మెమోరీస్ 7 116

పూల ఱేడు

రాజుకి రెండుమూడు రోజులుగా నిద్ర పట్టడం లేదు. ఆ చంద్ర భవనం అంతు చూడందే అతనికి నిద్ర పట్టేలా లేదు. దొడ్లో మంచం మీద పడుకుని ఆకాశంలోని చుక్కలను చూస్తూ ఆలోచిస్తున్నాడు. అతని ఆలోచనలన్నీ చంద్ర భవనం చుట్టూనే.
మంచం మీద తనతో పాటు బావమరిది చిన్నాగాడు తన మీద కాలేసుకుని పడుకున్నాడు. మంచం పక్కన మామ రంగప్ప ఈత చాప మీద పడుకున్నాడు. ఇంట్లో అత్తా, మరదలు చాప మీద నిద్రపోతున్నారు.
పగటి యెండకు వేడెక్కిన భూమి, రాత్రి వీచే చల్లటి గాలికి చల్ల బడింది. ఆ చల్లటి గాలికి హాయిగా నిద్ర పడుతొంది. కానీ ఆలోచనలు రాజుని పడుకోనివ్వడం లేదు. ఇంకో ఇరవై రోజుల్లో అమావస్య. అయిదు రోజులలో పున్నమి వచ్చేస్తొంది.
అమావస్య రోజు బలయ్యే ఆడపిల్లని తలుచుకుంటేనే భయం వేస్తొంది. ఆ రోజు పిశాచం తన పూర్వరూపం సంతరించుకుంటుంది. ఆ పిశాచానికి శరీరాన్ని అరువిచ్చేదెవరు. అరువుచ్చిన వాడు మాయలు, మంత్రాలతో శక్తి వంతుడవుతాడు. అజేయుడవుతాడు. మరి వాడి కుటుంబం. ఒక వేళ అది కేశిరెడ్డేనా. లేక అతని అనుచర గణంలో ఒకడా. ఇటువంటి ఆలోచనలతో తిక్క బట్టి పోతొంది రాజుకి.
పక్కకి తిరిగి చూడగానే మామ పక్కనే వున్న టార్చ్ లైట్ కనిపించింది. రంగనాయకుని కుంట కింద వరి మడి నాటినప్పుడు రాత్రి పూట నీళ్లు కట్టవలసి వస్తే చీకట్లో ఇబ్బంది పడకుండా ఆ టార్చ్ లైట్ తెచ్చుకున్నాడు రంగడు.
మీదున్న బావమరిది కాలుని పక్కకి జరిపి, మామ పక్కనే వున్న టార్చ్ లైట్ చేతపట్టుకుని చెప్పులు తొడుక్కుని వూరికి పడమర దిక్కున వున్న చంద్ర భవనం వైపు నడక సాగాడు.
వూరు బయటున్న చింత తోపు దాటుతుండగా “ఏమిరో మనవడా, యాడికి ఒగనివే యల్లబారినావ్” అన్న పిలుపు వినిపించింది. పక్కకు తిరిగి చూస్తో ఒక ముసలాడు. తమల పాకులో సున్నం పూసి నోట్లో పెట్టుకుంటున్నాడు. చింత చెట్టుకింద వున్న రాతి సమాది మీద కూర్చుని వున్నాడాయన.
పది రోజులుగా వూర్లో తిరుగుతున్నాడు రాజు. ఏనాడూ ఈ మొఖాన్ని ఎరిగి వుండలేదు. ఏమో ముసలాడు కదా ఇంటినుండి బయటికి వచ్చి వుండడు. తను చూసి వుండక పోవచ్చు అనుకుని “ఈడికే తాత కొంచెం పనుంది.” అన్నాడు మొహమాట పడుతూ.
“పో. . . పో . . . . నీ పని సక్కరంగా జరుగుతుంది పో” అన్నాడు వక్కాకు నోట్లో నములుతూ..
ఆ ముసలి మహానుభావుడు చచ్చి పదేళ్లకు పైనే అవుతాంది. అది మనోడికి తెలీదు. మాట్లాడింది మనిషే అనుకుంటున్నాడు. చంద్ర బవన ప్రదేశాన్ని చేరుకోవాలనే ఆలోచనే తప్ప మరొకటి లేదు.
శంకర్రావు గారి బావి దాటుతుంటుంటే సుట్రగాలి హోరున వీచింది. దానికి దారిలో అడ్డం వచ్చిన ప్రతిదాన్ని పైకిలేపుతూ రాజు మీదకు వచ్చింది.ఆ గాలి వుదృతానికి చిన్న చిన్న రాల్లు ఎగిరి రాజు మీద పడ్డాయి. కన్నుల్లో పడకుండా ముఖాన్ని చేతులతో అడ్డం పెట్టుకున్నాడు. ఆ గాలి అతన్ని దాటి వెళ్తుండగా ఆడవారి నవ్వు లీలగా వినపడింది. “థూ. . . .” అని తిట్టుకుని కదిలిపోయాడు.
శంకర్రావు పెద్ద కోడలు ఆ బావిలో పడి చచ్చిపోయిందని అంటుంటారు. రాత్రి పూట వంటరిగా పయనించే మగాళ్లని ఆపి బయపెడుతూ వుంటుందంటారు. రాజు కనపడని వాటికి బయపడే వాడు కాదు. బయంకరంగా కనిపించే వాటికి మొదట్లో జడిసినా ఆ తరవాత తేరుకుని ఆ భయాన్ని దాటేయగలడు.
