అందమైన జీవితం 887

” ఏయ్..ఏమయిందని ఏడుస్తున్నావ్? ప్లీజ్…ఊరుకో నీరూ..” అన్నాడాయన నా గడ్డాన్ని పట్టుకుంటూ. నేను ఆయన చేతిని విదిలించి కొట్టి “ముందు ఆ స్వప్న ఎవరో చెప్పండి.” అన్నా. “అబ్బా…అలకలో నువ్వు ఎంత ముద్దొస్తావో తెలుసా!” అంటూ నా బుగ్గ పట్టుకోబోతే, మళ్ళీ విదిలించుకొని “ఇది అలక కాదు, కోపం…చెప్తావా, చెప్పవా?” అని అరిచాను. ఆ కోపంలో నేను గమనించలేదు. ఫస్ట్ టైమ్ ఆయనని ఏకవచనంలో సంభోదించడం. నేను అలా అనడం ఆయనకి ఏమనిపించిందో ఏమో, “చెబితే ఇంకా ఏడుస్తావు నీరూ..” అన్నాడు. “పరవాలేదు. చెప్పండి.” అన్నా మొండిగా. “నా లవర్.” చెప్పేసాడు ఆయన. “ఎప్పట్నుండీ?” అన్నాను. “చాలా రోజుల నుంచి” అన్నడాయన. “మ్..బావుంటుందా?” అని అడిగా. ఆయన మొహం లో కొంచెం కూడా నాకు దొరికిపోయానన్న బెదురు కనబడడం లేదు. మండి పోతుంది నాకు. “చెప్పండీ.. ” అన్నా. ఆయన కూల్ గా నా వైపు చూసి “మ్..బావుంటుంది.” అన్నాడు. (అదేంటీ, అసలు కలవలేదు కదా, బావుంటుందీ అని చెప్పేస్తున్నాడేమిటీ? అన్న అనుమానం వచ్చింది.).

“అలాగా నాకంటే బావుంటుందా?” అన్నాను. అయన నిర్లక్ష్యంగా తల ఎగరవేస్తూ “యా..నీ కంటే సెక్సీగా ఉంటుంది.” అన్నాడు. నాకేం మాట్లడాలో అర్ధం కావడం లేదు. ఇంతలో ఆయనే అన్నాడు “అసలు నిన్ను వదిలించుకొని, తనని తగులుకుంటే ఎలా ఉంటుందా…అని ఆలోచిస్తున్నా..” అని. ఇక అంతే… ఉక్రోషం, కోపం, మంట, బాధ, ఏడుపూ అన్నీ ఒకేసారి వచ్చేసి మీద కలబడి కొట్టడం మొదలెట్టా. ఆయన ఆ దెబ్బలను కాచుకుంటూ ” ఏయ్ నీరూ..ఆగు..ఆగరా ప్లీజ్.” అంటున్నా వినకుండా కొట్టేస్తున్నాను. ఆయన నా దెబ్బల నుండి కాచుకోడానికి ట్రై చేస్తూ, మొత్తానికి నా చేతులు దొరక పుచ్చుకొని, ” ఇందుకే, నీ కంటే స్వప్నే బెటర్ అనిపించింది.” అన్నాడు. ఆ మాటలకి ఉక్రోషంగా “అసలు నువ్వెప్పుడూ స్వప్నని చూడలేదు.” అన్నా. “నీ మొహం.. రోజూ చూస్తూనే ఉన్నా, కలుస్తూనే ఉన్నా..” అని గట్టిగా కౌగిలించుకొని, నా చెవిలో రహస్యంగా “నువ్వైనా చెప్పు స్వప్నా, మా నీరూకి..” అన్నాడు. ఒక్కక్షణం ఆయన ఏమంటున్నాడో అర్ధం కాలేదు. ఆయన మొహంలోకి చూసాను. చిలిపిగా నవ్వుతున్నాడు. “అంటే..?” అనుమానంగా అడిగా.

“నువ్వే స్వప్న అని తెలుసు నాకు. వన్ మినిట్.” అని, తన సెల్ తీసి ఒక పిక్ చూపించాడు. రెస్టారెంట్ లో నేను టేబుల్ కిందకి దూరినపుడు ఆయన సెల్ ని కిందకి దించి పిక్ తీసాడు. అప్పుడే అనిపించించింది నాకు, సెల్ నా వైపు చూస్తూందేమిటా అని. పిచ్చిదాన్ని అయిపోయాను. ఆ ఉక్రోషంలో గబగబా గదిలోకి పోయి, మంచం మీద బోర్లా పడి ఏడవసాగాను. ఆ ఏడుపుకి కారణం నేను ఓడిపోయానన్న ఫీలింగ్. ఆయన వచ్చి, నా వీపుపై నిమురుతూ “బంగారం…అలా ఉడుక్కోకురా…నువ్వు ఎందుకు ఇలా చేసావో నాకు అర్ధమయింది. ఒక రకంగా నువ్వు అనుకున్నది సాధించావ్ తెలుసా..” అన్నాడు. నేను తల తిప్పి ఆయన వైపు చూసాను. “మన లైఫ్ లో ఎగ్జైట్ మెంట్ పోయిందీ అని చాలా సార్లు చెప్పేదానివి, నాకు ఆ ఎగ్జైట్ మెంట్ ఇద్దామనే కదా ఇలా చేసింది?” అన్నాడు. మౌనంగా తల ఊపాను.

“మరి నిన్న రాత్రి జరిగింది ఒక సారి గుర్తు తెచ్చుకో..” అన్నాడు. రాత్రి ఆయన చేసిన అల్లరంతా గుర్తొచ్చి, బోలెడు సిగ్గేసి, నా చేతుల్లో మొహాన్ని దాచేసుకున్నాను. “అలా సిగ్గుపడ్డప్పుడు మొహం దాచేస్తే ఎలా? అప్పుడే కదా నువ్వు మరింత ముద్దొస్తావూ..” అంటూ నా చేతులు తొలగించడానికి ప్రయత్నించాడు. నేను చేతులు బిగించేసి మొహం తిప్పుకున్నా. ఆయన నడుము వంపులో చక్కిలిగింతలు పెట్టడం మొదలెట్టాడు. నేను పకపకా నవ్వుతూ , తట్టుకోలేక ఆయన కౌగిలిలో వాలిపోయి ఆయన గుండెల్లో తలదాచుకొని, “అసలు ఆ స్వప్న నేనేనని మీరు ఎలా కనిపెట్టారు?” అని అడిగా. “నువ్వు ఒక తింగరి మాలోకానివి కాబట్టి.” అన్నాడు మురిపెంగా. నేను చురుక్కు మని ఆయన మొహం లోకి చూసా. “అబ్బో..” అని, నా చూపులు ఆయన్ని కాల్చేస్తున్నట్టుగా ఒక ఎక్స్ ప్రెషన్ ఇచ్చి ” చెప్తా కూర్చో..” అని చెప్పడం ప్రారంభించాడు. “ఎవరో స్వప్న అనే అమ్మాయి మెసేజ్ లు చేస్తుంది. ఆమె ఇంటెన్షన్ తెలిసాక, నేను రిప్లయ్ ఇవ్వడం మానేసాను.” అని ఆయన చెప్పగానే నాకు గుర్తొచ్చింది, మొదటి మూడురోజులూ ఆయన రిప్లయ్ ఇవ్వక పోవడం.