“ఏంటే వాడు నిన్ననే వచ్చాడు కదా వాడితో రాకుండా ఒక్కదానివి ఇప్పుడు వస్తున్నావ్” అంది మేఘన వాళ్ళ అమ్మ పద్మ
“అప్పుడే మొదలుపెట్టవా నీ అనుమానాలు” అంది మేఘన అసహనం గా
“ఎందుకే దాని మీద అలా పడిపోతావు ఇప్పుడే కదా వచ్చింది. నువ్వెళ్ళి స్నానం చేసి రాపో” అన్నాడు మేఘన వాళ్ళ నాన్న సుబ్బారావు.
మేఘన తన బట్టలు తీసుకొని స్నానానికి వెళ్ళింది. వచ్చేసరికి పద్మ టిఫిన్ రెడీ చేసింది. మేఘన తిని బెడ్ రూమ్ లోకి వెళ్లి కాసేపు పడుకుంది. ఈ ఆలోచనలతో నిద్రలేక ఇప్పుడు నిద్ర ముంచుకు వస్తుంది. లేచేసరికి మధ్యాహ్నం అయింది.
లేచి మొహం కడుక్కుని వాళ్ళ అమ్మ చేసిన భోజనం చేసి అలా టీవీ చూస్తూ కూర్చుంది.
“ఇప్పుడు చెప్పవే ఎందుకు ఈ రోజు వచ్చావ్” అంది పద్మ
“నాది నైట్ షిఫ్ట్ అమ్మ, అందుకే లేట్ అయింది” అంది మేఘన.
“రాత్రుళ్ళు కూడా పనులు ఉంటాయా?” అంది
“24 గంటలు ఉంటాయి” అంది
“ఒహ్హ్” అంటూ ఆశ్చర్యపోయింది.
కాసేపటికి మేఘన పైకి లేచి తన రూమ్ లోకి వెళ్లి బ్యాగ్ లో నుండి లక్షన్నర డబ్బుల కట్ట తీసుకొని వాళ్ళ అమ్మ ముందు పెట్టింది.
“ఏంటే ఇది?” అంది వాళ్ళ అమ్మ ఆశ్చర్యం గా
“మేము వర్క్ బాగా చేస్తున్నాం అని కట్టిన డబ్బు వెనక్కి ఇచ్చేసారు. మిగిలిన 50 వేలు ఇప్పటివరకు వచ్చిన శాలరీ లో దాచాను” అంది
“నా బంగారం” అంటూ పద్మ పైకి లేచి తన చేత్తో మెటికలు విరిచింది.
అది చూసి మేఘన నవ్వుకుంది. అన్నిటికి డబ్బే సమాధానం అని మరోసారి మనసులో అనుకుంది.
“సరే నేను జాన్ దగ్గరికి వెళ్ళొస్తాను” అని తన బ్యాగ్ లో ఉన్న ఇంకొక కట్ట తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళింది.
“ఎలా ఉన్నావ్ మేఘన” అంది మేరీ ఎదురు వచ్చి
“బాగున్నానే నువ్వెలా ఉన్నావ్?” అంది
“బాగున్నాను” అంది మేరీ
“అమ్మ వాళ్ళు లేరా?” అంది
“ఉంది ఆగు పిలుస్తాను” అని వాళ్ళ అమ్మ శాంతమ్మ ని పిలిచింది.
“బాగున్నావా మేఘన” అంటూ పెద్దగా మాట్లాడుతూ ఆమె వచ్చింది.
బెడ్ రూమ్ లో ఉన్న జాన్ కి ఆ మాట వినపడింది. బయటకు వచ్చి మేఘన ని చూడాలి అనుకున్నాడు కానీ ధైర్యం మాత్రం సరిపోలేదు.
మేఘన వెంటనే తన చేతిలో ఉన్న డబ్బుని శాంతమ్మ కి ఇస్తూ
“ఆంటీ ఇవి అప్పుడు మీరు మా జాబ్ కోసం ఇచ్చిన డబ్బు, మా వర్క్ వాళ్ళకి నచ్చి రిటర్న్ ఇచ్చారు. అది కాక దీంట్లో ఇంకొక 50 వేలు ఉన్నాయి అవి వాడు శాలరీ నుండి దాచిపెట్టిన డబ్బు, నేను లేట్ గా వచ్చా కదా అంతా నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసారు. అందుకే వాడి బదులు నేను ఇస్తున్నాను” అంది మేఘన
శాంతమ్మ సంతోషం గా వాటిని తీసుకుని
“ఇలానే కష్టపడి పని చేసి బాగా ఉండండి అమ్మ” అంది నవ్వుతూ.
“సరే ఆంటీ తప్పకుండా, నేను ఇంక వెళ్తున్నాను” అంది మేఘన
“అదేంటి అప్పుడే ఎందుకు వెళ్ళటం. భోజనం చేసి వెళ్ళు” అంది శాంతమ్మ
“ఇప్పుడే తిని వచ్చాను ఆంటీ” అంది మేఘన
“సరే అన్నయ్య పడుకుని లేపుతాను” అంటూ మేరీ వెళ్తుంటే
“పడుకున్నాడు గా తరువాత మాట్లాడతాలే” అంది మేఘన
ఇంక తిరిగి వెనక్కి వచ్చేసింది. జాన్ మనసు తన దగ్గర లేదు. అతని ఆలోచనలన్ని మేఘన చుట్టే తిరుగుతున్నాయి. వెళ్లి మాట్లాడాలి అంటే భయం గా ఉంది మరొకపక్క జాబ్ లేదు అన్న మేఘన మాటలు తన గుండెని ముల్లులా గుచ్చుతున్నాయి.
నాలుగు రోజులు మాములుగానే గడిచిపోయాయి. ఇద్దరు ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. ఇటు మేఘన కూడా జాన్ మాట్లాడతాడేమో అని ఎదురు చూసింది. కానీ జాన్ నుండి ఎలాంటి మాట వచ్చేది కాదు. మేఘన కనపడ్డా మొహం పక్కకి తిప్పుకుని వెళ్లిపోయేవాడు. అది చూసి తన మనసు ఇంకా బాధ పడింది. ఇంక అక్కడ ఉండలేక
“అమ్మ నేను రేపు వెళ్తున్నాను ఆఫీస్ వాళ్ళు రమ్మని పిలిచారు” అంది
“ఇంకో రెండు రోజులు ఉండొచ్చు కదా” అంది వాళ్ళ అమ్మ ప్రేమగా. తన కూతురు రూపాయి సంపాదిస్తుంది. తమ నమ్మకాన్ని పోగొట్టొలేదు అని పద్మ కి చాలా గర్వం గా ఉంది. డబ్బు వృధాగా ఖర్చు పెడితే తనకి నచ్చదు కానీ అలా అని పద్మ ఏం డబ్బు మనిషి కాదు కాకపోతే కొంచెం జాగ్రత్త ఎక్కువ.
“లేదమ్మా వెళ్ళాలి, మళ్ళీ వీలు చూసుకుని వస్తాను” అంది
