శృంగార శతకము 2 458

పిల్లలందరూ శుక్ల పక్ష చంద్రుడిలా దిన దిన ప్రవర్దమానమౌతున్నారు. వారికి విద్యాభ్యాసం చేయవలసిన వయస్సు రాగానే అక్షరాభ్యాసం చేయించారు. బాలురు చక్కగా విద్యల నభ్యసిస్తున్నారు. కాలక్రమంలో రాజు శుద్దవర్మ పరలోకగతుడైనాడు. అతడికి చిత్రరేఖ ఒక్కగానొక్క కుమార్తె అయినందున, ఆమె భర్త అయిన చంద్రవర్ణుడు కన్యాపురానికి రాజైనాడు. అతడి రాజ్య పరిపాలన ఆదర్శనీయంగా సాగుతోంది. ధర్మబద్దంగా రాజ్య పరిపాలన సాగిస్తున్నాడు. ప్రజలంతా ఎంతో ఆనందంగా కాలం గడుపుతున్నారు. వాతావరణమూ అనుకూలంగా ఉండి పంటలు బాగా పండుతున్నాయి. అంతటా ప్రశాంతమూ, సంతోషమే!

చంద్రవర్ణుడు ఒక ప్రక్క రాజ్యభారం వహిస్తూనే, మరో ప్రక్క తన తనయుల విద్యాబుద్దుల గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడు. తానే స్వయంగా విద్యలు నేర్పుకున్నాడు. [ఎవరైతే తల్లిదండ్రులే గురువులుగా, తల్లిదండ్రుల నుండి విద్యల నభ్యసించారో, వారు జీవితంలో మరింత సఫలీ కృతులయ్యారు, చరిత్రలో ప్రసిద్దులయ్యారు. భట్టి విక్రమాదిత్యులు తమ తండ్రి చంద్రవర్ణుని కంటే కూడా మరింత ప్రసిద్దులు. చంద్రవర్ణుడు, శాపవశాత్తు బ్రహ్మరాక్షసుడైన దివ్య పురుషుడి వద్ద విద్యలనభ్యసించినా, స్వయంగా తండ్రి వద్దే విద్యలనభ్యసించిన భట్టి విక్రమాదిత్యులు మరింత ఘనకార్యాలు సాధించారు.

తల్లిదండ్రులే గురువులైతే, పిల్లలు మరింత శోభిల్లుతారు. అంటే నేనిక్కడ గురువులను తక్కువ చేసి మాట్లాడటం లేదు. గురువులతో పాటు, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు గురుత్వం వహిస్తే, వారు మరింత వృద్దిలోకి వస్తారని చెప్పటమే నా ఉద్దేశం. మన భారతదేశ చరిత్రలో కూడా ఇందుకు ఎందరో మహానుభావులు ఉదాహరణలై నిలిచారు. ఛత్రపతి శివాజీ, తల్లి జిజియా భాయి నుండి స్ఫూర్తి పొందిన వాడే!

ఇప్పటికీ, ఎందరో కవి గాయక పండితులు, తమ అభిరుచి తల్లిదండ్రుల నుండీ సంక్రమించిందనీ, తొలి పాఠాలు తల్లి లేదా తండ్రి గారి నుండి నేర్చామనీ చెప్పటం మనం చూస్తూనే ఉన్నాం.] మరికొన్ని వసంతాలు గడిచాయి. చంద్రవర్ణుడి నలుగురు పుత్రులూ పెరిగి పెద్దయ్యారు, చంద్రవర్ణుడు వృద్దుడైనాడు. వార్ధక్య సహజంగా చంద్రవర్ణుడికి మరణకాలం సమీపించింది. మరణశయ్యపై ఉన్న చంద్రవర్ణుడు, తన చుట్టూ నిలిచి ఉన్న పుత్రులను చూసాడు. అతడి దృష్టి భర్తృహరి మీద నిలిచింది. తదేకంగా అతడి వైపు చూస్తూ కన్నుల నీరు నింపుకున్నాడు.

