మదిలోని భావాలు 50

“స్టిల్ యూ ఆర్ ఎ బ్యాచిలర్!” అన్నాడు మురళి.

“వై నాట్” అన్నాడు రాహుల్.

అంతలోనే అక్కడకు సంజు వచ్చింది.

“నీ కోసమే చూస్తున్నాను” అన్నాడు రాహుల్.

“దార్లో వెహికల్ ట్రబుల్ ఇచ్చింది. సరి చేయించుకొని వచ్చే సరికి లేట్ అయ్యింది.” అంటూ రాహుల్ పక్కనే, సీట్లో కూచుంది సంజు.

“సీ, సంజూ, ఇతను మురళి. ఇంటర్మీడియట్ చేసే రోజుల్లో నాకు పరిచయస్తుడు – మురళీ, ఈమె సంజు. ఈమె ఒన్ ఆఫ్ ది బెస్ట్ ఎచీవర్.” అంటూ వాళ్లను పరిచయం చేశాడు రాహుల్.

“హలో” అంది సంజు.

“హలో” అన్నాడు మురళి. అంతలోనే సంజు గురించి ‘ముట్టుకుంటె మాసి పోయే లాంటి ఒళ్లు, చూపును మరల్చుకోలేనంతటి అందం ఈమెది.’ అని అనుకో కుండా ఉండలేక పోయాడు.

“సంజూ, మురళి ఫ్రెండ్స్ తో కలిసి, గుంటూరులో ఒక చిట్స్ అండ్ ఫైనాన్స్ సంస్థను నడుపుతున్నాడట. దానిని కంప్యూటరైజ్డ్ చెయ్యాలనుకుంటున్నాడు. మన యాడ్ చూసి వచ్చాడట. మనం ఇతని అవసరాలను తీర్చాలి.” అన్నాడు రాహుల్.

“తప్పక” చలాకీగా అంది సంజు.

“నేను ఆల్ రెడీ ఇతని రిక్వైర్ మెంట్స్ ను సేకరించాను. లే – అవుట్స్ ను, ఎస్టిమేట్స్ ను తయారు చేశాను. ఒకసారి చూడు.” అన్నాడు రాహుల్, తన ముందున్న లాప్ టాప్ ను సంజు ముందుకు నెడ్తూ.

“అలాగే, రాహ్, ఈ రోజు డెలివరీ కావలసిన సిస్టమ్స్, రావ్ కో వారి ప్యాకేజి ఉన్నాయిగా. ఓకే కై వాటిని చెక్ చేశావా? లేకపోతే ఒకసారి చెక్ చెయ్యవూ.” అంది సంజు.

“అలాగే” అంటూ ఆ సెక్షన్ వైపు నడిచాడు రాహుల్, మురళిని తీసుకొని.

“మీ మధ్య బాగా చనువు ఉన్నట్టు ఉంది.” అన్నాడు మురళి, రాహుల్ తో.

“మా మధ్య సదావగాహన ఉంది.” చెప్పాడు.

రాహుల్ తనకు కేటాయింపబడ్డ పనిని చేస్తున్నాడు. రాహుల్ ఎదురుగా కూచుని, అతడు చేస్తున్న పనిని తదేకంగా చూస్తున్నాడు మురళి.

“సంజూ ఏమో వెరీ గుడ్ వర్కర్. ఆమెది సిన్సియర్ అండ్ ప్రాంప్ట్ వర్కింగ్.” అన్నాడు రాహుల్ – ఆమె రూపొందించిన ప్లాకేజీని పరిశీలిస్తూ.

అప్పుడే, “ఆమెను నీ ఉడ్ బి అనుకోవచ్చా?” అడిగాడు మురళి, చనువుగా.

జవాబు చెప్పలేదు రాహుల్.

క్షణమాగి, “సరే, నేను బయటకెళ్లి వస్తాను.” అన్నాడు మురళి, కుర్చీలోనించి లేస్తూ.

అదే రోజు సాయంకాలం –

తలుపు తెరిచింది సంజు.

“త్వరగానే వచ్చేశావు” అంది లోనికి వస్తూన్న రాహుల్ తో.