ఇలా ప్రపంచంలోని అందాలన్నీ నీలోనే ఉన్నాయి – 1 116

బావ: “అక్షర వద్దందని కాదు గానీ మావయ్యా… నిజంగానే మనకు ఎంగేజ్మెంట్ లాంటివి పెట్టుకునే సమయం లేదు”

నాన్న: ఎందుకని

బావ: వాళ్ళు పంతులుగారిని పిలిచి అడిగారట… ఇప్పట్నుండి 10 రోజుల వరకు మాత్రమే మంచి ముహుర్తాలు ఉన్నాయట… అవి దాటితే మరో నాలుగు నెలలు ఆగవలసి వస్తుందట..

నాన్న : మరీ పది రోజుల్లో అంటే ఏర్పాట్లు అవీ కష్టం కదా బాబూ…

బావ: పెళ్ళిఖర్చులు,మిగతా ఏర్పాట్లు అన్నీ వాళ్ళు చూసుకుంటామన్నారు మావయ్యా…

నాన్న: కట్నకానుకలు ఎలాగూ ఇవ్వట్లేదు… పెళ్ళిఖర్చులు కూడా మనం పెట్టుకోకుంటే బాగుండదు బాబూ… అవన్నీ మనమే పెట్టుకుందాం.. అమ్మాయికి కొన్ని నగలు కూడా చేయిద్దామనుకుంటున్నాను… డబ్బుది కాదు సమస్య..
ఇంత తక్కువ సమయంలో ఏర్పాట్లు చేయగలమా అని..

బావ: మేమంతా లేమా మావయ్య… ఈ రోజుల్లో అన్నీ రెడీమేడ్… ఆర్డర్ ఇస్తే రెండు రోజుల్లో అన్నీ అయిపోతాయి.. మీరు ఆ విషయంలో నిశ్చింతగా ఉండండి… అన్నీ నేను చూసుకుంటాను

నాన్న: మీరున్నారనే నాకూ ధీమాగా ఉంది బాబూ.. సరే కానివ్వండి..

బావ వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు ..
పది రోజుల తర్వాత ఉన్న డేట్ ఫిక్స్ చేయమని చెప్పాడు…
అక్కకి కూడా ఫోన్ చేసి చెప్పేసాడు…
సాయంత్రానికి అక్క ఇక్కడికి వచ్చేసింది..
అమ్మా, నాన్న బంధువులందరికీ ఫోన్లు చేసి పెళ్లికి రమ్మని చెప్తున్నారు… దాదాపు ప్రతి ఒక్కరికీ వచ్చిన సంబంధం గురించీ, తొందరగా చేస్తున్న కారణం గురించీ చెప్తున్నారు…
నేను ఇవేమీ పట్టించుకోవడంలేదు…
వీలైనంత వరకు ఏదో ఒక పుస్తకం చదువుకుంటూ హడావిడి నుండి తప్పించుకుంటున్నాను…
పెళ్లి ఇంకో వారం ఉందనగా షాపింగ్ కి వెల్దామన్నారు అమ్మా ,అక్కా..
నేను రాను మీరే వెళ్ళండి అన్నాన్నేను…
అదేంటే నీ పెళ్లి షాపింగ్ నువ్ రాకుంటే ఎలా అన్నారు…
మీకన్నా నాకెక్కువ తెలుస్తుందా అన్నాన్నేను..
“తెలియడం తెలియకపోవడం కాదు నువ్ రావాలంతే… నీక్కాబోయే అత్తయ్య గారు కూడా వస్తానంది… ఇప్పుడు నువ్ రాను అంటే నీకిష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారేమో అనుకుంటుంది ఆవిడ.. నోరు మూసుకుని రెడీ అవ్వు.. ఇంకో గంటలో ఆవిడ వచ్చేస్తుంది” అని వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పి వెళ్ళింది అక్క…

నేను ఇంక తప్పదన్నట్టు స్నానం చేసి సాధారణంగానే రెడీ అయ్యాను…
కొద్ది సేపటికి ఇంటి ముందు ఒక పెద్ద కారు ఆగింది…
అందులోంచి ఒక పెద్దావిడ దిగింది.. ఆమె వెనుక ఇంకో పాతికేళ్ల వ్యక్తి దిగాడు… ఆరడుగుల ఎత్తున్నాడు.. కళ్ళకి నల్ల కళ్ళద్దాలు ఉన్నాయి..
రింగులు తిరిగిన ఉంగరాల జుట్టు.. చామన ఛాయ అని మనం అనుకునే రంగు కన్నా కాస్త తెలుపే అనుకుంటా.. ఠీవిగా దిగి ఆమె వెంట ఇంట్లోకి వచ్చాడు…
“ఆవిడే నీక్కాబోయే అత్తయ్య” అంది నా చెవిలో మా అక్క…
అతని గురించి ఏమీ చెప్పలేదు…
బహుశా అతడేనేమో పెళ్లికొడుకు…
ఫోటో నాకు ఇచ్చింది కదా చూసి ఉంటానేమో అనుకోని చెప్పట్లేదు అనుకుంటా…

1 Comment

  1. Continue story interesting

Comments are closed.