మదిలోని భావాలు 50

“నాకు కాఫీ వద్దు” చెప్పాడు రాహుల్.

“మరి” – సంజు.

“జూస్ కలుపవా” చెప్పాడు రాహుల్.

“ఏ జూస్?”

“నీ పెదాల జూస్”

“వాట్!”

“మరే, నే నడిగేది ‘ఆపిల్ స్లయిడ్’ల జూస్, సంజూ.”

“దాంట్లో కొత్తి మీర కట్ట మిక్స్ చెయ్యనా?”

“కొత్తి మీర కట్టా” – ఆశ్చర్యంగా అన్నాడు.

“మరే, నే నన్నది నీ ‘బొద్దు మీసం’ గురించి.”

క్షణం తర్వాత – ఇద్దరూ సరదాగా నవ్వుకున్నారు.

వారం తర్వాత, ఒక రోజు ఉదయం, మేడ మీద గది తలుపు తట్టింది సంజు.

తలుపు చప్పుడుతో నిద్రలోనించి బయట పడ్డాడు రాహుల్. లేచి, వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా సంజు.

“ఆయ్” అన్నాడు రాహుల్.

“డిటో” అంది సంజు, గదిలోకి వస్తూ.

“ఈ రోజు నువ్వు చాలా బాగున్నావు” అన్నాడు రాహుల్, సంజును పరిశీలనగా చూస్తూ.

“వాక్యంలో వెలితి ఉంది.” వెంటనే అంది సంజు.

రాహుల్ క్షణం షేక్ అయ్యాడు.

సుతిమెత్తగా నవ్వింది సంజు.

సర్దుకొని, చెప్పాడు, “ఈ రోజు కూడా నువ్వు చాలా బాగున్నావు.”

“దట్స్ గుడ్.” గలగల నవ్వేసింది సంజు. పిమ్మట –

“బ్రష్ చేసుకురా” చెప్పింది సంజు.

“ఎందుకు” – కొంటెగా అడిగాడు రాహుల్.

“ముద్దు ఇద్దామని” – అదే రీతిలో చెప్పింది సంజు.

“నిజమా” అన్నాడు రాహుల్, కళ్లు సాగతీస్తూ.

“నిజమ్” అంది సంజు, బుంగమూతితో.

“ఆ కొత్త థ్రిల్ నాకు తప్పక కావాలి.” అంటూ బాత్రూంలోకి వెంటనే దూరాడు రాహుల్.

తనలో తాను నవ్వుకుంది సంజు. పరికించి చూస్తోంది, ఆ గది అంతటిని. ఆమె దృష్టి టేబుల్ మీద ఉన్న రాహుల్ కళ్లద్దాలపై నిల్చింది.

నిముషాల్లో పని ముగించుకొని, తిరిగి వచ్చాడు రాహుల్ – “నేను రడీ” అన్నాడు, హుషార్ గా.

తలాడిస్తూ రాహుల్ కళ్లద్దాలను అందుకొంది సంజు.

“అవి ఎందుకు!?” అడిగాడు రాహుల్.

సంజు నవ్వుతూ, ఆ కళ్లద్దాలలో ఒక అద్దాన్ని రాహుల్ పెదాలకు ఆన్చి – “కదలకు” అంటూ ఆ అద్దానికి ఇటు వైపున తన పెదాలను ఆన్చింది, ‘ప్చ్’ అన్న గాఢమైన ధ్వనితో.

రాహుల్ కాస్తా జర్క్ అయ్యాడు. పిమ్మట ఏదో గమ్మత్తుకు లోనయ్యాడు.

అంతలోనే ‘ఇంటర్ కమ్’ మ్రోగింది. తేరుకుంటూ దాన్ని అందుకున్నాడు రాహుల్.

“ఇద్దరూ టీకి రండి” – రాఘవరావు చెప్పారు, కిందనించి. వెంటనే ఇంటర్ కమ్ కట్ చేసేశారు.

“సంజు, మీ డాడీ రమ్మంటున్నారు టీకి”

“రాత్రి మా డాడీ యూనిట్ అకౌంట్ పొజిషన్ ఎలా ఉందని అడిగారు, ఎందుకో.”

చెప్పింది సంజు.