సేల్స్ స్టార్ 3 156

ఏ మూలో, మనసు లో ఆశ వుంది. సేన్ గారి ఫోన్ రావచ్చు అని. తెలీకుండానే, నా కళ్ళు అప్పుడప్పుడూ ఫోన్ వైపు వెడుతున్నాయి. సరిగ్గా లంచ్ కి కాంటీన్ కి బయల్దేరదాము అనుకుంటున్నా టైం లో ఫోన్ మోగింది.

గబగబా ఫోన్ ఎత్తాను. అది ఫ్లోర్ నించీ. ఏదో ప్రోబ్లం వచ్చింది అని పిలిచారు. అది చూసుకుని ఒక ఇరవై నిమిషాల్లో మళ్ళీ కాబిన్ కి వచ్చా. బయట కూర్చున్న అటెండెంట్ ని నేను బయటికి వెళ్ళినప్పుడు నాకు ఏమైనా ఫోన్లు వచ్చాయా అని అడిగా. “లేదు” అన్నాడు వాడు.

లోపల కూర్చోవటానికి మనసొప్పక లేచి బయటికొచ్చి, ప్రొడక్షన్ ఫ్లోర్ దాటి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు వైపు నడుచుకుంటూ వెళ్ళా. మషిన్ల చప్పుళ్ళూ, అవి ఏమీ లేకుండా, ఈ ఆఫీసు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా, వేరుగా వుంది.

మొదటి అంతస్తు లో రెడ్డి గారి ఆఫీసు, ఆయన స్టాఫ్ వుంటారు. పెద్ద కాన్ఫరెన్స్ రూంలు. అక్కడ ఉండే వాళ్ళెవరికీ, నేను తెలీదు. పొరపాటున రెడ్డిగారు ఎక్కడ ఎదురు పడతాడో అని భయం భయం గా నేను మెట్ల వైపు అడుగులేసా.

పై ఫ్లోర్ లో జనరల్ మేనేజర్ సేన్ గారి చాంబర్ రెడ్డి గారి ఆఫీస్ కి కరెక్ట్ గా పైన. చాంబర్ బయట పెద్ద నేమ్ ప్లేట్ “ఏ. సేన్. చీఫ్ జనరల్ మేనేజర్” పెద్ద గా రాసి వుంది. బయట ముగ్గురు ప్యున్లు కంపెనీ డ్రెస్ బ్లూ యూనిఫారం లో నుంచుని వున్నారు. చాంబర్ కి ఎదురుగుండా, వరస లో ఒక పక్క ఆయన కింద పని చేసే మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్ల రూంలు వున్నాయి. హాల్లో నన్ను ఎరిగిన వాళ్ళు ఒకరిద్దరు నన్ను చూసి తలూపారు గానీ, నా ఉనికి వాళ్లకి పట్టలేదు. కుడి పక్క మూడో రూం డోర్ కి ఇంకా “ఆర్. ఎస్. దుబే. మేనేజర్ ఎక్స్పోర్ట్స్” అన్న నేమ్ ప్లేట్ వుంది. అది చూసేసరికి నా గుండె ఝల్లు మంది. ఆ రూం ముందు నుంచీ నడుచుకుంటూ ముందుకి వెళ్లి, మళ్ళీ వెనక్కు వస్తూ అక్కడే కాసేపు పచార్లు చేసాను. ఆ రూం ఎదురుకుండా నా కింద.. అంటే, అదే, దుబే గారి కింద పనిచేసే జూనియర్ స్టాఫ్ ఆఫీసు రూం లు వున్నై. జూనియర్ స్టాఫ్ ఆఫీసుల్లోకి తొంగి చూసా. విశాలం గా వున్నాయి, నేను ఇప్పుడు వున్నా ఆఫీసు కంటే కూడా అవి పెద్దవే. ఒక టైపిస్ట్, ఇద్దరు క్లర్క్ ల ఆఫీసు లు కూడా వున్నై. నేను తొంగి చూడటం గమనించారు కానీ ఏమీ అనలేదు.

ఆ పై ఫ్లోర్ లో నా ప్రొడక్షన్ డిపార్టుమెంటు కి సూపర్ బాస్ వుంటాడు. నేను ఆ వైపు పోలేదు.

—————————————————————————