చుట్టూ ఉన్న అందరూ అది గమనించారు. ‘బహుశః చంద్రవర్ణుడికి అలంకార వల్లిపైన, ఆమె పుత్రుడైన భర్తృహరి పైన మమకారం మెండుగా ఉంది కాబోలు!’ అనుకున్నారు. భర్తృహరి తండ్రివైపే చూస్తున్నాడు. తండ్రి మనస్సులో మెదలుతున్న ఆలోచనలు భర్తృహరికి స్పురించాయి. అతడు మెల్లిగా తండ్రిని సమీపించి “తండ్రీ! మీరు దిగులు చెందకండి. సద్భాహ్మణ సంజాతులైన మీరు, శూద్ర వనిత యందు నన్ను కన్నందున, ఉత్తమగతులు పొందలేరేమో నని దుఃఖిస్తున్నట్లుగా ఉన్నారు. నేను మీకు ప్రమాణం చేస్తున్నాను. మీకు ఉత్తమ లోకాలు ప్రాప్తించుటకై నేను వివాహం చేసుకోను. అధవా వివాహం చేసుకున్నా, సంతానాన్ని పొందను. మీరు నిశ్చింతగా ఉండండి. మీకు ముక్తి కలుగుతుంది” అన్నాడు.

[వర్ణాశ్రమ నమ్మకాలు అప్పటి కాలంలో ఉండేవి. జానపద కథల్లోని అలాంటి ఘట్టాలను పట్టుకొని తింగరి హేతువాదులూ, తిక్క ఆధునిక వాదులూ వాదనలు చేస్తే…. వాళ్ళకి దండేసి దండం పెట్టడం తప్పితే ఏమీ చెప్పలేం!]

చంద్రవర్ణుడది విని ప్రశాంత చిత్తుడయ్యాడు. మిగిలిన పుత్రులని తన శయ్యకు దగ్గరగా రమ్మని పిలిచాడు. నెమ్మదైన కంఠంతో “నాయనలారా! నేను మీ తల్లులను వివాహమాడటానికీ, ఈ రాజ్యానికి రాజుని కావటానికీ, భర్తృహరి తల్లియైన అలంకార వల్లి యే కారణం. ఆమె నా ప్రాణదాత! కాబట్టి నాదో కోరిక! నా తర్వాత భర్తృహరి రాజు కావాలి. మీరంతా యువరాజులై అతణ్ణి సేవిస్తూ సహకరించండి” అన్నాడు.

భట్టి విక్రమాదిత్యులు వినయంగా తండ్రి ఆజ్ఞను స్వీకరించారు. పల్లవర్షి ఓ అడుగు ముందుకు వేసి “తండ్రీ! నన్ను మన్నించండి. నాకీ రాజ్య సంపద మీద గానీ, ఇహలోక సౌఖ్యం గురించి గానీ ఆసక్తి లేదు. నేను తపమాచరించి తరించ గోరుచున్నాను. కాబట్టి సన్యాసాశ్రమ వృత్తి స్వీకరించి, అడవులకు బోయి తపస్సు చేసుకో దలిచాను. దయయుంచి నాకు అనుమతి ఇవ్వండి” అని ప్రార్దించాడు.

చంద్రవర్ణుడికి పల్లవర్షి పరిణితి, భౌతిక ప్రపంచం పట్ల అనాసక్తి తెలుసు. అందుచేత అతణ్ణి అర్ధం చేసుకున్న వాడై, కుమారుణ్ణి దీవించి, అడవులకు పోయి తపస్సు చేసుకునేందుకు అనుమతించాడు. ఆపైన చంద్రవర్ణుడు మంత్రి పురోహితులను దీవించి, భర్తృహరిని రాజు గానూ, భట్టి విక్రమాదిత్యులను యువరాజులు గానూ పట్టాభిషేకం చేసేటందుకు తగిన అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు.