మదిలోని భావాలు 50

“కదూ … అన్నట్టు మా డాడీ, రాత్రి నీతో మీ పేరెంట్స్ విషయం మాట్లాడారట. ఇందాక నాకు తెల్సింది.” అంది సంజు.

“అవునవును, మాట్లాడారు.” అన్నాడు రాహుల్.

“మరే, మీ మమ్మీ అహంతోనే మీ పేరెంట్స్ దూరమైపోయారుగా.” ఆగి, అంది సంజు.

“ఉఁ. లివ్ ఇట్. నా మాటను పెడ చెవిన పెట్టిన రోజునే వాళ్లను పట్టించు కోవడం మానేశానుగా.” అన్నాడు రాహుల్, చిరాకుగా.

కొంచెం సేపు ఆగి, సంజు చెప్పింది, “సర్లే, ఒకసారి పెరటి వైపు మేడ పైకి రా.”

ఫోన్ లైన్ కట్ చేయబడింది.

రాహుల్ తల విదిలించుకొని, అటు వెళ్లాడు.

సంజు అప్పటికే పెరటిలోకి వచ్చేసింది. తలను కాస్తా వెనుకకు వంచుకొని, మల్లెల పొదను ఆనుకొని, నించుని ఉంది. జుత్తు ఆరబెట్టు కుంటుంది. భుజాల చుట్టూ పెద్ద టర్కీ టవల్ తిప్పి, దాని అంచులను గుండెకేసి అదిమి పట్టుకొని ఉంది. అది ఆమె మోకాళ్ల వరకు వ్రేలాడుతోంది.

రాహుల్ తదేకంగా సంజును గమనిస్తున్నాడు. ‘ఇట్టే ఆకట్టుకొనే రూపం సంజుది’ అనుకున్నాడు.

“ఏమిటి అంత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నావు?” అడిగింది సంజు కిందనించి.

‘నిన్నే’ అన్నట్టు సైగలు చేశాడు రాహుల్.

“అంత బాగున్నానా?” గమ్మత్తుగా కళ్లు తిప్పుతూ అడిగింది సంజు.

“చాలా బాగున్నావు” అన్నాడు రాహుల్.

“మరి, ఇప్పుడో?” అంటూ సంజు తన గుండెకేసి అదిమి పట్టుకున్న టవల్ అంచులను రెండు చేతులతో చెరో వైపుకు విడదీసింది. కొన్ని క్షణాల్లోనే మళ్లీ టవల్ అంచులను దగ్గరగా చేర్చేసింది.

రాహుల్ గొంతు తడి ఆరిపోయింది, ఆ క్షణాల్లో.

అప్పుడే సంజును పిలిచింది ఆమె తల్లి గిరిజ.

“ఆఁ. వస్తున్నా” అంటూ సంజు వెళ్లి పోయింది.

ఒక రోజు యూనిట్ లో – రాహుల్ చెబుతున్నాడు, తనకు పరిచయస్తుడైన మురళితో, “కంప్యూటర్ ఇంజనీరింగ్ అయిన తరువాత – స్వంతంగా ఈ యూనిట్ నిర్వహించాలన్న ఆలోచన నాకు వచ్చింది. సర్వేలో, ఈ ఊరులో యూనిట్ పెడితే బాగుంటుందని అనిపించింది. బట్, ఈ ఊరు నాకు కొత్త – ఏమీ తెలియదు. లక్కీగా ఇక్కడ రాఘవరావు గారని, మా డాడీ ఫ్రెండ్ ఒకరు జాబ్ చేస్తున్నారు. ఆయన సహకరించారు. అన్నీ వెంట వెంటనే సక్రమం గా జరిగి పోయాయి. నా అంచనా కంటే త్వరగానే యూనిట్ మంచి గుర్తింపు పొందింది.”

“కంగ్రాట్స్” చెప్పాడు మురళి.

“థాంక్స్” అన్నాడు రాహుల్ – కంప్యూటర్ లోకి డేటాను ఇన్ పుట్ చేస్తూనే.

“రెసిడెన్నీ ఎక్కడ?” అడిగాడు మురళి.

“రాఘవరావుగారి ఇంటిలోనే. వాళ్ల మేడ మీద గెస్ట్స్ పోర్షన్ ఉంది. అందులో ఉంటున్నాను.”