చీకట్లో హాస్టల్ మేడ మీదకి వెళ్లి ఒక్కటే ఏడుస్తూ కూర్చుంది. ఎవరికి చెప్పుకోవాలో అర్ధంకాలేదు. బాధని పంచుకుంటే పక్కకెళ్లి నవ్వుకునేవాళ్ళు, చులకనగా చూసేవాళ్ళు తప్ప ఒక్క మంచి స్నేహితురాలు కూడా కనిపించలేదు ఈ సిటీలో
అమ్మా నాన్న గుర్తొచ్చి చున్నీతో మొహం తుడుచుకుని వాళ్లకి ఫోను కొట్టింది. ఇంట్లో ఫోను లేదు. పక్కింటి ల్యాండ్ లైన్ నెంబరుకి ఫోను చేస్తే అమ్మ వాళ్ళని పిలుస్తారు. ఎప్పుడైనా వాళ్లె మాట్లాడాలనుకుంటే రింగ్ ఇస్తే కట్ చేసి శశికళ తిరిగి చేస్తుంది.
అవతల నుంచి శశికళ నాన్న “ఏమ్మా.. బాగున్నావా, గత కొన్ని రోజులుగా నీ నుంచి ఫోను రాకపోయేసరికి అమ్మ భయపడిపోయింది.” ##### శశికళకి ఏడుపు వస్తున్నా ఆపుకుంది, “అలా ఏం లేదు నాన్నా, ఫోనులో రీఛార్జ్ అయిపోయింది. కుదరక చేయించలేదు” అని వణుకుతూనే మాట్లాడింది.
“ఏరా.. జ్వరం వచ్చిందా, ఏమైందమ్మా ?”
శశికళ వెంటనే ఏడుపు మొహం పెట్టి ఏడ్చేసింది. “లేదు నాన్నా.. జలుబు చేసింది. టాబ్లెట్స్ వేసుకున్నాను.” అటువైపు శశికళ అమ్మ ఫోను లాక్కుంటూ “వేడి పాలల్లో మిరియాలు కలుపుకుని తాగవే, అదే తగ్గిపోద్ది” అని గట్టిగా చెపుతుంటే శశికళ కళ్ళు తుడుచుకుంటూ “అలానే మా” అంది.
శశి : అమ్మా నేను రేపు మళ్ళీ చేస్తాను. ఉంటానే..
శశికళ అమ్మ “సరే.. జాగ్రత్త” ఆ వెంటనే శశి నాన్న కూడా “జాగ్రత్తరా” అని చెపుతుంటే ఫోను కట్ చేసింది. కొంచెంసేపు అటు ఇటు తిరిగాక అన్నం తినాలనిపించలేదు, పడుకుందాం అని వెళుతుంటే ఫోను మొగడం చూసింది, రాజు..! ఎత్తింది కానీ ఏం మాట్లాడలేదు.
రాజు : హలో శశి..?
శశి : చెప్పండి
రాజు : అలా మాట్లాడకు శశి, దూరంగా అనిపిస్తుంది. ఇప్పుడే నాకు మణికి పెద్ద గొడవ అయ్యింది, నీ విషయంపై కొట్టుకునేదాకా వెళ్ళింది శశి
శశి : నాకోసం మీరు గొడవపడకండి
రాజు : అలా అంటావేంటి శశి.. నీకోసం నేనేమైనా చేస్తాను. వాడి కోసం నా ప్రేమని కూడా చంపుకున్నాను
శశి : నాకు తల నొప్పిగా ఉంది, పడుకుంటాను
రాజు : అలాగే.. నేను మళ్ళీ చేస్తాను అని ఫోను పెట్టేసాడు.
శశి ఫోను కట్ చేసాక తనకేం చెయ్యాలో అర్ధంకాలేదు. రాజు నిజంగానే ప్రేమించాడా.. తల అటు ఇటు ఊపుతూ అస్సలు ఇదంతా మర్చిపోవాలి అని పడుకోవడానికి వెళ్ళింది. ఎంత ఆలోచించినా మణి మీద కోపం పెరుగుతుందే తప్ప తగ్గడంలేదు. వాడిని ఏదో ఒకటి చెయ్యాలి అఖిల ఆలోచిస్తుంటే పది నిమిషాలకి రాజు నుంచి ఫోను రాగానే మాట్లాడాలని లేకపోయినా విసురుగానే ఎత్తింది.
రాజు : నేను మీ హాస్టల్ బైట ఉన్నాను
శశి వెంటనే లేచి బైటికి వచ్చి కింద తొంగి చూసింది. రాజు నవ్వుతూ చెయ్యి ఊపాడు. శశి వెంటనే చున్నీ వేసుకొని కిందకి వెళ్ళింది. శశి నోట మాట వచ్చేముందే రాజు జేబులోనుంచి తలనొప్పి మాత్రలు తీసి చూపించాడు. శశికి వెంటనే అర్ధమయ్యి థాంక్స్ చెపుతూ తీసుకుంది, వెంటనే మళ్ళీ జేబులో నుంచి చాక్లేట్ తీసి శశి చేతిలో పెట్టాడు. శశి ఇబ్బందిగా చూసేసరికి, రాజు “కొంచెం నవ్వు శశి, నేను ప్రశాంతంగా నిద్ర పోతాను” అన్నాడు ప్రేమగా
శశి, తన గొంతులో తీవ్రత పెంచుతూ “నీ వల్ల కడుపు వచ్చింది, నిజంగానే నన్ను ప్రేమించి ఉంటే నన్ను పెళ్లి చేసుకో” అని రాజు వంక చూసింది. రాజు నిర్ఘాంతపోయాడు, వాడి మొహంలో ఆశ్చర్యం, భయం చూసి వాడి వాలకం అర్ధమయ్యి కోపంగా చూస్తూ “ఇంకెప్పుడు నాకోసం రావద్దు” అని ఖరాఖండిగా చెప్పేసి టాబ్లెట్స్, చాక్లెట్ రెండు బండి ట్యాంకు కవర్ మీద పడేసి హాస్టల్ లోపలికి వచ్చేసింది శశి.
రాజు అక్కడే చాలాసేపు ఉన్నాడు. తన ప్లాన్ ఇంత త్వరగా బెడిసికొడుతుందని ఊహించలేదు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శశి మాత్రం ఏడుస్తూ కూర్చుంది.
తెల్లారి పొద్దున్నే లేవకముందే రాజు దెగ్గరి నుంచి ఫోను చూసేసరికి కోపం వచ్చి తిడదామని ఫోను ఎత్తింది.
రాజు : కిందే ఉన్నాను
