టైం మెషిన్ – Part 3 103

ఉదయం తన గుడిసెలో నిద్ర లేచాడు మల్హోత్రా..
చాలా కాలం తర్వాత ఒక వింతైన ఉదయాన్ని చూస్తున్నాడు. తన చిన్నతనంలో తనకి బాగా పరిచయమైన ఉదయం.
కళ్ళు తెరవగానే ఎదురుగా పెద్ద చెట్టు. దాని మీద వాలుతూ ఎగురుతూ ఆహార వేటకు వెళ్తున్న పక్షులు.
ఎరుపు రంగుకు నిర్వచనం ఇస్తూ మెల్లిగా ఉదయిస్తున్న పెద్ద సూర్యుడు..
ప్రకృతి ఎంత అందంగా ఉంది?
మనం ఎందుకు ఈ అందాన్ని ఆస్వాదించలేక కాంక్రీట్ అడవులలో మృగాల్లా ఎంతకీ తనివితీరని ఆకలితో కొట్టుమిట్టాడుతున్నాం.
అయినా తనకి జీవితం విలువ తెలిసింది కాబట్టి ఇప్పుడు అర్థం అవుతుంది.
కానీ ఇవన్నీ ఆలోచించేదెవరు?
లేచి ఒక వేప పుల్ల తీసుకుని దంతావధానం ముగించాడు.
ఎదురుగా ఉన్న ఒక టీ కొట్లో కూర్చుని వాడు ఇచ్చిన మల్లెపూలవంటి తెల్లని ఇడ్లీలు నాలుగు పొగలు కక్కుతుండగా కమ్మటి చెట్నీలో అద్ది కడుపులో వేసుకున్నాడు.
ఒక్కసారిగా ఏదో తెలియని ఒక మధురానుభూతిని పొందుతూ ఇలాంటి ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటే చాలు కదా అనిపించింది.
“ఎవరు బాబూ నువ్వు?” అంటూ ఒక ఆత్మీయమైన పలకరింపుతో ఒక ముసలాయన వెనకనుంచి భుజం మీద చెయ్యి వేసాడు.
వెనక్కి తిరగ్గానే రహీం చాచా..
“రహీం చాచా?” అంటూ అలాగే పొదివి పట్టుకుని వెచ్చని కన్నీళ్లు చెంపల నుంచి కారుతుంటే “నేను చాచా.. మల్హోత్రాని. రిజ్వానా అక్కతో ఆడుకునే వాడ్ని. గుర్తు పట్టావా?” అన్నాడు.
“బేటా ఎందుకు గుర్తు లేవు.. నీకు ఇష్టమైన మిఠాయి ఇస్తాను తింటావా?” అంటూ చెయ్యి పట్టి తీసుకుపోయాడు.
మల్హోత్రా రహీం వెనకాలే నడుస్తున్నాడు.
కొంత దూరం వెళ్ళాక అక్కడ ఎవరూ లేరని నిర్దారించుకుని సర్రున పక్కకు లాక్కుపోయాడు.
“ఏమైంది చాచా?” అన్నాడు మల్హోత్రా అయోమయంగా.
“బేటా రెండు రోజుల క్రితం ఇక్కడికి ఎవరో వచ్చారు. నీ పేరు చెప్పి నీ కోసం వాకబు చేశారు. ఎవరూ తెలీదు అనేసరికి ఇది నీ స్వస్థలం అని ఇక్కడికి వస్తే ఫోన్ చెయ్యమని నంబర్, నీ ఫోటో ఇచ్చి వెళ్ళారు. ఈ పాటికి నీ గురించి తెలిసిపోయి ఉంటుంది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి దాక్కో” కంగారుగా చెప్తున్నాడు రహీం చాచా.
ఇంతలో దూరం నుంచి టొర్నాడో వస్తున్నట్టు దుమ్ము గాలిలోకి ఎగసిపడుతుంది.
“వౄమ్.. వ్రు…….. మ్” అంటూ కార్లు దూసుకొస్తున్నాయి..
రహీం చాచా తన గదిలోకి తీసుకుపోయి దాచేసాడు. బయటకి వచ్చి షాప్ లో కూర్చున్నాడు.
కార్లు సర్రుమని బ్రేక్ కొట్టి సెంటర్ లో ఆగాయి.
వాళ్ళని అక్కడ ఉండే గురునాథ్ సింగ్ అనే వ్యక్తి వచ్చి కలిసాడు.
“ఎక్కడ ఉన్నాడు?” అని అడిగాడు అక్కడకి వచ్చిన వాళ్ళ నాయకుడు.
అక్కడ దగ్గర్లో ఉన్న గుడిసె చూపించాడు సింగ్.
లోపలికి వెళ్ళి మొత్తం వెతికారు.

ఒక బట్టల బ్యాగ్, కొంత డబ్బు తప్ప ఇంకేమీ లేవు అక్కడ.

