శృంగార శతకము 2 458

ఇప్పుడీమె, నాకు స్పృహ లేనన్ని దినములూ నాకు వైద్యము చేయించినదనీ, నాకు స్వయముగా సపర్యలు చేసినదనీ, నా ప్రాణములు నిలిపిదనీ చెప్పుచున్నది. ప్రత్యుపకారముగా ఆమెను వివాహ మాడవలెనని నన్ను బలవంత పెట్టుచున్నది” అన్నాడు. అతడి దంతా చెబుతున్నంత సేపూ, రాజు శుద్దవర్మ అతడి వైపే చూస్తున్నాడు. మనస్సులో ‘ఇతడి ముఖవర్చసు చూడగా బ్రహ్మజ్ఞానిలా కనబడుతున్నాడు. అందం, విద్వత్తూ ఇతడిలో పోటీ పడుతున్నవి. సుగుణ శీలియైన ఇతడికి నా కుమార్తె చిత్రరేఖ నిచ్చి వివాహము చేసిన బాగుండును కదా?’ అని ఆలోచించినాడు.
[చిత్ర రేఖ అంటే చిత్రమైన రేఖ అని అర్ధం. ]

అతడిలా ఆలోచిస్తున్నప్పుడే, సభలోని మంత్రి, రాజ పురోహితుడూ కూడా సరిగ్గా ఇలాగే ఆలోచించారు. రాజు శుద్దవర్మ సభలోని శాస్త్రపురోహితులని, పెద్దలని… అలంకార వల్లి, చంద్రవర్ణుల తగువుని తీర్చమని అడిగాడు.

పండితులు “మహారాజా! అలంకార వల్లి వాదనలోనూ న్యాయముంది. ఆమె సమయానికి ఆదుకోకపోయి ఉంటే, చంద్రవర్ణుడు జీవించి ఉండేవాడు కాదు. చంద్రవర్ణుడి వాదనలోనూ న్యాయమున్నది. బ్రాహ్మణుడైన అతడు, వేశ్యాంగన అయిన అలంకార వల్లిని నిరాకరిస్తున్నాడు. అలంకార వల్లి పుట్టుకే, చంద్రవర్ణుడి అభ్యంతరమైతే ఇందుకొక తరుణోపాయముంది.

ఒక బ్రాహ్మణుడు ఇతర వర్గమునకు చెందిన స్త్రీని వివాహమాడదలిచిన ఒక మార్గమున్నది. అతడు అదే ముహుర్తమున ఒక బ్రాహ్మణ యువతినీ, క్షత్రియ యువతినీ, వైశ్య యువతినీ, శూద్ర యువతినీ వివాహ మాడవలెను.

అలాగ్గాక, బ్రాహ్మణుడు ఒక్క యువతనే వివాహమాడదలిచిన, ఆ యువతి బ్రాహ్మణ యువతియే అయి ఉండవలెను” అని తేల్చి చెప్పారు. రాజు శుద్దవర్మ “చంద్రవర్ణుని చూడ నాకు ముచ్చట కలిగినది. అతడి అందచందాలకు, గుణశీలాలకూ మెచ్చితిని. అందుచేత నా ఒక్కగానొక్క పుత్రికయైన చిత్రరేఖను, ఇతడికిచ్చి వివాహము చేయ సంకల్పించితిని” అన్నాడు, సాభిప్రాయంగా చంద్రవర్ణుడి వైపు చూస్తూ!

వెంటనే మంత్రి సోమశేఖరుడు లేచి “మహారాజా! నేనూ అట్టి ఆలోచననే చేసి ఉన్నాను. నేను వైశ్యుడను. నా పుత్రిక కోమాలాంగిని ఇతడి కిచ్చి వివాహము చేసేదను” అన్నాడు. [కోమలాంగి అంటే సుకుమారమైన దేహము కలది అని అర్ధం.]

అంతలో రాజపురోహితుడు లేచి “ప్రభూ! నేనూ నా కుమార్తె కళ్యాణిని ఇతడి కిచ్చి వివాహము చేయగలవాడను” అన్నాడు.

చంద్రవర్ణుడిందుకు సమ్మతించాడు. వధువుల సమ్మతి బడసి అందరూ సంతోషించారు. ఒక శుభముహుర్తమున బ్రాహ్మణ యువతి కళ్యాణి, వైశ్య యువతి కోమలాంగి, క్షత్రియ యువతి చిత్రరేఖ, శూద్ర యువతి అలంకార వల్లిలతో చంద్రవర్ణుడి వివాహం మహా వైభవంగా జరిగింది.

ఒక శుభముహుర్తమున బ్రాహ్మణ యువతి కళ్యాణి, వైశ్య యువతి కోమలాంగి, క్షత్రియ యువతి చిత్రరేఖ, శూద్ర యువతి అలంకార వల్లిలతో చంద్రవర్ణుడి వివాహం మహా వైభవంగా జరిగింది.
రోజులు హాయిగా గడుస్తున్నాయి. చంద్రవర్ణుడు తన మాట తీరు, నడవడికతో అందరి మనస్సులనూ ఆకట్టుకున్నాడు. అతడికి నలుగురు కుమారులు కలిగాడు. ఒకో భార్యకూ ఒకో పుత్రుడన్న మాట. బ్రాహ్మణ యువతి కళ్యాణి కన్న కుమారుడికి పల్లవర్షి అనీ, క్షత్రియ యువతి చిత్రరేఖ కుమారుడికి విక్రమాదిత్యుడనీ, వైశ్య యువతి కుమారుడికి భట్టి అనీ, శూద్ర యువతి అలంకార వల్లి కుమారుడికి భర్తృహరి అనీ, చంద్రవర్ణుడు నామ కరణం చేశాడు.