(ఒక్కసారిగా సిగ్గేసి, మురిసిపోయాను. “అబ్బాయి గారికి నా పెర్సనాలిటీ ఇంకా నచ్చుతుందన్న మాట.” అనుకొని, మళ్ళీ మెసేజ్ పెట్టాను.)
నేను: ప్లీజండీ…మీరంటే పిచ్చి నాకు.
ఆయన: సారీ, పిచ్చోళ్ళంటే భయం నాకు. ( ఫక్కున నవ్వొచ్చింది నాకు. మళ్ళీ మెసేజ్ పెట్టా..)
నేను: ప్లీజ్..ప్లీజ్…ప్లీజ్..
అంతే ఆ తరువాత మళ్ళీ ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా, ఆయన దగ్గరనుండీ మెసేజ్ రాలేదు నాకు. ముందు ఆనందం వేసింది, ఒక స్త్రీ టెంప్ట్ చేస్తున్నా మా ఆయన లొంగలేదని. తరువాత చిరాకు వచ్చింది, నా మొగుడు ఇంత పప్పు సుద్ద ఏమిటా అని. అంతలోనే నా ఈగో కూడా హర్ట్ అయ్యింది, మా ఆయన నాకు పడడా అని. “ఎలాగైనా పడగొట్టి తీరుతా నిన్ను వాసుగా.” అనుకున్నా కచ్చిగా.
ఇక మిగిలిన రోజంతా ఎప్పటిలాగే రొటీన్ గా గడిచిపోయింది. మరుసటిరోజు ఆయన ఆఫీస్ కి వెళ్ళగానే, మళ్ళీ మెసేజ్ పెట్టా. “కాస్త కరుణించడి సార్.” అంటూ. నొ రిప్లయ్. ఒక అరగంట ఆగి “ఎంత అందమైన ఫిగర్ ని మిస్ అవుతున్నరో తెలుసా? కత్రినా, కాజోల్ ని కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటాను.” అని మెసేజ్ పెట్టా.
నో యూజ్. తిక్క వచ్చేస్తుంది నాకు. లాభం లేదు, ఆయన మైండ్ లో రొమాన్స్ అనే చిప్ చిట్లిపోయిఉంటుంది. బోలెడంత డిప్రెషన్ వచ్చేసింది నాకు. ఆ తిక్క, డిప్రెషన్ లోనే, ఆ సాయంత్రం అయన ఇంటికి రాగానే ఆ వంకా, ఈ వంకా పెట్టుకొని చిర్రుబుర్రు లాడేసాను. పాపం ఆయన మాత్రం నవ్వుతూ సహించేసాడు. ఈ మెసేజ్ ల ఆట ఇక సాగదని అర్ధమయి పోయింది. ఇంకేం చేయాలా అని ఆలోచిస్తుంటే ఆ రాత్రి తెల్లారిపోయింది. మరుసటి రోజు కూడా ఆలోచనల లోనే గడిపేసా. ఇక సాయంత్రం అవుతుందనగా మెసేజ్ వచ్చిన సౌండ్ వినిపించింది. కాస్త ఆశ్చర్యంగా ఓపెన్ చేసి చూస్తే, ఆయనే పంపాడు మెసేజ్ “ఏంటి మేడమ్, సైలెంట్ అయిపోయారు? ప్లీజ్ ఏదైనా మెసేజ్ పంపండి.” అని. అదిచూసి గర్వంగా “పడ్డావురా వాసుగా..” అనుకున్నా.
వెంటనే నేనూ మెసేజ్ పెట్టా, “కరుణించినందుకు థేంక్స్.” అని. వెంటనే రిప్లయ్ వచ్చింది.
ఆయన: మిమ్మల్ని వెంటనే కలవాలని ఉంది.
నేను: ఎందుకో అంత అర్జెంట్?
ఆయన: నన్ను వరించిన అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలని ఎక్జైటింగా ఉంది…ఇంతకీ మీ కొలతలు ఏమిటీ?
(“అమ్మనీ…అయ్యగారికి కొలతలు కూడా తెలియాలా..!!” అని నవ్వుకొని మెసేజ్ పెట్టా..)