బయటకి వచ్చి ఆ గ్యాంగ్ నాయకుడు గర్జించాడు.
“ఎక్కడ్రా ఈ ముసలాడు?”
“ఏమో సాబ్ రాత్రి ఇక్కడే పడుకున్నాడు. ఉదయం ఎటు వెళ్ళాడో తెలీడం లేదు” అన్నాడు వణుకుతూ సింగ్.
వాడ్ని ఒక్క నెట్టు నెట్టి దగ్గర్లో ఉన్న రహీం చాచా దుకాణానికి వచ్చి అడిగాడు.
అప్పుడే రహీం చాచా కూర్చుని ఉన్నాడు.
“తాతా.. ఈ వ్యక్తి ఎటువైపు వెళ్ళాడు?” అడిగాడు.
“ఇతను మా మల్హోత్రా కదూ?” కళ్ళజోడు సరిచేసుకుంటూ అడిగాడు రహీం.
“హా అవును వాడే.. ఎక్కడున్నాడు?”
“ఇంతకు ముందే ఢిల్లీ వెళ్తున్నా అని చెప్పి బయల్దేరాడు. మరి మిగిలిన వివరాలేవి నాకు తెలీదు” అన్నాడు.
ఢిల్లీ వెళ్ళే లోపు మల్హోత్రాని పట్టుకోవాలని వాళ్ళు వేగంగా బయల్దేరారు కార్లు ఉరికించుకుంటూ.
“హమ్మయ్యా..” అనుకుని రహీం లోపలివైపు మల్హోత్రా ఉన్న గదిలోకి వెళ్ళాడు.
రహీంని చూడగానే మల్హోత్రా కళ్ళు కృతజ్ఞతతో తడిసి ముద్దయ్యాయి.
రహీం కాళ్ళ మీద పడి “మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలే ఉంది అని నిన్ను చూసాక నమ్మకం కలిగింది చాచా. థాంక్స్” అంటూ కన్నీళ్ల పర్యంతం అవ్వసాగాడు.
“పర్వాలేదు బేటా.. ఇప్పుడు ఎలా వెళ్తావు?” అన్న రహీం మాటలకు ఫోన్ తీసుకుని హార్ధిక్ కి కాల్ చేసాడు.

############

జరిగింది విన్న హార్ధిక్ ఒక్క క్షణం ఆలోచించి. “నేను నెక్స్ట్ ఫ్లైట్ కి బయలుదేరి వస్తున్నా. మీరు అక్కడ ఉండద్దు. ఏదైనా వెహికల్ తీసుకుని నోయిడా వచ్చెయ్యండి. జాగ్రత్త. ఎవరి కంటా పడకండి” అంటూ ఫోన్ పెట్టేసి వడివడిగా బయలుదేరాడు టూటూని తీసుకుని.
తన పర్సనల్ ఛాపర్ 2నిమిషాలలో వచ్చేసింది.
అందులో ఎక్కి కూర్చున్నాడు హార్ధిక్. టూటూ దానిని వింతగా చూస్తూ హార్ధిక్ ని అనుసరించి కూర్చున్నాడు.
క్షణాల్లో గాల్లోకి లేచింది ఆ హెలికాప్టర్.

మల్హోత్రా బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. రహీం చాచా వచ్చి “ఎలా వెళ్తావు బేటా?” అని అడిగాడు. “బయటికెళ్ళి ఏదైనా వెహికల్ చూసుకుంటాను చాచా” అని చెప్పాడు మల్హోత్రా.

ఈ సమయంలో నువ్వు ఎవరికంటా పడటం అంత మంచిది కాదు అని లోపలికెళ్లి తన కోడలి బురఖా ఒకటి తీసుకువచ్చి వేసుకోమన్నాడు.
మల్హోత్రా మారు మాట్లాడకుండా అందులోకి మారిపోయాడు.
ఎందుకైనా మంచిదని వేసుకున్న షూ విప్పించేసి ఉత్తి కాళ్ళతో వెళ్ళమని ఖాళీ సంచి ఒకటి చేతికిచ్చి తన కొడుకుని పిలిచాడు.
“హా బాబా” అంటూ రహీం కొడుకు ఫైజల్ లోపలికి వచ్చాడు.
“బేటా షాప్ నేను చూసుకుంటూ. నువ్వు ఈ సార్ ని నీ బేగంని తీసుకెళ్తున్నట్టు బైక్ మీద తీసుకెళ్ళి నోయిడాలో దించేసి రా పో” అన్నాడు.
మల్హోత్రా వైపు తిరిగి “నీకు ఆ అల్లా మంచి చేస్తాడు. నువ్వు వెళ్ళిరా బేటా. జాగ్రత్త ” అంటూ సాగనంపాడు.
మల్హోత్రా రహీం చాచా ని గట్టిగా కౌగిలించుకుని “నాకు అంతా మంచి జరిగితే నిన్ను మాత్రం మర్చిపోను చాచా. వెళ్ళొస్తా” అంటూ అక్కడినుంచి బయలుదేరాడు.
మధ్య దారిలో హార్ధిక్ కి కాల్ చేసి రావలిసిన ప్లేస్ చెప్పాడు.
నోయిడా సమీపిస్తుండగా హార్ధిక్ ఛాపర్ ఆగి కనిపించింది మల్హోత్రాకి.
అదిగో అక్కడికే అంటూ వాళ్ళున్న వైపు చూపించాడు ఫైజల్ కి.