రాజు సుట్రగాలికి బయపడకపోయే సరికి మానవ రూపాన్ని దరించి ఎదురు వచ్చింది. వాలు జడ వేసుకుని, మల్లెపూలు పెట్టుకుని, బొడ్డుకిందికి చీర కట్టి, వయ్యారంగా నడుచుకుని ఎదురొచ్చింది. “ఏరోయ్ పిల్లగా, యాడికి పోతాండావు ఒగనివే” అని వగలు పోయింది. ఆ ఒంపు సొంపులు అధికంగా కనపింప జేస్తూ, ఎర్రటి పెదాలను కొరుకుతూ అడుగుతున్న ఆమెను చూడగానే రాజుకి నవ్వొచ్చింది. ఆమె అంత అందంగా కనపడినా ఆమె నడివయసులో వున్న ప్రౌడ రూపాన్ని రాజు ముందర వుంచింది.
రాజు కన్య పిల్లలను తప్పితే వేరే ఆడవారిని ఆ దృష్టితో చూసే వుద్దేశం ఎప్పుడూ వుండదు. “యాడికి పెద్దమ్మా వచ్చేది. ఇంత రాత్రి పూట ఒగ దానివే ఏమ్ జేస్తాండావు. పెద్దయ్య లేడా” అన్నాడు.
వాడు పెద్దమ్మ అనగానే ఆమెకు కోపం నశాలానికి తాకింది.”ఏరా నీకు పెద్దమ్మ లాగ కనిపిత్తాన్నానా నీకు” అని అరిచింది. బయంకరమైన ఆమె అరుపు వినగానే రాజు గుండెలు అదిరిపోయాయి. జుట్టు విరబోసుకుని, కళ్లను అగ్ని గోలాలుగా జేసుకుని మిందికి దూకింది. రాజు గట్టిగా కేక పెట్టి నెత్తి మీద చేతులు పెట్టుకుని కూర్చుండి పోయాడు. ఎంత సేపు ఎదురుచూసినా ఆమె అతన్ని తాకక పోయే సరికి కల్లు తెరిచి చూశాడు. ఎదురుగా ఆమె లేదు. బ్రమా అనుకున్నాడు. కానీ ఆమెను తను చూశాడు. చుట్టూ తిరిగి చూశాడు. ఆమె ఎక్కడా కనపడలేదు.
గుండెల్లో రేగుతున్న భయాన్ని కొద్దిగా చల్లరే వరకు మెల్లగా నడిచి, భయం కొంచెం తగ్గాక వేగం పెంచాడు. ఈసారి ఎవరు పలకరించినా పలక్కూడదనే నిర్ణయానికి వచ్చాడు. చంద్ర భవనం ఆవరణని చేరుకుంటుండగా ఆడపిల్లల నవ్వులు వినిపించాయి.
అడుగు ముందుకు వేయకుండా ఆగిపోయాడు. పక్కనే వున్న రాతిని మొరుగు చేసుకుని నిక్కి చూశాడు ‘ఎవరా నవ్విందని’.
ఒక రాతిని పీఠలాగ చేసుకుని ఒక నడివయసులోనున్న ఆడది కూర్చుని వుంది. ఆమె చేతిలో చేట. ధాన్యాన్ని చెరుగుతొంది. ముందర ఇద్దరు ఆడపిల్లలు ఆడుకుంటున్నారు. పరికిణి వేసుకుని వున్నారు. పెట్టేలు గీసి వాటిలో ఒక చిన్న పెంకుని వేసి కుంటుతున్నారు. తొక్కుడు బిళ్ళ.
“ఆ నీ ఆట అయిపోయింది. నువ్వు గీత తొక్కావు” అనింది ఒక పిల్ల. “లేదు నీ నేను తొక్కలేదు” అని వాదించింది ఇంకో పిల్ల.
“అత్తా సూడు అక్క అబద్దాలు చెబుతొంది. అది గీత తొక్కినా తొక్కలేదని అంటొంది” అని ఆ పెద్దావిడకి కంప్లయింట్ చేసింది.
“నువ్వే అబద్దాలు చెప్తొండేది” అనిందా పిల్ల.
“నువ్వే’
“నేను కాదు నువ్వే”
“కాదు నువ్వే”
ఇలా వారు వాదించుకుంటుంటే “అబ్బ బ్బా . . . . ఆపండే రండి ఇంట్లోకి పోదాం” అని జబ్బలు పట్టుకుని లాక్కుపోయింది.
వాళ్లు పొతూ పొతూ కూడా ‘నువ్వే’ . . .’నువ్వే’ . . . అని వాదించుకుంటున్నారు. “ఆవ్వవ్వవ్వ. . . ” అని ఒక పిల్ల ఇంకో పిల్లని ఎక్కిరించింది.
రాజు వారిని చూసి నవ్వుకున్నాడు.
పీఠ లాంటి రాతిని దాటి లోపలికి పోగానే కనపడకుండా పోయారు. వెంటనే తలుపు వేసిన చప్పుడు. అక్కడ ఎటువంటి తలుపులు లేవు కానీ తలుపులు మూసిన చప్పుడు రాజుకి ఒక్క క్షణం పాటు ఏమి అర్థం కాలేదు.
అక్కడికి వెల్లి తలుపులు ఏమైనా వుండాయేమో చూడాలని అనిపించినా భయం మూలంగా ముందుకి అడుగు వేయలేక పోయాడు. అసలికే ఒక అనుభవం అతన్ని బెదరగొట్టేసింది. ఇప్పుడో రెండో అనుభవానికి సిద్దంగా లేడు. అందుకనే వాళ్లంతకి వాళ్లు తనకి కనిపించే వరకు వేచి చూశాడు.
* * * * * * * * * * * * * * * * * * * * * * * *