సేల్స్ స్టార్ 3 77

ఏదో కల్లో నడుస్తున్నట్టు మళ్ళీ నా ఆఫీసు కి నడుచుకుంటూ వొచ్చి పడ్డా. సాయంత్రం నాలుగవుతోంది. ఇంకో రెండు గంటల్లో డ్యూటీ అయిపోతుంది. అటెండెంట్ నా ఫోన్ ఏమీ రింగ్ అవలేదు అన్నాడు.

టైం గడిచే కొద్దీ నాకు నిరాశ ఎక్కువైంది. మిసెస్ సేన్ మాటలు ఒక జోక్ లా అనిపించాయి. ఆవిడ ఆ మాటలు మమ్మల్ని కొంచెం మోగించి చూద్దాం అన్న ఉద్దేశం తో అని ఉండచ్చు. అసలు అలాంటి పెద్ద పొజిషన్ లో నన్ను పెడతారనుకోవటం లో అర్థం కనిపించ లేదు. నేను ఇప్పుడు చేస్తున్న పనికీ, ఆ పనికీ అస్సలు సంబంధమే లేదు.

మనసు మళ్ళటానికన్నట్టు ఒక గంట సేపు ఫ్లోర్ మీద మషీన్లు, వాటి తిరిగే చక్రాల వైపు చూస్తూ పచార్లు చేశా. రచన తో అవ్వాళ పొద్దున్న అనాలనుకున్న మాటలు అనలేక పోవటం తలుచుకుని మనసు లో నన్ను నేనే తిట్టుకున్నా. అని ఉంటే, రోజు వేరే గా ఉండేదేమో.

ఐదున్నర అవుతుండగా, ప్యూన్ ఒకడు మా ఫ్లూర్ వైపు నడుస్తూ వచ్చాడు. వాడు సేన్ గారి ప్యున్ అని నేను వెంటనే గుర్తు పట్టా. వాడు ఆయన ఆఫీసు బయట కూర్చుని వుండటం ఇంతకు ముందే చూసా.

అంటే ఇది జరగబోతోంది అన్నమాట. కాకపోతే, మిసెస్ సేన్ ఎందుకు అమ్మ తో అబద్ధం ఆడుతుంది? నాకు నేనే పెద్ద గా ఇంపార్టెంట్ గా అనిపించాను. నా వైపు నడుచుకొస్తూ, వాడూ నా వైపు చూసాడు. సరిగ్గా నేను వాడితో ఏదో అనబోయే టైం లో వాడు ఆగకుండా తల తిప్పేసి, నన్ను దాటుకుంటూ, ఫ్లోర్ చివర వున్న నా బాస్ రూం వైపు నడక సాగించాడు.

ఇదంతా ఒక పెద్ద బుస్సే అనిపించింది. వాడు కాసేపాగి బయటికి వచ్చాడు. చేత్తో ఒక ఫైల్ పట్టుకుని, నా కాబిన్ ముందు గా నడుచుకుంటూ, నా వైపు కూడా చూడకుండా వెనక్కి వెళ్ళిపోయాడు.

నాకు ఇంక అక్కడ ఉండాలనిపించ లేదు. ఇంకా పదిహేను నిమిషాలు టైం వుంది, కాబిన్ లాక్ చేసి బయట పడ్డా.

ఇంట్లో కూడా పరిస్తితి మామూలు గా వుంది. అమ్మేం జరిగినట్టు చెప్పలేదు. మిసెస్ సేన్ ఏమీ ఫోన్ చేసినట్టు లేదు. ఎవరి తో మాట్లాడాలనిపించలేదు. డైరెక్ట్ గా పైకి వెళ్లి పోయా. మళ్ళీ భోజనం టైం కి కిందికి వచ్చి, తిని, పైకెళ్ళి పడుకుండి పోయా.