే, చటుక్కున దాన్నందుకున్నాడు. ఆమె కన్నీళ్లతో తడిసిన ఆ పేపర్‌లోని అక్షరాల వెంట అతని కళ్లు పరుగులు.
“శేఖర్ నన్ను క్షమించు. నీకు తీరని ద్రోహం చేశాను. నువ్వెంత మంచివాడివి. నాపై ఎంత ప్రేమ చూపావు. కానీ నేను ఆడంబరాల్లో, షోకుల్లో సుఖముందనే భ్రమల్లో మునిగాను. నీ ప్రేమను నిర్లక్ష్యం చేశాను. ఎండమావుల వెంట పరుగులు పెట్టాను. నా సంగతి తెలిసి కూడా తెలియనట్లు ఉంటున్నావని అర్థమైంది. నీ స్థానంలో ఇంకెవరున్నా అదే రోజు నాతో తెగతెంపులు చేసుకునేవాడు. లేదంటే ఆ చెంపా, ఈ చెంపా వాయించేవాడు. నీది అతి మంచితనం. నేను దారి తప్పుతున్నానని తెలిసి కూడా ఆ బాధను నీలోనే దాచుకొని, ఎంతగా కుమిలిపోతున్నావో, ఎంత నరకయాతన అనుభవిస్తున్నావో. ‘ఇట్లాంటిదాన్నా.. నేను ప్రేమించి పెళ్లి చేసుకుందీ’ అని ఎంతగా వేదన చెందుతున్నావో. నీ బాధ, వేదన న్యాయమైనవి. మానసికంగా నిన్నెంత క్షోభపెట్టానో తలచుకుంటుంటే నాపై నాకే పరమ అసహ్యం వేస్తోంది. నిజమైన సుఖమేమిటో, ప్రేమేమిటో తెలిసేసరికి నువ్వు నాకు చాలా దూరమైపోయావ్. నేను తప్పు చేశాననేది నిజం. కానీ నేను వ్యభిచారం చెయ్యలేదు. నీతో జరగని సరదాలను తీర్చుకోవాలనుకున్నానే కానీ ఈ శరీరాన్నీ, మనసునీ నీకు తప్ప ఇంకెవరికీ అర్పించలేదు. సంజాయిషీ కోసం ఈ సంగతి చెప్పడం లేదు. నీకు నిజం తెలియాలనే చెబుతున్నా. ఇదే సంగతి నువ్వు అభిమానించే గద్దర్‌గారికి చెప్పి, కొంత ఉపశమనం పొందాను. ఆయన మాటతోనే ఇప్పుడు నువ్వొచ్చావని తెలుసు. కానీ ఇందాక నువ్వు పలవరించినప్పుడు అర్థమైంది, నీ హృదయం ఎంతగా గాయపడిందో, ఎంతగా క్షోభించిందో. ‘కమ్మూ, ప్రేమ అంటే నమ్మకం, ప్రేమ అంటే భరోసా అనుకున్నా. నువ్వేమో డబ్బులోనూ, ఆడంబరాల్లోనూ, సరదాలు, షికార్లలోనూ ప్రేమ ఉందనుకుంటున్నావ్. నన్నేందుకు మోసం చేశావ్?’ అని నిద్రలోనే అడిగావ్. నీతో కలిసి బతికే అర్హత నాకులేదని అర్థమైంది. అందుకే…”
అంతవరకే రాసింది. ఆ తర్వాత కన్నీటి చుక్క పడ్డట్లు తడిసింది పేపర్. కమలిని వొంక చూశాడు శేఖర్. తల అవతలకు తిప్పుకొని ఉంది, తన మొహం అతడికి చూపించే ధైర్యంలేక.
తన ప్రమేయం ఏమీ లేకుండానే, తనేమీ అనకుండానే ఆమె తన తప్పు తెలుసుకుంది. కమలిని ఇప్పుడు మారిన మనిషి. ఆమెకు ఏం చేస్తే ఆనందం కలుగుతుందో అది చెయ్యలేడా?
ఆమె ముందు మోకాళ్లపై కూర్చున్నాడు. ఆమె తలను చేతుల్లోకి తీసుకున్నాడు. “కమ్మూ, నన్ను వొదిలిపెట్టి నీ దారిన నువ్వు పోదామనుకుంటున్నావా? నేనేమైపోవాలనుకున్నావ్?” అంటా ఆమె పెదాలపై, నుదుటిపై ముద్దుపెట్టుకున్నాడు. తడిసిన కన్నులను పెదాలతో అద్దాడు. కన్నీటి చుక్కలు ఉప్పగా ముద్దాడాయి. రెండు చేతులూ అతడి వీపు వెనుగ్గా పోనిచ్చి మళ్లీ ఎవరైనా తమను వేరు చేస్తారేమోననే భయం ఉందేమో అన్నట్లుగా గట్టిగా, బలంగా శేఖర్‌ను వాటేసుకుంది కమలిని.
-బుద్ధి యజ్ఞ మూర్తి

6 Comments

  1. Ganjayi vanam lo tulasi Mokka la undi me katha. Gandhapu

  2. Chalabagundi sir ee story
    Naa manaus baruvekki kallu thdichayi
    Ee story chaduvuthunte

  3. Taking lot of delay for next story.

  4. Since 8days there is no new stories not updated.

  5. After this next stories are not appearing why it is.

  6. Why next post is not appearing in ending of the story.

Comments are closed.