శృంగార శతకము 2 458

భర్తృహరి వెంటనే భటులని పిలిచి, ఆ పరిచారికని తన సముఖానికి రప్పించమని అజ్ఞాపించాడు. క్షణాలలో ఆమె రాజు ముందు ప్రవేశ పెట్టబడింది.

భర్తృహరి ఆమెను “చూడమ్మా! ఈ పండు నీకెక్కడిది?” అని అడిగాడు. ఉత్తర క్షణంలో పరిచారిక గడగడ వణుకుతూ “మహారాజా! క్షమించండి! అంతఃపుర రధసారధి సాహిణి నాకీ పండునిచ్చాడు. అతడికిది ఎలా వచ్చిందో నేనెరుగను” అన్నది.

రాజు సాహిణిని తీసుకు రమ్మన్నాడు. భటులదే చేశారు. అక్కడున్న పరిచారికనీ, దివ్యఫలాన్ని చూసే సరికే, సాహిణికి పైప్రాణాలు పైనే పోయాయి. అతడికి ప్రమాదం అర్ధమయ్యింది. “నేను సత్యాన్ని దాచిపెట్టలేను. అలా చేసినట్లయితే నిజం బైటపడ్డాకనైనా రాజు నా తల తీయించగలడు” అనుకున్నాడు.

భయంతో వణుకుతూ రాజు పాదాలపై పడ్డాడు. “మహారాజా! దయ చేసి నన్ను క్షమించండి. మహారాణి మోహనాంగీ దేవి నాకీ పండునిచ్చింది” అన్నాడు.

రథసారధి వాలకాన్ని బట్టి, భర్తృహరికి సత్యమేమిటో అప్పటికే బోధపడింది.

పరిచారిక నుండి పండుని గ్రహించి శుభ్రపరచమని దాసీలకు ఆజ్ఞాపించాడు. రధసారధినీ, పరిచారికనీ మన్నించి పంపించి వేసాడు.

పండు చేత బట్టుకొని రాణీ వాసానికి వెళ్ళాడు. మోహనాంగి చిరునవ్వుతో రాజుకు స్వాగతం పలికింది. ‘వేళ కాని వేళ ఎందుకు వచ్చాడా?’ అని మనస్సులో ఆలోచిస్తూనే ఉంది. ఇంతలో భర్తృహరి “మోహనాంగీ! నిన్నటి దినం నీకు నేనొక దివ్య ఫలాన్ని ఇచ్చాను కదా? అది ఎక్కడ?” అని అడిగాడు.

మోహనాంగి “దాని నప్పుడే ఆరగించాను మహాప్రభూ!” అంది.

భర్తృహరి గుంభనంగా “అయితే మరి ఇది నా చేతికి ఎలా వచ్చింది?” అన్నాడు.

భర్త చేతిలో పండుని చూసి మోహనాంగి దిగ్ర్భాంతికీ, భయానికీ గురైంది. ఏం జరిగి ఉంటుందో, ఏం జరగ బోతోందో ఆమె కర్థమయ్యింది. నిజం దాచి ప్రయోజనం లేదనిపించింది. మరుక్షణం భర్త పాదాల మీద వ్రాలి క్షమించమని ప్రార్దించింది.

భర్తృహరి స్వయంగా పండితుడు. జ్ఞాని. అతడామెపై కోపగించలేదు. అసలతడికి ఎవరి మీదా కోపం రాలేదు. ఇహలోకం మీద మాత్రం విరక్తి కలిగింది. అతడు తన భార్యల నందరినీ పిలిచి, “నేను అరణ్యాలకు పోయి తపస్సు చేసుకోవాలని నిశ్ఛయించుకున్నాను. ఈ క్షణమే మిమ్మల్ని త్యజిస్తున్నాను. మీరు మీ ఇష్టమైన చోటికి వెళ్ళవచ్చు. మీ నగలను, ఇతర సంపదను తీసుకుని, మీకు ఇష్టమైన వారిని వివాహమాడి, సుఖంగా ఉండండి” అంటూ రాణీ వాసపు స్త్రీలందరికీ అనుమతి నిచ్చాడు.

తన సోదరులైన విక్రమాదిత్యుని రాజు గానూ, భట్టిని మంత్రిగానూ పట్టాభిషిక్తులని చేసి, సన్యాసాశ్రమం స్వీకరించాడు. సోదరులిద్దరినీ మనస్ఫూర్తిగా దీవించి, దివ్యఫలం భుజించి, తపస్సుకై అడవులకు వెళ్ళాడు.

[భారతీయుల సంస్కృత సాహిత్యంలో భర్తృహరి సుభాషితాలు జగత్ర్పసిద్ది పొందాయి. కవితా ఝరితో నీతి, శృంగార, వైరాగ్యాలనే మూడు భాగాలుగా గల ఈ సుభాషిత త్రిశతి మనోహరంగా ఉంటుంది. ప్రకృతితో సరిపోల్చుతూ, కవితాత్మకంగా, మనో విశ్లేషణని సైతం వెలువరించిన భర్తృహరి శ్లోకాలను, తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి, తీయ తీయగా అనువదించాడు. ఆ సుభాషిత త్రిశతి కర్త ఈ భర్తృహరియే అని ప్రతీతి!

ఇక్కడ మరో అంశం ఆసక్తి కరమైనది…. చాంద్యోగ మహర్షికి దివ్య ఫలం లభించింది. దాన్ని భుజిస్తే జరామరణ భయం లేకుండా నిత్య యవ్వనులై జీవించవచ్చు. అయితే మహర్షి ‘ఆ విధంగా జీవించే తన వలన, ప్రపంచానికి లాభమేమిటి?’ అనుకొని పండు తెచ్చి రాజైన భర్తృహరికి ఇచ్చాడు.

భర్తృహరి దాన్ని, భార్య మీద ప్రేమ కొద్దీ, ఆమెకిచ్చాడు. చివరికి అదే పండు కారణంగా… ఇహలోక బంధాలను రోసి తపస్సుకై అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళేటప్పుడు పండు నారగించాడు. రాజుగా సుఖభోగ జీవితాన్ని ఆనందించేందుకు పండును భుజించడానికి ఇష్టపడని వాడు, అడవికి తపస్సు చేసుకునేందుకు వెళ్తూ భుజించాడు.