రాహుల్ నేరుగా వెళ్లి, హాలు మధ్యలో ఉన్న సోఫాలో కూచున్నాడు.
బూటుల్లోనించి పాదాలను బయటకు తీస్తూ, రాహుల్ చెప్పాడు – “సిస్టమ్స్ ను నాకు అప్పగించి, నువ్వు వచ్చేసిన కొద్దిసేపటికే వాళ్లు వచ్చారు.”
రాహుల్ పక్కన ఎడమగా కూచుంటూ – “సిస్టమ్స్ ఎలా ఉన్నాయన్నారు?” అడిగింది సంజు.
టీపాయ్ మీద నున్న మాగ్జెన్ ను అందుకుంటూ, “నువ్వు ఫిట్ చేశావుగా. వాటిలో ఇంకా తేడాలుంటాయా!” చెప్పాడు రాహుల్.
“మరి, అందుకు నీ సహకారం ఎంతో”
“స్కేలుతే” అన్నాడు రాహుల్.
“ఎందుకు?” అడిగింది సంజు.
“కొలిచి చెప్తా.” చెప్పాడు రాహుల్, తమాషాగా.
చిలిపిగా నవ్వేసింది సంజు.
చేతిలోని మాగ్జైన్ పేజీలు తిరగవేస్తూ, సంజు వంక చూస్తూ, “ఇంకా నువ్వు రిప్రెష్ కానట్టు ఉంది.” అన్నాడు రాహుల్.
“నేనూ ఇప్పుడే వచ్చాను. యూనిట్ నుండి వస్తుండగా మా డాడీ దార్లో ఎదురయ్యారు. ఇంటి తాళాలు ఇవ్వడానికి వస్తున్నారట.” చెప్పింది సంజు.
“ఏం, మీ మమ్మీ ఇంట్లో లేరా?” అడిగాడు రాహుల్.
“లేరు. పుట్టింటికి వెళ్లింది. ఎప్పుడూ జరిగేదేగా. పొరుగూరు కావడంతో చీటికి మాటికి అలిగి వెళ్లి పోవడం, కొద్ది రోజుల తర్వాత, ఈయనగారు వెళ్లి, బ్రతిమాలి, నచ్చచెప్పి, ఆవిడగారిని తీసుకు రావడం మామూలేగా.” చెప్పింది సంజు.
“ఈసారి మీ మమ్మీ ఎందుకు అలిగారు?” అడిగాడు రాహుల్, చిన్నగా నవ్వుతూ.
“మా మమ్మీ ఈ మధ్య తనకు తెలిసిన ఆవిడ వద్ద ఒక లేటెస్టు కాశీమాల నెక్లెస్ చూసిందట. అలాంటిది చేయించమందట. కుదరదని మా డాడీ చెప్పడంతో అలిగిందట.” చెప్పింది సంజు.
చేతిలో మాగ్జైన్ ను టీపాయ్ మీద పడేసి, “ఎంతో ఎబ్బెట్టుగా ఉంటోంది, వీళ్ల తంతు. మా మమ్మీ అహంతో పోయింది. మీ మమ్మీ అలకతో పోతోంది. ఇద్దరిదీ మూర్ఖత్వమే. మన తండ్రులది మరీ అలసత్వం.” అన్నాడు రాహుల్.
“అవును” అంది సంజు.
“మా ఫ్రెండ్ మురళి పేరంట్స్ కూడా ఇంతేనట.” చెప్పాడు రాహుల్.
“వాళ్లదేమిటి?” అడిగింది సంజు.
“వాళ్లది, ఎవరి సొద వాళ్లదట. ఇంటినే పట్టించుకోక, అనవసరమైన విషయాల్ని పట్టుకు వ్రేలాడుతారట. అనవసర క్యాంపులు తిరుగుతారట.”
“అవునా, ఈ పెద్దలకు ఈ మనస్తత్వాలేమిటో!” అంది సంజు.
“ఏమో, వీళ్ల గురించి ఏం చెప్పగలం. ఎలా సమర్థించగలం.” అన్నాడు రాహుల్.
“సర్లే, లే, రిఫ్రెషై రా. కాఫీ కలుపుతాను.” చెప్పింది సంజు, సోఫాలోనించి లేస్తూ.
రాహుల్ కూడా సోఫాలోనించి లేచాడు. వెళ్తున్న సంజును పిలిచాడు.
సంజు ఆగి, తిరిగి చూసింది.
