అది విని మనోహర్ చిన్నగా “నీకు ఏం చేయటం వచ్చురా?” అన్నాడు.
“దోస, ఇడ్లీ ఇవన్నీ బాగా చేస్తాను మామ” అన్నాడు జాన్
“ఇన్ని రోజులు ఎక్కడికి పోయావ్ రా బాబు. ఫుడ్ మీద ఇంకా ఎక్కువ సంపాదించొచ్చు, సరే మా షాప్ కి కొంచెం పక్కన ఇంకొక షాప్ ఖాళీగా ఉంది రా. ఆ ఓనర్ తో మాట్లాడి నేను సెట్ చేస్తాను కానీ ఇన్వెస్ట్మెంట్ మాత్రం నీదేరోయ్ నాకు సంబంధం లేదు” అన్నాడు మనోహర్
“ఎంత అవ్వొచ్చు మామ” అన్నాడు జాన్
“అడ్వాన్స్ లు, లోపల ఫర్నిచర్ అది, ఇది అంటూ ఒక ఒకటిన్నర వరకు అవ్వొచ్చు రా” అన్నాడు మనోహర్.
జాన్ కి వెంటనే మేఘన తన ఇంట్లో ఇచ్చిన లక్షన్నర గుర్తుకు వచ్చింది.
“హా మామ నేను అరేంజ్ చేసుకుంటాను కానీ సక్సెస్ అవుతుంది అంటావా? ఇప్పటికే ఒకసారి మోసపోయాను మామ” అన్నాడు జాన్ మెల్లగా
“సక్సెస్ అవుతుందా లేదా అనేది నీ చేతిలోనే ఉంటుంది మామ, నమ్మకంగా ముందుకు వెళ్ళాలి. బిజినెస్ అంటే ఒక రోజు బాగుంటుంది ఒక రోజు ఉండకపోవచ్చు. ఆ బాలేని రోజు కూడా తట్టుకోవాలి. నువ్వు చేసే వంటలు రుచిగా ఉంటే ఇంక నిన్నెవడు ఆపలేడు మామ, అది కాక మా షాప్ ఉన్న ప్లేస్ ఎంప్లాయిస్ బాగా తిరిగే ఏరియా. సో కస్టమర్స్ వస్తారా రారా అనే భయం అక్కర్లేదు. నువ్వు రుచిగా చేస్తే చాలు” అన్నాడు మనోహర్.
“తప్పకుండా చాలా రుచిగా చేస్తాను మామ” అన్నాడు జాన్
“సరే రా త్వరగా అమౌంట్ రెడీ చేసుకో, మళ్ళీ ఇంకెవరన్నా అది తీసుకుంటే కష్టం అవుతుంది” అన్నాడు మనోహర్
“ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను మామ, ఎల్లుండి ఇక్కడ ఉంటాను. కొంచెం అతనికి చెప్పి ఉంచు” అన్నాడు జాన్
“సరే మామ ఆల్ ది బెస్ట్ రా, ఆ షాప్ సంగతి నేను మాట్లాడతాను” అన్నాడు మనోహర్.
జాన్ సంతోషపడ్డాడు. వెంటనే తన బ్యాగ్ తీసుకొని బస్ స్టాండ్ కి బయలుదేరాడు. మరుసటి రోజు ఇంటికి చేరి ఇంట్లో డబ్బులు కావాలి అని అడిగాడు. ఇంట్లో వాళ్ళు ఎందుకు అని అడిగితే కొత్త ఉద్యోగం లో చేరుతున్నాను వాళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ కోసం అడిగారు. 3 నెలల్లో తిరిగి ఇచ్చేస్తారు అని చెప్పాడు. ఇంట్లో వాళ్ళు తన మాటలు నమ్మి డబ్బులు ఇచ్చారు. జాన్ వెంటనే హైదరాబాద్ బయలుదేరి మరుసటి రోజు మనోహర్ ని కలిసాడు.
మనోహర్ వెంటనే జాన్ ని తీసుకొని వెళ్లి షాప్ ఓనర్ కి పరిచయం చేసాడు. మనోహర్ వాళ్ళ షాప్ కి ఒక 50 అడుగుల దూరం అంతే. చూడటానికి బాగా వెడల్పుగా ఉంది. లోపల కుర్చీలు, టేబుల్స్ వేసినా మూడు వరసలు పడతాయి. నెలకి 25 వేల అద్దె, అంతా ఓకే అనుకున్నాక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాడు జాన్. తన దగ్గర ఉన్న డబ్బుల లో నుండి 75 వేలు తీసి ఓనర్ కి ఇచ్చాడు. వెంటనే మనోహర్ తన పాకెట్ లో నుండి రెండు లక్షలు తీసి టేబుల్ మీద పెట్టాడు. జాన్ కి ఏం అర్ధం కాలేదు. ఓనర్ వాటిని తీసుకొని ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
“ఏంటి మామ నువ్వు డబ్బులు ఇచ్చావ్?” అన్నాడు జాన్
“ఇప్పుడు అడ్వాన్స్ లు పెరిగిపోయాయి అంట మామ, మంచి డిమాండ్ ఉన్న ఏరియా కదా తగ్గను కాక తగ్గను అన్నాడు వాడు. నువ్వు నా మీద నమ్మకంతో ఇక్కడివరకు వచ్చావ్. మధ్యలో వదిలేస్తే బాగోదు కదా అందుకే నా డబ్బులు ఇచ్చాను. ఒక 6 మంత్స్ టైం తీసుకొని నా డబ్బులు నాకు ఇచ్చేయ్ రోయ్ లేకపోతే అయిపోతావ్” అన్నాడు నవ్వుతూ
జాన్ వెంటనే ఎమోషనల్ అవుతూ మనోహర్ ని వాటేసుకున్నాడు.
“ఇక నుండి నీ లైఫ్ చేంజ్ అవుతుంది మామ ఆల్ ది బెస్ట్” అన్నాడు.
“థాంక్స్ కూడా చాలా చిన్న మాట మామ” అన్నాడు జాన్ కళ్ల వెంట వస్తున్న నీళ్ళని తుడుచుకుంటూ.
“హాహా ఇంతకీ ఏం పేరు పెడదాం అనుకుంటున్నావు?” అన్నాడు మనోహర్
“మేఘన టిఫిన్స్ మామ” అన్నాడు జాన్
“అంటే మేమనుకున్నది నిజమే అన్నమాట” అన్నాడు నవ్వుతూ
“హాహా” అంటూ నవ్వేసాడు జాన్.
వెంట వెంటనే పనులని మొదలుపెట్టాడు. నాలుగు రోజుల్లోనే పని అంతా పూర్తి అయింది. మనోహర్ చేతుల మీదుగానే షాప్ ఓపెన్ చేయించాడు జాన్.
***** ***** ****** ****** ****** ****** *******
మరుసటి రోజు ఉదయాన్నే లేచింది మేఘన. ఫ్రెష్ అయ్యి జీన్స్, టీ షర్ట్ వేసుకుని కిచెన్ లోకి వెళ్లి టిఫిన్ ప్రిపేర్ చేసింది. కాసేపటికి ప్రియా, కిషన్ వచ్చారు బయటకి.
“ఏంటి మేఘన అప్పుడే లేచి అన్నీ పనులు చేసేస్తున్నావ్?” అంది ప్రియా
“నేను చిన్న పని మీద బయటకు వెళ్తున్నాను ప్రియా” అంది మేఘన
